Telugu Global
Editor's Choice

బీజేపీని బోనెక్కించిన కేసీఆర్!

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. కానీ అమిత్ షా తదితరులు చేస్తున్న ప్రకటనలు 'దీర్ఘ కాలిక' వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

బీజేపీని బోనెక్కించిన కేసీఆర్!
X

"శత్రువు రాకపోవచ్చునన్న సమాచారం మీద ఆధారపడకూడదు. అతని రాకకు మనం సిద్ధంగా ఉండాలి. అతడు దాడి చేయకపోవచ్చని కాకుండా మనం శత్రుదుర్బేధ్యంగా ఉండాలి" అని క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దానికి చెందిన చైనా యుద్ధ రంగ నిపుణుడు సుంజు 'ద ఆర్ట్ ఆఫ్ వార్' లో చెప్పాడు. సుంజు 'యుద్ధ కళ' ను ఔపోసిన పట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నవి. శాసన సభ్యుల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ ఆవిర్భావానికి ముందు కూడా జరిగినవే. ఇదేమీ కొత్త గాదు. వింత అంతకన్నా గాదు. అయితే తెలంగాణ స్వయం పాలిత రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఈ సన్నివేశాలు మరింత విజృంభించడం ఒక విషాదం. ఎన్నికల రాజకీయాల్లో డబ్బు కీలకమైపోయిన వాతావరణమే ఇందుకు కారణం. గడచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ రాజకీయాలను ధనబలమే శాసిస్తోంది.

బీజేపీని ప్రజల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టడంలో,ఆ పార్టీని బోను ఎక్కించడంలో టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షం కావడం, వీడియో చిత్రీకరణ... అంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. టిఆర్ఎస్‌ను దెబ్బ తీయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపుగానే ఈ కుట్రను చూడాలి. బీజేపీ ఎత్తులను చిత్తు చేయడానికి కేసీఆర్ రచించిన వ్యుహంగానూ చూడవచ్చు. కానీ సారాంశంలో మాత్రం బీజేపీ ప్రలోభపెడితే ప్రలోభపడడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సిద్ధంగా ఉన్నారన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పార్టీ అధినేత కేసీఆర్ పట్ల, పార్టీ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఎలాంటి 'బాండింగ్' లేకపోవడమే ఈ ధోరణికి దర్శనమేమో!. వ్యాపారాలు, డబ్బు, కాంట్రాక్టులు, అవకాశవాదం, ధనబలం వంటి అంశాలకు మాత్రమే రాజకీయాలలో ప్రాధాన్యం పెరిగిపోతున్నందున ఎవరూ ఎవరికీ నిబద్ధులుగా ఉండే అవకాశం లేదు. ''ఒకసారి అమ్ముడుపోయిన వాళ్ళు ఎన్ని సార్లయినా అమ్ముడుపోతారు'' అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా పరిస్థితికి అద్ధం పడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు 2018లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి టిఆర్ఎస్‌లో చేరిన 12 మందిలోని ముగ్గురు. వారు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు బీజేపీలో చేరడానికి సమస్య ఏమిటన్నది ఉత్తమ్ ప్రశ్న.

''మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది'' అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగసభలో అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు లాంటి వారు ఎన్నికల ప్రచారంలో తరచూ చెబుతున్నారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో జరిగిన బేరసారాలలో సంభాషణ సారాంశమూ ఈ కుట్రను వెల్లడించింది.

తమతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు బీజేపీ నాయకులు చాలాకాలంగా అంటున్నారు. 30 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు బండి సంజయ్ చాలా గట్టిగా చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదనుకోలేం. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు 'ఉక్కపోత'కు గురవుతున్న మాట నిజమే. అధికారం 'కేంద్రీకృతమైన' చోట ఈ సమస్య వస్తుందన్న విశ్లేషణ ఉంది. పైగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశామనుకున్న వాళ్ళు మరో వైపు నుంచి 'ప్రమాదం' ముంచుకు వస్తుందని ఎందుకు ఊహించలేకపోయారో తెలియదు. అలా ఊహించి, ముందుగానే కట్టడి చేయగలిగి ఉంటే బీజేపీ ఇట్లా పుంజుకొని ఉండేది కాదన్న అభి ప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది. కనుక బీజేపీకి నారు, నీరు ఎవరు పోశారో, ఎందుకు పోశారో తెలియదు. టిఆర్ఎస్ నాయకత్వం నిర్లిప్తత, నిర్లక్ష్యం, బిజెపిని తక్కువ అంచనా వేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న విమర్శలున్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. కానీ అమిత్ షా తదితరులు చేస్తున్న ప్రకటనలు 'దీర్ఘ కాలిక' వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తన బలాన్ని బీజేపీ ఎక్కువగా అంచనా వేసుకుంటుంది. కానీ బీజేపీ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తున్న విషయాన్ని కూడా విస్మరించరాదు. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్, బూర నర్సయ్య గౌడ్ తదితర పూర్వ టిఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి అదనపు బలం. ''టిఆర్ఎస్ మిగతా పార్టీల వారిని చేర్చుకుంటున్నప్పుడు మేమెందుకు చేర్చుకోము. మేము కూడా నిర్మొహమాటంగా చేర్చుకుంటాం. అయితే పదవికి రాజీనామా చేయాలని షరతు పెడుతున్నాం '' అని ఫిరాయింపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మొయినాబాద్ 'ప్రలోభాల' ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని తోసిపుచ్చుతూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి బీజేపీ వైఖరి స్పష్టమైంది.

కాగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో అసలు వ్యతిరేకతే లేదనడం అవాస్తవం. నిరుద్యోగులు, యువత, మరికొన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. కానీ రైతుబంధు, ఆసరా పెన్షన్ దారులు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కేసీఆర్ బలమైన ఓటు బ్యాంకులను నిర్మించుకున్నారు. 2014 నుంచి కేసీఆర్ రెండు వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నారు. 1. ప్రతిపక్షాలను నిర్ములించడం. 2. ఓటు బ్యాంకులను తయారు చేసుకోవడం. అయితే కేవలం సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ అధికారంలోకి తీసుకురావని చరిత్ర రుజువు చేసింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బలగాల మోహరింపు ఇందుకు సాక్ష్యం.

మునుగోడు ఉపఎన్నిక ఫలితం 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరి మధ్య 'యుద్ధం ' జరగనుందో తేటతెల్లం చేస్తుందని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హుజురాబాద్ కన్నా రెట్టింపు వ్యూహాలతో ప్రచారం సాగిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోటీ కాకుండా, ద్విముఖ పోటీగా ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నది. బీజేపీ బలోపేతం కాకుండా కట్టడి చేసి కాంగ్రెస్‌తోనే తమకు పోటీ ఉంటుందని టిఆర్ఎస్ నాయకత్వం చెప్పదలచుకున్నట్లున్నది. ఇక్కడ ఒక వైరుధ్యమూ కనిపిస్తున్నది. బిఆర్ఎస్ పేరిట నిర్మాణంలో ఉన్న జాతీయ పార్టీ తమ ప్రధాన శత్రువు బీజేపీ అని ఇప్పటికే ప్రకటించింది. మరి తెలంగాణలో ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీయా? బిజెపినా? ఇంకా ఒక స్పష్టతకు రావాల్సిఉంది.

మునుగోడు ఎన్నిక బీజేపీ, కేసీఆర్ మధ్య ప్రత్యక్ష యుద్ధంలా తయారైంది. ప్రతిపక్షాలు చీలిపోయి, కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థులు కావడం కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చే అంశం. ఆయన బీజీపీని, మోడీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలా చేయడం వల్ల మైనార్టీల ఓట్లు కాంగ్రెస్‌కు బదులు టిఆర్ఎస్‌కు పడే అవకాశం ఉండవచ్చు.అయితే కేసీఆర్‌కు ప్రతికూల అంశాలు, సమస్యలు కూడా ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ రాష్ట్రంలో పెరిగింది. బీజేపీ వైపు దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులు బాగా ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్‌లలో పాతతరం నాయకులు కొనసాగుతున్నందున ఆ రెండు పార్టీలతో పోల్చితే బీజేపీలో ఆయా వర్గాల కొత్త నాయకులకు అవకాశం ఎక్కువ అనే వాదన ఉంది.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ సంప్రదాయ ఓటర్లు, నాయకులు ఉన్నారు. వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనను కేసీఆర్ ప్రోత్సహించడాన్ని మెజార్టీ ప్రజలు ముఖ్యంగా యువత ఆమోదించడం లేదు. మునుగోడులో టిఆర్ఎస్‌ ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోదన్న గ్యారంటీ లేదనుకునే ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి వెనుకాడకపోవచ్చు. వారు మునిగే పడవలో ఉండరు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని భావించినా, పార్టీ టిక్కెట్ ఇవ్వదని తేలినా మరో పార్టీలోకి జంప్ చేయడం తధ్యం.

పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణలో విత్తు ముందా? చెట్టు ముందా? అనే చర్చ ఉంది. పైగా ''మాది ఫక్తు రాజకీయ పార్టీ'' అని కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కనుక వలసలు, ఫిరాయింపులు 'చట్టబద్ధ'మై పోయాయన్న అపవాదూ ఉంది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగినట్టు చెబుతున్న సన్నివేశంలో పీఠాధిపతులు, సన్యాసులు దళారులుగా వ్యవహరించడం విశేషం.

టిఆర్ఎస్ ప్రభుత్వానికి గండి పడకుండా కేసీఆర్ విజయం సాధించారు. అదే సమయంలో పార్టీ నుంచి వెలుపలికి వెళ్ళా లనుకుంటున్న వారి సమస్యలను తెలుసుకోవలసిన చారిత్రక అవసరం ఉంది.

First Published:  30 Oct 2022 11:15 AM GMT
Next Story