Telugu Global
CRIME

మద్యంతో పాటు స్వీట్ తినిపించండి- కిటుకు చెప్పి భర్తను చంపించిన భార్య

వడివేలు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. 26ఏళ్ల సెల్విరాణి చిత్తూరు చర్చివీధిలో బిందెల దుకాణంలో పనిచేస్తోంది. అదే వీధిలో ఎంబీఏ వరకు చదివిన వినయ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు.

మద్యంతో పాటు స్వీట్ తినిపించండి- కిటుకు చెప్పి భర్తను చంపించిన భార్య
X

చిత్తూరులో ఒక మహిళ ప్రియుడితో త‌న‌ భర్తను హత్య చేయించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ''మనది స్వచ్ఛ‌మైన ప్రేమ. దీన్ని గెలవాలంటే నా మొగుడిని చంపేయాలి. అప్పుడు ఇద్దరం హాయిగా కలిసి బతకవచ్చు'' అంటూ ప్రియుడిని ఉసిగొల్పి భర్తను చంపించింది. వారం క్రితం చిత్తూరు శివారు ప్రాంతంలో ఆటోడ్రైవర్ వడివేలు హత్యకు గురయ్యాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వడివేలును అతడి భార్య సెల్విరాణి, ఆమె ప్రియుడు వినయ్ కలిసి హత్య చేయించినట్టు తేల్చారు.

వడివేలు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. 26ఏళ్ల సెల్విరాణి చిత్తూరు చర్చివీధిలో బిందెల దుకాణంలో పనిచేస్తోంది. అదే వీధిలో ఎంబీఏ వరకు చదివిన వినయ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. అతడితో స్నేహం చేసిన సెల్విరాణి తనకు పెళ్లికాలేదంటూ నమ్మించి ప్రేమలోకి దింపింది. ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందామని వినయ్ ఒత్తిడి తేగా తనకు వివాహం జరిగిన విషయాన్ని ఒకరోజు వివరించింది. మనం కలిసి ఉండాలంటే తన భర్త వడివేలును చంపేస్తే సరి అని చెప్పింది.

సంతపేటకు చెందిన తన స్నేహితుడు నిరంజన్ సాయంతో కిరాయి హంతకుడు కిషోర్‌ను సంప్రదించాడు వినయ్. హత్య కోసం రూ. 2.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఆటోస్టాండ్‌కు వెళ్లి వడివేలుతో మాట కలిపి స్నేహం చేసిన కిషోర్.. అతడికి మద్యం తాగించి ఆ తర్వాత హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. మద్యం సేవించిన తర్వాత కూడా వడివేలు ఏమాత్రం తొలకకుండా స్ట్రాంగ్‌గా ఉండడంతో హత్య చేసేందుకు అవకాశం దొరకలేదు. ఈ విషయాన్ని సెల్విరాణికి చెప్పగా.. తన భర్తకు కేవలం మద్యం తాగితే మత్తురాదని.. మద్యం తాగిన తర్వాత స్వీట్‌ తింటే వెంటనే అతడికి నిద్రవచ్చేస్తుందని వివరించింది.

ఆమె చెప్పినట్టే చేసిన కిషోర్.. వడివేలు మత్తులోకి జారుకున్న తర్వాత తలపగులగొట్టి.. 23సార్లు కత్తితో పొడిచి, ఆపై గొంతు కోసి దారుణంగా చంపేశాడు. వడివేలు మృతదేహాన్ని పోలీసులు గుర్తించగా తన భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ నటించిన సెల్విరాణి.. ఆ సమయంలోనే వినయ్‌కు వాట్సాప్‌ కాల్ చేసి ఇక మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామంటూ చెప్పింది. అయితే సాంకేతిక ఆధారాలను సాధించిన పోలీసులు.. సెల్విరాణి, వినయ్, కిషోర్, నిరంజన్‌ కలిసి ఈ పని చేసినట్టు వెంటనే తేల్చేశారు. ఆదివారం నిందితుల్లో ముగ్గురిని ఒకేచోట అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసిన విషయాన్ని అంగీకరించారు.

ఈ తరహా చాలా హత్యల్లో.. భర్త అడ్డుతొలగించుకుంటే ప్రియుడితో, భార్య అడ్డుతొలగింకుంటే మరో ప్రియురాలితో జాలీగా ఉండవచ్చని హంతుకులు భావిస్తున్నారు. కానీ, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు కేసును ఛేదిస్తారు.. అప్పుడు ప్రియుడితో లేదా ప్రియురాలితో కలిసి ఉండడం అటుంచితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందన్న కనీస ఆలోచన లేకపోవడం ఇలాంటి అఘాయిత్వాలకు కారణమవుతోంది. ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోవాలే గానీ.. ఇలా హత్య చేస్తే.. పోయినోడి కంటే హత్య చేసిన వారే జీవితాంతం ఆ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

First Published:  12 Dec 2022 3:16 AM GMT
Next Story