Telugu Global
Editor's Choice

కమల రాజకీయానికి ఎరువుగా మారిన తెలంగాణ ధాన్యం

బస్తాల్లోనే ధాన్యం మొలకలొచ్చేసింది. తడిసిన ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఇక సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

కమల రాజకీయానికి ఎరువుగా మారిన తెలంగాణ ధాన్యం
X

కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ గట్టిగానే టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేసి, అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత సృష్టించి, తద్వారా తెలంగాణలో రాజకీయ కమలాలను నాటేందుకు కుట్రపూరిత వైఖరితో పనిచేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతోంది.

కస్టమ్ మిల్లింగ్‌ పాలసీని తెలంగాణలో ఎఫ్‌సీఐ పాటించకపోవడంతో లక్షల టన్నుల ధాన్యం నీటిపాలవుతోంది. సాధారణంగా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసింది. ధాన్యం మిల్లులకు చేరింది. మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన తర్వాత బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాదాపు 70 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐ సెంట్రల్ పూల్‌కు కొనుగోలు చేస్తుంది.

కానీ, తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ల్యాబొరేటరీని తెరిచింది. ఇక్కడా అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అప్పులు తీసుకోకుండా అడ్డుపడడం, కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయడం వంటివాటితో పాటు.. ఇప్పుడు ఎఫ్‌సీఐకి కూడా కేంద్రం కనుసైగ చేసిందన్న ఆరోపణలు వస్తుంది. అందుకే కొంతకాలంగా సీఎమ్‌ఆర్‌( కస్టమ్ మిల్లింగ్ రైసు) కొనుగోలును నిలిపివేసింది. అందుకు ఎఫ్‌సీఐ చెబుతున్న కారణాలు కూడా చిత్రంగా ఉన్నాయి.

రైస్ మిల్లుల్లో నిల్వలు సరిగా లేవని, ప్రొక్యూర్‌మెంట్ ఆడిట్‌లో లోపాలున్నాయని, కొన్ని మిల్లులు తనిఖీలకు సహకరించలేదంటూ ఇలా సిల్లీ కారణాలు చెప్పి బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ ఆపేసింది. దాంతో మిల్లులు మిల్లింగ్‌లు ఆపేశాయి. లక్షల టన్నుల ధాన్యం మిల్లుల ఆవరణల్లోనే ఉండిపోయింది. మిల్లింగ్‌, బియ్యం సేకరణ నిరంతరం సాగకపోవడంతో తేడా వచ్చేసింది. మిల్లుల వద్ద బహిరంగ ప్రదేశాల్లో నిల్వచేసిన ధాన్యం వర్షం బారినపడింది.

92 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే కుప్పలుగా ఉంది. ఇందులో దాదాపు 5.8 లక్షల టన్నుల ధాన్యం ఇటీవల భారీ వర్షాలకు తడిసినట్టు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్,మెదక్ జిల్లాల్లో అధికంగా ధాన్యం దెబ్బతింది. బస్తాల్లోనే ధాన్యం మొలకలొచ్చేసింది. తడిసిన ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఇక సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

ఈనెల 7 నుంచి సీఎమ్‌ఆర్‌ను ఎఫ్‌సీఐ ఆపేసింది. కొనుగోళ్లు ఆపకుండా కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని మిల్లర్లు చెబుతున్నారు. తమ వద్దకు వచ్చిన తర్వాత ధాన్యం తడిసిపోవడంతో ఈ నష్టం ఎవరి నెత్తిన పడుతుందన్న దానిపై మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వమే కాబట్టి.. నష్టాన్ని కూడా కేంద్రమే భరించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  16 July 2022 4:30 AM GMT
Next Story