Telugu Global
CRIME

85 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

9 మంది స్మగ్లర్లు అరెస్టు, నాలుగు టూ వీలర్లు, ఒక అశోక్ లేలాండ్ స్వాధీనం

85 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
X

పాపనాశనం, తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో 85 ఎర్రచందనం దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్ కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన మూడు బృందాలు శుక్రవారం రాత్రి నుంచి తిరుమల, పాపనాశనం ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.


ఈ సంద‌ర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఒక టీమ్ పాపనాశం పరిధిలో 30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో టీమ్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద కొంత మంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళ్తుండగా చుట్టుముట్టారు. వీరి నుంచి మ‌రో 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్నవారందరూ స్థానికులు కాగా, వారిని పెంచలయ్య (49), పరంధామయ్య (45), సందూరి సుబ్రమణ్యం (36), బోయలగడ్డ మునిస్వామి (68), మంకు వరదరాజులు (60), నారగంటి మురళి (45), కొండారెడ్డి చెంగల్రాయుడు (36), మల్లికార్జున (25) గా పోలీసులు గుర్తించారు.


మరో టీమ్ తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో 6వ మైలు వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలు మోసుకొని వెళ్తుండ‌గా టాస్క్ ఫోర్సు టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. అందులో ఒకరిని అరెస్టు చేయగా, అతనిని ఆరుముల్ల శ్రీనివాసులు (24)గా గుర్తించారు. వీరి నుంచి 25 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 85 ఎర్రచందనం దుంగలు 1.5 టన్నుల బరువు ఉన్నాయని, వీటి విలువ రూ.1.20 కోట్లు ఉంటుంద‌ని సీఐ తెలిపారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామ‌న్నారు. టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story