Telugu Global
CRIME

జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకేసులో నిందితుడి అరెస్ట్

రిమాండ్‌కు తరలించినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌

జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
X

జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల గ్రామీణ మండలం జాబతాపూర్‌లో ఈ నెల 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్‌ కారుతో ఢీకొట్టి, కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ కేసు జగిత్యాలలో సంచలనం సృష్టించగా.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సుమారు 3 గంటల పాటు జగిత్యాల పాత బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగానే జీవన్‌రెడ్డి శాంతిభద్రతలపై, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేతలకే రక్షణ లేదని వాపోయారు. రాజకీయ హత్యలపై, ఫిరాయింపు రాజకీయాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిందితుడి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

First Published:  25 Oct 2024 3:28 PM GMT
Next Story