Telugu Global
CRIME

ఆఖరిలో రెండు వేలు అడిగిందని చంపేశాడు.. ఇలా దొరికిపోయాడు

గతేడాది మే29న శ్రీకాకుళం బస్‌స్టాండ్‌లో రిషికి ధనలక్ష్మీ పరిచయం అయింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు ఆమె విశాఖ రాగా.. రాత్రికి తన రేకుల షెడ్‌కు తీసుకెళ్లాడు.

ఆఖరిలో రెండు వేలు అడిగిందని చంపేశాడు.. ఇలా దొరికిపోయాడు
X

విశాఖ మధురవాడలో ప్లాస్టిక్‌ డ్రమ్ములో అస్థిపంజరం బయట పడిన కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మందన గ్రామానికి చెందిన రిషి అనే వ్యక్తి గతంలో నండూరి రమేష్ అనే వ్యక్తి దగ్గర వెల్డింగ్ పనిలో చేరాడు. రమేష్‌కు విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో ఒక రేకుల షెడ్‌ ఉండేది. అందులో ఉండేందుకు తన దగ్గర పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇచ్చాడు.

భార్య ప్రసవం కోసం 2021 జనవరిలో సొంతూరు వెళ్లగా రిషి ఒక్కడే అక్కడ ఉండేవాడు. ఆ తర్వాత వెల్డింగ్ పనిలోకి వెళ్లడం కూడా మానేశాడు. రేకుల షెడ్ అద్దె కూడా చెల్లించడం లేదు. రమేష్‌కు అందుబాటులోకి కూడా రాలేదు. నెలనెల కరెంట్ బిల్లు కూడా చెల్లించకపోవడంతో రేకుల షెడ్‌ కరెంట్ బిల్లు భారీగా రావడం మొదలైంది. దాంతో ఈనెల 4న రమేష్ రేకుల షెడ్‌ వద్దకు వెళ్లి పరిశీలన చేశాడు. అక్కడే టేపుతో పూర్తిగా కట్టుదిట్టం చేసి ఉంచిన డ్రమ్ము కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో అస్థిపంజరం బయటపడింది. వెంటనే రమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి హత్య చేసింది గతంలో రమేష్ దగ్గర పనిచేసిన రిషినే అని తేల్చారు. అస్థిపంజరం శ్రీకాకుళం మొండెటివీధికి చెందిన 26ఏళ్ల ధనలక్ష్మిదిగా తేల్చారు. రిషిని అరెస్ట్ చేయగా జరిగిన విషయాలను చెప్పాడు.

గతేడాది మే29న శ్రీకాకుళం బస్‌స్టాండ్‌లో రిషికి ధనలక్ష్మీ పరిచయం అయింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు ఆమె విశాఖ రాగా.. రాత్రికి తన రేకుల షెడ్‌కు తీసుకెళ్లాడు. తెల్లవారిన తర్వాత ఆమె తిరిగి వెళ్లే సమయంలో రెండు వేలు ఇవ్వాల్సిందిగా అడిగింది. తన దగ్గర డబ్బు లేదని రిషి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రిషి తన దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పగా.. భార్యకు చెందిన దుస్తులు, టీవీ ఇవ్వాల్సిందిగా ధనలక్ష్మి ఒత్తిడి తెచ్చింది. లేకుంటే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించింది.

దాంతో ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు రిషి. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక పెద్ద ప్లాస్టిక్‌ జిప్ కవర్‌లో కుక్కి.. ఆ తర్వాత ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి పైకప్పు మూసి వాసన బయటకు రాకుండా ఉండేందుకు టేపుతో చుట్టేశాడు. ఆతర్వాత చెన్నై పారిపోయాడు. ఇటీవల తిరిగి విశాఖ వచ్చి ఒక స్కూల్‌లో వంట మనిషిగా చేరాడు.

రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రిషి ఉన్న రేకుల షెడ్‌ను పరిశీలించిన సమయంలో అక్కడే ధనలక్ష్మికి చెందిన ఫోన్‌ దొరికింది. ఆమె ఆఖరి సారిగా ఫోన్ చేసింది రిషికేనని తేలింది. గతంలో అక్కడ ఉన్నది కూడా అతడేనని నిర్ధారణ రావడంతో రిషిని అరెస్ట్ చేశారు. ధనలక్ష్మికి తల్లిదండ్రులు గానీ, ఇతర కుటుంబసభ్యులు గానీ లేకపోవడంతో ఆమె గురించి ఎవరూ ఆరా తీయలేదని పోలీసులు గుర్తించారు.

First Published:  7 Dec 2022 3:40 AM GMT
Next Story