Telugu Global
Editor's Choice

రాజీనామాపై కోమటిరెడ్డి డైలమా!.. చేయాల్సిందేనంటున్న బీజేపీ !!

టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది.

రాజీనామాపై కోమటిరెడ్డి డైలమా!.. చేయాల్సిందేనంటున్న బీజేపీ !!
X

''త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఉప ఎన్నికలు రానున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం త్వరలోనే రద్దు కాబోతోంది. అక్కడ ఉప ఎన్నికలు తథ్యం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు. రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ అసంతృప్తిగా ఉన్నందున ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తారు. వేములవాడ, మునుగోడు నియోజకవర్గాల్లో ఎగిరేది కాషాయ జెండాయే. మూడో నియోజకవర్గం తర్వాత చెబుతా ''! అని సీనియర్ రాజకీయ నాయకుడు గోనె ప్రకాశరావు 2021 నవంబర్ మొదటి వారంలో జోస్యం చెప్పారు.

ఆయన ప్రస్తుతం ఏ రాజకీయపార్టీలోనూ లేరు కానీ వర్తమాన రాజకీయాలతో నిరంతరం టచ్ లో ఉంటారు. అయితే ఆయన జోస్యంలో ఒకటి నిజమవుతోంది. ఒకటి ఇంకా సస్పెన్సుగా ఉంది. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ‌తారన్న విషయం కొత్తదేమీ కాదు. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేబట్టిన తర్వాత కూడా అదే 'రెబల్'వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సాంకేతికంగా మాత్రమే ఉన్నారు, ఆయన మనసంతా బీజేపీలోనే ఉంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో ఇక ఎక్కడ ఉపఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ని దెబ్బకొట్టగలమన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తోంది. అందుకే ఉప ఎన్నికలను ఆ పార్టీ కోరుకుంటోంది. ఇందుకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించవలసి ఉండడంతో స్థానికంగా పట్టున్న ఎమ్మెల్యేలను చాలాకాలంగా అన్వేషిస్తోంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే ఉపఎన్నిక ఖాయమని, అందులో గెలిస్తే టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయమన్న వాతావరణాన్నీ సృష్టించవచ్చన్నది బీజేపీ పథకం. మునుగోడు మరింత కిక్కునిస్తుందని బీజేపీ గూటికి వలసలు ఉధృతం కావచ్చన్న విశ్లేషణలున్నవి. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి నిర్ధారణకు వచ్చారు. ఈటల తరహాలో టీఆర్‌ఎస్‌పై రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ నాయకుల అంచనా.

టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో విపక్షాలను ఇరుకున పెట్టడంలో కేసీఆర్‌కు మించిన వారు లేరు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు, ఉపఎన్నికలు కూడా ఒక ఆయుధంగా మలచుకొని కేసీఆర్ ఎట్లా చెలరేగారో అందరికీ తెలుసు. సరిగ్గా అదే వ్యూహాన్ని అనుసరించాలని బీజేపీ అనుకుంటోంది. కానీ తెలంగాణ సెంటిమెంటు వేరు. అధికారం కోసం ఉపఎన్నికల వ్యూహాన్ని అమలుచేయడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను అయినా ప్రజలు స్వచ్ఛందంగా ఆమోదించే వారు. ఎలాంటి ఒత్తిడి అవసరం లేకపోయేది. కానీ ప్రస్తుతం తమ బలాన్ని నిరూపించుకోవడానికో, అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం కాగలమన్న సంగతిని ప్రకటించాలనో బీజేపీ రచిస్తున్న పథకాలు హాస్యాస్పదంగా ఉన్నవి.

ఉదాహరణకు మునుగోడునే తీసుకుంటే అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల‌రెడ్డి ప్రాథ‌మికంగా నిలకడ లేని మనిషి. నిన్న మొన్నటివరకు తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని రాజగోపాల‌రెడ్డి కాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనట్టు నిర్ధారణకు వచ్చినప్పుడు ఇక వెంకటరెడ్డి సీఎం కాలేరు, రేవంత్ రెడ్డి కూడా సీఎం కాలేరు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్తును బీజేపీలోనే వెతుక్కోవాలని కే.ఆర్.జి. నిర్ణయించుకున్నట్టు అర్ధమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించినట్టు ఎమ్మెల్యే కే.ఆర్.జి.కి రాజకీయేతర వ్యవహారాలు ఎక్కువ. తన వ్యాపార ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారమూ ఉంది. గత మూడేళ్ళుగా తన నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు తక్కువ. అలాగే మునుగోడులోని మున్సిపల్ చైర్మన్‌, జడ్పిటీసిలు, పలువురు సర్పంచ్ లు, ఇతర గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిపోయారు.

బీజేపీకి మునుగోడులో నెట్ వర్క్ లేదు. కాంగ్రెస్ పార్టీ నెట్ వర్కును మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయవంతంగా చావుదెబ్బ తీశారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఆయనకు స్థానికంగా ఉండే సైనిక బలగాలు ఏవి? సొంత బలమూ, పార్టీ బలగమూ లేని వేళ ఆయన రాజీనామా చేస్తారని అనుకోవడం ఊహాజనితం. ఈటల రాజేందర్ వేరు, రాజగోపాలరెడ్డి వేరు. హుజురాబాద్ వేరు, మునుగోడు వేరు. కేవలం ధనబలం ఒక్కటే గెలిపించదు. వ్యక్తిగత ఇమేజ్, జనాకర్షణ, కార్యకర్తల బలం, ప్రజల్లో అభిమానం లేదా సానుభూతి, పోలింగు బూత్ స్థాయి మేనేజ్ మెంటు సత్తా, వంటి అనేక హంగులు కావాలి.

తెలంగాణ ఉద్యమంలో పోషించిన క్రియాశీలక భూమిక, కేసీఆర్ అన్యాయం చేశారన్న ప్రచారం వల్ల లభించిన సానుభూతి, తనకంటూ సొంత బలాన్ని అదివరకే సమకూర్చుకొని ఉండడం ఈటల విజయానికి కారణాలు. మునుగోడులో అలాంటి పరిస్థితులేమీ లేవు. కనుక ఏడాదిన్నరలో రెండు సార్లు అసెంబ్లీకి రాజగోపాలరెడ్డి పోరాడే అవకాశాలు స్వల్పం. మునుగోడులో ఉపఎన్నికను బీజేపీ తన రాజకీయ లబ్ధికోసం కాంక్షిస్తుంది. ప్రజలకు ఈ ఎన్నికలతో ఏమి సంబంధం? ప్రజలపై బలవంతంగా ఎన్నికలు రుద్దడం వల్ల వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? హుజూరాబాద్ లో ఉపఎన్నిక అనివార్యంగా వచ్చింది. మునుగోడులో ఉప్పఎన్నిక వస్తే దాని కారణాలను బీజేపీ ఎట్లా వివరించగలదు? ప్రజల్ని ఎట్లా మెప్పించగలదు?

చెన్నమనేని శాసన సభ్యత్వం రద్దు ప్రచారం..

కాగా పౌరసత్వ వివాదంలో కోర్టు కేసు ఎదుర్కుంటున్న వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ శాసన సభ్యత్వం రద్దు అవుతుందనే ప్రచారం చాలాకాలంగా ఉన్నదే ! ''వేములవాడకు ఉప ఎన్నిక జరగడం ఖాయం. అందులోనూ విజయం మాదే'' అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరేడు నెలల కిందటే ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అయితే వేములవాడకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అలాగే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి బయటకు రావడం కుదిరే పని కాదు. కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న సొంత బలానికి బీజేపీ కూడా తోడైతే ఆయన మరోసారి గెలవడం ఖాయమని బీజేపీ నమ్ముతోంది. అయితే నిజంగానే ఇది ఆచరణ రూపం దాల్చడం అనుమానమాస్పదంగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట మీద నిలబడతారా ? కేవలం కాంగ్రెస్ ను బెదిరిస్తున్నారా ? 2023 నవంబర్ లో షెడ్యూలు ప్రకారం తెలంగాణకు రావాలి.

ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ఇప్పుడు ఉప ఎన్నికలకు ఖర్చు పెట్టి, మళ్ళీ జనరల్ ఎన్నికలలో ఖర్చు పెట్టడం అవసరమా? అని కూడా కే.ఆర్.జి.ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆయన ప్రాథమికంగా వ్యాపారి. తర్వాత రాజకీయ నాయకుడు. ఒకసారి ఎంపీగా, ఎం.ఎల్.సి.గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. జార్ఖండ్ కు చెందిన పలు కాంట్రాక్టు పనులను ఇటీవల కాలంలో బీజేపీ నాయకుల సహకారంతో చేజిక్కించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌ రంగప్రవేశాన్ని నిలువరించి తెలంగాణలోనే ఎంగేజ్‌ చేసేందుకు ఉప ఎన్నికను సృష్టించడానికి గాను కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ప్రయోగించాలన్నది బీజేపీ సంకల్పం. బీజేపీలో తన చేరిక ఖాయమని అనుచరులకు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కండువా వేసుకోకుండానే కోమటిరెడ్డి గెలుపునకు సహకరించాలని ఒక పథకాన్ని రచిస్తున్నారు. అంటే టీఆర్ఎస్ ను ఓడించడానికి గాను బీజేపీకి కాంగ్రెస్ పరోక్షంగా సహకారమందించవచ్చు. కానీ ఈ వ్యూహాన్ని భగ్నం చేయకపోతే రేవంత్ ప్రతిష్ట భారీగా దెబ్బతింటుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 105 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను అనూహ్యంగా గెలిచినందున బీజేపీలో కొత్త ఆశలు చిగురించాయి. బండి సంజయ్ టీ-బీజేపీ అధ్యక్షుడయిన నాటి నుంచి ఆయన దూకుడు శైలి.'మిలిటెంట్' భాష, పాదయాత్ర, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో బీజేపీ పుంజుకుంటున్న మాట నిజమే! అయితే కేసీఆర్ తో ఒంటరిగా తలపడగలిగే బీజేపీ సత్తాపై ఇంకా అనుమానాలున్నాయి.

First Published:  23 July 2022 3:30 AM GMT
Next Story