Telugu Global
CRIME

లోన్ యాప్ వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగి బలి..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌‌ శాస్త్రిపురానికి చెందిన సుధాకర్.. కొంతకాలం క్రితం గోల్డెన్ రూపీ అనే ఓ లోన్ యాప్ లో రూ. 6,000 అప్పు తీసుకున్నాడు.

లోన్ యాప్ వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగి బలి..
X

లోన్ యాప్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. బయట అప్పులు తీసుకొనేకంటే .. ఆన్ లైన్ లో అప్పులు తీసుకుంటే ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంటుందని మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకొని లోన్‌యాప్‌లు మిడిల్‌క్లాస్ ప్రజలకు గాలం వేస్తున్నాయి. అప్పులిస్తూ.. భారీగా వడ్డీలు వసూలు చేస్తూ.. కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా రుణ బాధితులను వేధిస్తున్నాయి. ఇప్పటికీ లోన్ యాప్ వేధింపులకు దేశవ్యాప్తంగా పలువురు బలయ్యారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌‌ శాస్త్రిపురానికి చెందిన సుధాకర్.. కొంతకాలం క్రితం గోల్డెన్ రూపీ అనే ఓ లోన్ యాప్ లో రూ. 6,000 అప్పు తీసుకున్నాడు. అయితే సుధాకర్ సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారు. అతడి భార్య ఫొటోలను అశ్లీల సైట్ లో పెడతామంటూ వేధించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బంధువులకు, స్నేహితులకు సుధాకర్ పేరు మీద అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారు. భార్యను కూడా వేధిస్తున్నారు. దీంతో చేసేది లేక సుధాకర్ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

లోన్ యాప్ వేధింపులతో చాలా మంది కుమిలిపోతున్నారు. వేలల్లో అప్పులు తీసుకొని.. లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అప్పు తీసుకున్న వారినే కాక.. వారి కాంటాక్ట్ లిస్టులోని వాళ్లను కూడా లోన్ యాప్ సిబ్బంది వేధిస్తున్నారు. ఇటువంటి యాప్ లను వెంటనే నిషేధించి.. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. అయితే లోన్ యాప్ ద్వారా గుడ్డిగా లోన్లు తీసుకోవద్దని.. పోలీసులు సూచిస్తున్నారు.

First Published:  20 July 2022 1:31 PM GMT
Next Story