Telugu Global
Editor's Choice

నియంతలందరిదీ ఒకే దారి

ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది.

నియంతలందరిదీ ఒకే దారి
X

భారతీయ జనతా పార్టీ విభిన్నమైన పార్టీ అంటారు. క్రమశిక్షణ ఆ పార్టీలో ఉన్నంతగా మరే పార్టీలోనూ లేదంటారు. మోదీ, అమిత్ షా ద్వ‌యం ప‌గ్గాలు చేపట్టిన తరవాత అట్టడుగు స్థాయిలో కూడా బీజేపీని విస్తరింప చేయడానికి బాగా శ్రద్ధ తీసుకున్నారు. పోలింగ్ కేంద్ర స్థాయిలోనూ బీజేపీ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ తరవాత మరింత వీకేంద్రీకరించి పన్నాకమిటీలు (ఓటర్ల జాబితాలో ఒక్కోపేజీకి ఒక కమిటీ) ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది. పార్టీని నడపడంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా మాటకేంగాని మోదీ, అమిత్ షాల‌ సరళి కార్యకర్తలకు ఏ ప్రాధాన్యతా లేకుండా చేసింది. ఎనిమిదేళ్లకు పై నుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది. దీని వల్ల పార్టీ యంత్రాంగం పౌరులకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం సాధించలేకపోతోంది.

ప్రజల అవసరాలు తీర్చడంలో జాతీయ నాయకులు తమ విధానాలను మౌలికంగా మార్చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికార వర్గం ద్వారా పథకాలను అమలు చేస్తుంది. దీని వల్ల ఎమ్మెల్యేలకు, బీజేపీ కార్యకర్తలకు జనంతో సంబంధం లేకుండాపోతోంది. స్థానిక అధికారుల బదిలీలపై ఎమ్మెల్యేల మాట చెల్లదు. గత సంవత్సరం కేంద్రం అధీనంలో అమలయ్యే పథకాలన్నింటినికి సమాచార సాంకేతిక వ్యవస్థ (ఐ.టి) ద్వారానే నిధులు మంజూరు వంటివి జరిగిపోయాయి. ప్రజల సమస్యలను, అభిప్రాయాలను అధికారులకో, నాయకులకో తెలియజేసే అవకాశమే లేకుండాపోయింది. స్థానికంగా ఏం జరుగుతోందో ప్రధానికి తెలియదు. కానీ, ఐ.టి ద్వారా అన్నిపనులు చక్కబడుతున్నాయని ఆయన భావిస్తారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూజ్యమైపోయింది. 2014 కన్నా ముందు అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి అన్న భావన ఉండేది. ఇప్పుడు పార్టీలో ఏ పదవికీ ఎన్నిక జరగదు. అంతా కేంద్ర నాయకత్వం నియమించినవారే ఉంటారు. పార్టీ కార్యవర్గ సభ్యులు వంటివారు పైస్థాయి నాయకులకు నచ్చే మాటలే చెప్తారు తప్ప ప్రజల గోడు ప్రస్తావనే ఉండదు. అంటే కింది నుంచి పైకి ఏ సమాచారమూ చేరదు. ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్‌ స‌రిగ్గా ఇలాగే ఉండేది. అందువల్ల కాంగ్రెస్‌కు ఏ గతిపట్టిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి వంటి పదవులలో నియమిమించేటప్పుడు కూడా వినయ విధేయతలతో ఉండేవారికే ప్రాధాన్యం తప్ప సామర్థ్యం ఊసే ఉండడం లేదు. సామర్థ్యం ఉన్న నేతలైతే అధినేతకు పోటీగా తయారవుతారన్న అనుమానంతో అలాంటివారినందరినీ పక్కకు నెట్టేశారు. పార్లమెంటరీ బోర్డులో జరిగిన మార్పులు ఈ వైఖరికి తాజా ఉదాహరణ. నితిన్‌ గ‌డ్కరి, శివరాజ్ సింగ్‌ చౌహాన్, యోగీ ఆదిత్యనాథ్‌కు కూడా అందులో చోటు దక్కలేదు.

రెండేళ్లుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమే జరగలేదు. రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా పెత్తనం కేంద్ర నాయకులదే. రాష్ట్ర పార్టీ నాయకుల సూచనలను, సలహాలను వినిపించుకోరు. కేంద్రం ఎంపిక చేసేవారికి స్థానికంగా ఆదరణ లేదని చెప్పినా వినరు. అందువల్ల గెలిచే చోట కూడా బీజేపీ ఓటమిపాలైంది. అలాంటి సమయంలో నింద మాత్రం రాష్ట్ర స్థాయి నాయకుల మీదే వేస్తారు. తద్వారా స్థానిక నాయకులు నిరాశకు గురవుతారు. ఒకవేళ రాష్ట్రాలలో బీజేపీకి మెజారిటీ లేకపోతే "ఆపరేషన్ లోటస్" ప్రయోగిస్తారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు.

చాలా కాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నవారి కన్నా తాజాగా ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నవారికే ప్రాధాన్యం ఎక్కువ. వారికే పదవులు దక్కుతున్నాయి. ఇలాంటి వైఖరి వల్లే ఇటీవల మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఎదురు దెబ్బలు తినాల్సివచ్చింది. ఫిరాయింపుదార్లను ప్రోత్సహించడం వల్ల తాము ఎన్నుకున్నవారికి విలువ లేకుండాపోయిందని బీజేపీకి మద్దతిచ్చేవారే భావిస్తారు. ఇలాంటివాటిని ప్రజలు మరిచిపోతారులెమ్మన్న ధోరణిలో జాతీయ నాయకత్వం ఉంటుంది. కానీ ఓటర్లు తెలివైనవాళ్లు. అందుకే 1980 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలలో మూడింత రెండు వంతులను గద్దెదించారు. మహారాష్ట్రలో దొడ్డిదారిన బీజేపీ అధికారం సంపాదించింది. కానీ, ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కేవలం 18 సీట్లే వస్తాయని సర్వేలు చెప్తున్నాయి. మిగతా 30 లోకసభ సీట్లలో కుట్రకు బలైనవారే విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. పోలింగ్ కేంద్ర క‌మిటీ స్థాయిలో పనిచేసేవారిని కనీసం పోలింగ్‌ రోజున కూడా పట్టించుకోరు. చాలా సందర్భాలలో తదుపరి ఎన్నికలలో వీరి అడ్రసే కనిపించడం లేదు.

నిధుల సేకరణ కేంద్రీకృతమేకనక అంతా మోదీ పెత్తనమే. గల్లా పెట్టె బీగాలు ఆయన దగ్గరే ఉంటాయి. కింది స్థాయివారికి నిధులే అందడంలేదు. స్థానికంగా నిధుల వసూలును అనుమతించడం లేదు. కేంద్రమే వసూళ్లు చేయడం వల్ల 2019లో బీజేపీకి మిగతా అన్ని పార్టీలకు సమకూరిన నిధుల కన్నా 18 రెట్లు ఎక్కువ అందాయి. వ్యక్తి ఆరాధనే ప్రధానం కావడంతో ఎటుచూసినా మోదీ భక్తులే కనిపిస్తారు. ఆయన కీర్తిగానంలో మునిగి తేలుతుంటారు. వెంకయ్యనాయుడు అంతటివాడే "మోదీ దేవుడిచ్చిన వరం" అని తరించిపోయారు. అందుకే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి దక్కింది. మధ్యప్రదేశ్ వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి అయితే మోదీ దైవాంశ సంభూతుడు.. రాముడు, కృష్ణుడు అన్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఒక అడుగు ముందికేసి మోదీ దేవతలకే రాజు అంటే ఇంద్రుడు అన్నారు. మతాలవారీగా జనాన్ని చీల్చడం వల్ల తరచుగా పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మైనారిటీల మీద హేయ‌మైన దాడులు జరిగినప్పుడు మోదీ మౌనం వహించడం చూస్తే ఆ దుశ్చర్యలను ఆయన ఆమోదిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇది వరకు కాంగ్రెస్‌ చేసిన తప్పులే మోదీ గుప్పెట్లోని బీజేపీ చేస్తోంది. నియంతలందరిదీ ఒకే దారి కాబోలు.

First Published:  5 Sep 2022 2:51 AM GMT
Next Story