Telugu Global
CRIME

యువతిపై సామూహిక అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

యువతిపై సామూహిక అత్యాచారం
X

వరంగల్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. స్థానిక ఇంతేజార్‌గంజ్‌ పీఎస్‌ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివార్లలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఫార్మసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నది. కాలేజీ సమీపంలోనే హాస్టల్‌లో ఉంటున్నది. గత నెల 15వ తేదీన ఆమె సొంతూరుకు చెందిన తెలిసిన యువకుడు ఒకరు హాస్టల్‌ వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉన్నదని ఆమెను కారులో ఎక్కమన్నాడు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులు ఉండటంతో యువతి నిరాకరించింది. అయినా బలవంతంగా కారులో ఎక్కించి నగరానికి తీసుకొచ్చారు. వరంగల్‌ కూరగాయల మార్కెట్‌ సమీపంలోని ఓ లాడ్జి మొదటి అంతస్తులో రూమ్‌ తీసుకెళ్లారు.

అక్కడ యువతికి మద్యం తాగించి ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. పరీక్షలు ఉండటంతో ఫిర్యాదు చేయలేదని, సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని యువతి తన తల్లికి చెప్పినట్లు సమాచారం. తర్వాత తల్లి, కుమార్తె వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి విషయం చెప్పారు. ఆయన సూచనల మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. లాడ్జి నిర్వాహకుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆధార్‌కార్డుల ఆధారంగా ముగ్గురిలో ఒక యువకుడిది భూపాలపల్లి అని గుర్తించారు. బాధితురాలి మిత్రుడితో పాటు.. మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి గాలిస్తున్నారు. మరోవైపు యుతిని భరోసా కేంద్రానికి తరలించారు.

First Published:  2 Oct 2024 3:50 AM GMT
Next Story