Telugu Global
CRIME

వాట్సప్ లింక్ తో 21 లక్షలు మాయం.. ఏపీలో భారీ మోసం..

తాజాగా ఏపీలో అతి పెద్ద ఆన్ లైన్ మోసం ఇలా బయటపడింది. చిత్తూరు జిల్లాలో ఓ మహిళా రిటైర్డ్ టీచర్ ఇలా ఆన్ లైన్ మోసానికి బలైంది. 21 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

వాట్సప్ లింక్ తో 21 లక్షలు మాయం.. ఏపీలో భారీ మోసం..
X

ఆన్ లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. అదే సమయంలో రూటు మార్చుకుంటున్నాయి. మీ బ్యాంక్ డిటైల్స్ అప్డేట్ చేస్తున్నాం వివరాలు చెప్పండి, మీ మొబైల్ కి ఓటీపీ వచ్చింది చెప్పండి.. అంటూ ఇప్పటి వరకూ మోసాలు జరిగాయి. వీటిపై జనాలకు అవగాహన పెరగడంతో కేటుగాళ్లు కూడా రూటు మార్చారు. వాట్సప్ లింక్ లు పంపిస్తూ, అవి ఓపెన్ చేయగానే బ్యాంక్ నుంచి డబ్బులు మాయం అయ్యేలా సెట్ చేస్తున్నారు. కాస్తో కూస్తో ఆన్ లైన్ పరిజ్ఞానం ఉన్నవారు సరే.. వృద్ధులు, గేమ్స్ ఆడుతూ ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేసే పిల్లలు.. వీరి టార్గెట్. తాజాగా ఏపీలో అతి పెద్ద ఆన్ లైన్ మోసం ఇలా బయటపడింది. చిత్తూరు జిల్లాలో ఓ మహిళా రిటైర్డ్ టీచర్ ఇలా ఆన్ లైన్ మోసానికి బలైంది. 21 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె పట్ట‌ణంలో రిటైర్డ్ టీచ‌ర్ వ‌ర‌ల‌క్ష్మి త‌న ఖాతా నుంచి న‌గ‌దు విత్‌ డ్రా అయిన‌ట్టు మెసేజ్ రావ‌డంతో స్ధానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియ‌ని కాంటాక్ట్ నుంచి వ‌చ్చిన వాట్సాప్ లింక్‌ను ఆమె క్లిక్ చేసిన వెంట‌నే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి న‌గ‌దు విత్‌ డ్రా అయిన‌ట్టు మెసేజ్ వ‌చ్చింది. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు.

వాట్సప్ మెసేజ్ కు లింక్ పంపించిన సైబ‌ర్ నేర‌గాళ్లు, అది ఓపెన్ చేసిన వెంటనే ఆమె బ్యాంక్ ఖాతా హ్యాక్ చేశారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఉన్న 21 లక్షలను ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. వెంటనే ఆమె సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. మొత్తం డబ్బులు విత్ డ్రా అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ రావడంతో వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొత్త మార్గాలు..

దొంగతనం అయినా, దోపిడీ అయినా ఇప్పుడంతా ఆన్ లైన్లోనే. చేతికి మట్టే కాదు, కనీసం దుమ్ము, ధూళి కూడా అంటదు. అంత సింపుల్ గా మాయచేయొచ్చు. అయితే అవతలి వ్యక్తి ఈజీగా బుట్టలో పడగలిగితేనే ఇలాంటి మాయగాళ్ల పాచిక పారుతుంది. గతంలో మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలాంటి వివరాలేవీ అడక్కుండానే, వాట్సప్ నెంబర్ కు మెసేజ్ పెట్టడం, ఆ మెసేజ్ క్లిక్ చేయగానే డేటా ట్రాన్స్ ఫర్ కావడం.. ఇదీ కొత్త పద్ధతి. ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు పోలీసులు. మనకు తెలియ‌ని నెంబ‌ర్లు, వ్యక్తులనుంచి వాట్సప్ ద్వారా వచ్చే లింక్ లను ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయి, ఉచిత బహుమతులు వస్తాయి, డిస్కౌంట్లు వస్తాయి, మొబైల్ రీచార్జి ఉచితం.. అంటూ వచ్చే మెసేజ్ లను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.

First Published:  25 Aug 2022 3:32 AM GMT
Next Story