Telugu Global
CRIME

భ‌ర్త శాడిస్టు చేష్ట‌లు భ‌రించ‌లేక‌.. అంత‌మొందించింది!

కొంత‌కాలం క్రితం వేణుకుమార్ మ‌రో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అయినా సుస్మిత స‌ర్దుకుపోయింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తోనూ అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవ‌డ‌మేగాక వారితో స‌న్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడు.

భ‌ర్త శాడిస్టు చేష్ట‌లు భ‌రించ‌లేక‌.. అంత‌మొందించింది!
X

భ‌ర్త శాడిస్టు చేష్ట‌ల‌కు విసిగిపోయిన భార్య‌.. అత‌న్ని శాశ్వ‌తంగా వ‌దిలించుకోవాల‌ని భావించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా స్కెచ్ గీసి దాన్ని అమ‌లు చేసింది. రెండు నెల‌ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌ వివ‌రాల‌ను ఆదివారం సెంట్ర‌ల్‌జోన్ డీసీపీ అశోక్ కుమార్‌, కాజీపేట ఏసీపీ పి.శ్రీ‌నివాస్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబాబాద్‌కు చెందిన జ‌న్నార‌పు వేణుకుమార్‌ చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తున్నాడు. అత‌ని భార్య సుస్మిత రైల్వే లోకో షెడ్‌లో టెక్నీషియ‌న్‌గా ఉద్యోగం చేస్తోంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. కాజీపేట‌లోని డీజిల్ కాల‌నీలో వీరు నివాస‌ముంటున్నారు.

రెండో వివాహం చేసుకున్నా స‌హించింది..

కొంత‌కాలం క్రితం వేణుకుమార్ మ‌రో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అయినా సుస్మిత స‌ర్దుకుపోయింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తోనూ అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవ‌డ‌మేగాక వారితో స‌న్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడు. ఈ విష‌య‌మై వారి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అత‌నిలో ఈ శాడిస్టు ల‌క్ష‌ణాలు మార‌క‌పోవ‌డంతో అత‌న్నే శాశ్వ‌తంగా వ‌దిలించుకోవాల‌ని భావించింది సుస్మిత‌. త‌న‌కు స‌మీప బంధువైన కొంగ‌ర అనిల్‌కు ఈ విష‌యం చెప్పింది. దీంతో అత‌ను జ‌య‌శంక‌ర్ జిల్లా మొగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం ఇస్సిపేట గ్రామానికి చెందిన గ‌డ్డం ర‌త్నాక‌ర్ అనే వ్య‌క్తిని సంప్ర‌దించాడు. ర‌త్నాక‌ర్ గ‌తంలో ఓ హ‌త్య కేసులో నిందితుడు.

డీల్ సెట్ చేసి.. క‌థ ముగించారు..

వేణుకుమార్‌ని హ‌త‌మార్చ‌డానికి ర‌త్నాక‌ర్‌తో డీల్ మాట్లాడిన అనిల్‌.. రూ.4 ల‌క్ష‌లు చెల్లించేందుకు అంగీక‌రించాడు. అందులో రూ.2 ల‌క్ష‌లు అడ్వాన్సుగా చెల్లించాడు. వారు ముందుగా అనుకున్న పథ‌కం ప్ర‌కారం.. సెప్టెంబ‌రు 30న సుస్మిత పాల‌లో నిద్ర‌మాత్ర‌లు క‌లిపి వేణుకుమార్‌కు ఇచ్చింది. అత‌ను గాఢ నిద్ర‌లోకి వెళ్ల‌గానే ర‌త్నాక‌ర్ వ‌చ్చి.. అత‌న్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టి.. పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని బ‌య‌లుదేరాడు. మార్గంలో ప‌ర‌కాల వ‌ద్ద క‌టిక న‌వీన్‌ని కారులో ఎక్కించుకున్నాడు. మంథ‌ని చేరిన అనంత‌రం వేణుకుమార్ దుస్తుల‌న్నీ తీసి.. అత‌న్ని మానేరు వాగులో ప‌డేశారు.

ప‌ట్టించిన కాల్ డేటా..

వేణుకుమార్ పోలీసుల‌కు అక్టోబ‌రు 3వ తేదీన ల‌భించింది. కేసు న‌మోదు చేసిన మంథ‌ని పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి ఈ కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల కాల్ డేటా ఆధారంగా దీనిని ఛేదించారు. ఈ కేసులో జ‌న్నార‌పు సుస్మిత‌, కొంగ‌ర అనిల్‌, గ‌డ్డం ర‌త్నాక‌ర్‌, క‌టిక న‌వీన్‌ల‌ను అరెస్టు చేశారు.

First Published:  19 Dec 2022 6:07 AM GMT
Next Story