Telugu Global
Editor's Choice

సీబీఐ, ఈడీకి ఈ ఏడుగురు అవినీతిపరులు కనపడరా? ఇదేం న్యాయం మోడీజీ.!

ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.

సీబీఐ, ఈడీకి ఈ ఏడుగురు అవినీతిపరులు కనపడరా? ఇదేం న్యాయం మోడీజీ.!
X

అవినీతిపరులు ఎలా నీతిమంతులు అయిపోతున్నారో అనే విషయంపై ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ప్రెస్‌ మీట్‌లో ఒక వీడియో ప్రదర్శించారు. ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా బీజేపీ కండువా కప్పుకోగానే 'వాషింగ్ పౌడర్ నిర్మా' లాగ తెల్లగా అయిపోతారనేది ఆ వీడియోలో వ్యంగ్యం. చెప్పుకోవడానికి ఇది సరదా అయిన విషయమే కానీ.. గత కొన్నాళ్లుగా దేశంలో జరుగుతున్నది ఇదే. ఎంతటి అవినీతిపరుడైనా బీజేపీలో చేరితే/ఉంటే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం సీబీఐ, ఈడీ దాడులతో వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఖాయమే.

ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు శుద్ధ‌పూసలు, నీతిపరులు అని ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రమే ఇక్కడ చర్చించాల్సిన అసలు విషయం. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ.. ఇప్పటికే కేసులు నమోదైన బీజేపీ మాజీ సీఎంలు, కీలక నాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు.

బీఎస్ యడియూరప్ప:

కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బీజేపీకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవసరం పడినప్పుడల్లా యడియూరప్పనే సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే సీఎంగా ఆయన ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉన్నది. భూకబ్జాలు, అక్రమ మైనింగ్ వంటి విషయాల్లో యడియూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా బీజేపీ నాయకులు, జడ్జీలు, న్యాయవాదులకు భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చినట్లు కూడా ఆయన నుంచి సేకరించిన డైరీలు రుజువు చేస్తున్నాయి. సీబీఐ గతంలోనే ఆయన అవినీతిపై దర్యాప్తు చేసింది. అయితే మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యడియూరప్పపై దర్యాప్తు నిలిచిపోయింది. ఆయన కేసుల్లో కనీసం చార్జిషీటు కూడా వేయడం లేదు. ఓ ల్యాండ్ స్కాంలో యడియూరప్పపై ఉన్న కేసులో దర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. అది ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

బళ్లారి బ్రదర్స్:

బళ్లారి బ్రదర్స్ అంటే చాలా మందికి పెద్దగా అర్థం కాదు. కానీ గాలి జనార్థన్ రెడ్డి అండ్ బ్రదర్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుపరిచితం అయిన పేరు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బళ్లారి బ్రదర్స్ మీద సీబీఐ ఓ దర్యాప్తు చేసింది. మైనింగ్ స్కాంలో రూ. 16,500 కోట్ల అవినీతి జరగగా.. అందులో ప్రధాన పాత్ర బళ్లారి బ్రదర్స్ (గాలి జనార్థన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి)దే అని గుర్తించింది. భారత జాతీయ సంపదను వాళ్లు అక్రమంగా కొల్లగొట్టినట్లు ఆ దర్యాప్తులో పేర్కొన్నది. కానీ ఎప్పుడైతే గాలి జనార్థన్ రెడ్డి బీజేపీలో చేరాడో అప్పుడే ఆ కేసు అటకెక్కింది. ఈ కేసును ఎవరైతే ముందుండి నడిపించారో.. వాళ్లను మోడీ ప్రభుత్వం పీకి అవతల పారేసింది. ఇప్పటికీ గాలి జనార్థన్ రెడ్డి కుటుంబం ఎలాంటి కేసులు లేకుండా హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

హిమంత బిశ్వ శర్మ:

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో అందరికీ ఏక్‌నాథ్ షిండే పేరుతో పాటు అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేరు ఎక్కువగా వినిపించింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్‌తో రక్షణ కల్పించారంటూ అస్సోం సీఎం హిమంత పేరు మీడియాలో మార్మోగిపోయింది. అయితే ఆయన బీజేపీకి అంత విధేయుడిగా ఉండటానికి అసలు కారణం వేరే ఉన్నది. గౌహతీలో జరిగిన వాటర్ సప్ల‌య్‌ స్కాంలో హిమంత పాత్ర ఉందంటూ కాంగ్రెస్ ఒక బుక్‌లెట్ ప్రచురించింది. అమెరికాకు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టిన ఆ పనుల్లో.. భారీ అవినీతి జరిగిందంటూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఆరోపణలు చేసింది. సదరు కంపెనీకి భారీగా ముడుపులు ముట్టినట్లు పేర్కొన్నది. అయితే బీజేపీ సీఎంగా మారిపోయిన తర్వాత ఆయనపై దర్యాప్తు ఆగిపోయింది. అసలు వాటర్ సప్ల‌య్‌ స్కాంను ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు.

శివరాజ్ సింగ్ చౌహాన్:

మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ ఎంట్రెన్స్, సీట్ల విషయంలో జరిగిన వ్యాపమ్ స్కామ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2017లో ఈ స్కాం జరిగిన సమయంలో మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. కేంద్రం సీబీఐతో వ్యాపమ్ స్కాంను వేగవంతంగా దర్యాప్తు చేయించింది. ఆ కేసుకు సంబంధించిన సాక్షులు, అనుమానితులు వరుసగా అనుమానాస్పదంగా చనిపోవడం కూడా సంచలనం సృష్టించింది. అయితే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండటంలో సీబీఐ తర్వాత వ్యాపమ్ విచారణను పక్కన పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మీద ఇప్పటి వరకు విచారణ కూడా జరగలేదు.

ముకుల్ రాయ్:

బీజేపీకి మొదటి నుంచి బెంగాల్‌లో అధికారం చేపట్టాలనే లక్ష్యం ఉండేది. పాతికేళ్లకు పైగా అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీని మమత బెనర్జీ ఓడించి సీఎంగా పీఠం ఎక్కింది. అయితే అప్పట్లో ఆ పార్టీలో ఉన్న ముకుల్ రాయ్ 'శారద చిట్ స్కాం' కేసులో ఇరుక్కున్నారు. ఆయను ఈడీ ముప్పతిప్పలు పెట్టింది. మీడియా కూడా ఈడీకి సహకరించి ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్‌ పరువు తీశాయి. అయితే.. శారద చిట్ స్కాంలో ఇరుక్కున్న ముకుల్ రాయ్ ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆ కేసు అటకెక్కింది. అప్పట్లో రచ్చ రచ్చ చేసిన బెంగాల్ బీజేపీ నాయకులు ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడటం లేదు.

రమేశ్ పోఖ్రియాల్:

రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్.. మోడీ క్యాబినెట్‌లో రెండేళ్లకు పైగా విద్యాశాఖ మంత్రిగా (అప్పట్లో అది హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ) పని చేశారు. అయితే అంతకు ముందు ఉత్తరాఖండ్ మంత్రిగా పని చేసే సమయంలో ఆయన రెండు పెద్ద స్కాంలలో ఇరుక్కున్నారు. ఒకటి భూకబ్జాలకు సంబంధించింది కాగా.. మరొకటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో చేసిన అవినీతి. 2011లో ఆయనపై భారీ ఆరోపణలు రావడంతో బీజేపీ పార్టీనే ఆయనను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయమని కూడా కోరింది. అయితే అప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ కానీ, సీబీఐ కానీ ఈ కేసుపై శ్రద్ద పెట్టలేదు. అంతే కాకుండా ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఏకంగా మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావడం గమనార్హం.

నారాయణ్ రాణే:

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేత నారాయణ్ రాణేపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే రెండేళ్ల క్రితం ఆయనను బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఈడీ, సీబీఐ ఆయన అక్రమాస్తులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాయి. అవే కాకుండా మనీలాండరింగ్ కేసులు కూడా నారాయణ్ రాణేపై ఉన్నాయి. మహారాష్ట్రలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న మొదటి బీజేపీ నేత కూడా ఈయనే. అయినా సరే పార్టీ ఆ ఆరోపణలను, దర్యాప్తును పూర్తిగా పక్కన పెట్టింది.

First Published:  3 Aug 2022 5:10 PM GMT
Next Story