Telugu Global
CRIME

28 ఏళ్ల కింద నాలుగు హత్యలు.. ఎయిర్‌పోర్టులో దొరికిన నిందితుడు

కత్తులు, పదునైన ఆయుధాలతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

28 ఏళ్ల కింద నాలుగు హత్యలు.. ఎయిర్‌పోర్టులో దొరికిన నిందితుడు
X

దాదాపు మూడు దశాబ్దాల క్రిందట నలుగురిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితుడైన ఒకరిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. హత్యలు చేసిన తర్వాత నగరం నుంచి పారిపోయిన నిందితుడు.. స్వదేశానికి రావడంతో గుర్తించిన ముంబై నగర పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కశ్మీరా ప్రాంతంలోని పెంకర్‌పాడా బర్వాద్ చాల్‌లో భార్య భర్తలు జగ్రానీ దేవీ, రాజ్ నారాయణ్ వారి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు కలిసి నివశిస్తుండేవారు.

1994 నవంబర్ 16న రాజ్ నారాయణ్ లేని సమయం చూసి.. పొరుగున ఉండే అన్నదమ్ములు అనిల్ సరోజ్, సునిల్‌తో పాటు అతని స్నేహితుడు రాజ్‌కుమార్ చౌహాన్‌లు ఇంటిలోకి చొరబడి జగ్రాని దేవి (అప్పట్లో 27), ఇద్దరు కుమారులు (అప్పట్లో ఐదేళ్లు), కూతురు (అప్పట్లో 3 ఏళ్లు) కిరాతకంగా హతమర్చారు. కత్తులు, పదునైన ఆయుధాలతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత రోజు భర్త రాజ్ నారాయణ్ ఇంటికి వచ్చే వరకు ఆ హత్యల గురించి ఎవరికీ తెలియరాలేదు. పోలీసుల విచారణలో వ్యక్తిగత కక్షతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిసింది.

జగ్రాని దేవిని ఈ ముగ్గురు కూడా లైంగికంగా వేధిస్తుండేవారు. తమ కోరిక తీర్చమని భర్త లేని సమయంలో బలవంతం చేసేవారు. ఈ విషయం తెలిసి భర్త రాజ్ నారాయణ్ వారితో గొడవపడ్డాడు. వీధిలో అందరికీ తెలిసేలా వారి అరాచకాలను బయటపెట్టాడు. దీంతో ఆ ముగ్గురు రగిలిపోయారు. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. రాజ్ నారాయణ్ లేని సమయంలో ఇలా దారుణానికి ఒడిగట్టారు. 2006లో భర్త రాజ్ నారాయణ్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఈ హత్యలకు మూల కారణం రాజ్‌కుమార్ చౌహాన్ ( అప్పట్లో 19) అని చెప్పాడు.

హత్యలు చేసిన అనంతరం చౌహాన్ ముంబై వదిలి ఖతర్ పారిపోయాడు. గత 28 ఏళ్లుగా అక్కడే ఒక గ్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా ఏళ్లు గడిచిపోయింది కాబట్టి పోలీసులు తన గురించి వెతకడం మానేసి ఉంటారని భావించాడు. అయితే పోలీసుల రాడార్‌లోనే అతడి పాస్‌పోర్ట్ ఉంది. ఖతర్ నుంచి ముంబైకి చేరుకున్నాడని తెలిసిన వెంటనే కష్మీరా పోలీసుకు సమాచారం అందింది. వెంటనే ఎయిర్‌పోర్టుకు చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు అనిల్, సునిల్ ఇంకా పరారీలోనే ఉన్నారు.

First Published:  31 Dec 2022 3:45 AM GMT
Next Story