Telugu Global
CRIME

యూపీలో దారుణం.. రేప్ కేసు బాధితురాలి తల్లిని రేప్ చేసిన పోలీస్..

కనౌజ్ జిల్లా ఎస్పీ అనుపమ్ సింగ్ ని కలసిన‌ ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనూప్ కుమార్ మౌర్య తనపై చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. తన కుమార్తెకు న్యాయం చేయాలని వస్తే, తనపైనే అత్యాచారం చేశారని ఆమె వాపోయారు.

యూపీలో దారుణం.. రేప్ కేసు బాధితురాలి తల్లిని రేప్ చేసిన పోలీస్..
X

దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన యూపీలో మరో దారుణం జరిగింది. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని రక్షణ కోరిన ఓ తల్లికి, అండగా నిలబడాల్సిన పోలీస్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని కనౌజ్ లో జరిగింది. ఆగస్ట్ 29న 17 ఏళ్ల తన కుమార్తెపై అత్యా చారం జరిగిందని ఓ మహిళ కనౌజ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చింది. కేసు నమోదు చేసుకునే క్రమంలో ఆమెతో మాట్లాడాలంటూ హాజీ షరీఫ్ ఔట్ పోస్ట్ ఇన్ చార్జ్ అనూప్ కుమార్ మౌర్య ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. న్యాయం చేస్తాడనుకుని వచ్చిన ఆ బాధితురాలి తల్లి.. చివరకు మరో బాధితురాలిగా మిగిలింది. అయితే ఆమె కుంగిపోలేదు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటూ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది.

ఎస్పీకి కంప్లయింట్..

కనౌజ్ జిల్లా ఎస్పీ అనుపమ్ సింగ్ ని కలసిన‌ ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనూప్ కుమార్ మౌర్య తనపై చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. తన కుమార్తెకు న్యాయం చేయాలని వస్తే, తనపైనే అత్యాచారం చేశారని ఆమె వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఎస్పీ అనుపమ్ సింగ్.

అనూప్ కుమార్ అరెస్ట్..

ప్రాథమిక విచారణలో ఆ మహిళ ఆరోపణలు నిజమని తేలడంతో పోలీసులు అనూప్ కుమార్ మౌర్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచబోతున్నట్టు తెలిపారు. విచిత్రం ఏంటంటే.. జూలై 30న సదరు అనూప్ కుమార్ మౌర్య పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ గా ప్రమోషన్ పొందాడు. ప్రమోషన్ తీసుకున్న అతడు తన నీచ‌ మనస్తత్వాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.

First Published:  30 Aug 2022 10:35 AM GMT
Next Story