Telugu Global
CRIME

బ్రాండెడ్‌ పేరుతో నకిలీలు

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏదైనా షాపునకు వెళితే సాధారణంగా బ్రాండెడ్‌ కంపెనీల పేర్లతో ఉన్న వస్తువులనే జనం కొంటుంటారు. ఉదాహరణకు సర్ఫ్‌ ఎక్సెల్, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్, బ్రూక్‌ బాండ్‌ టీ పౌడర్, రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్, లైజాల్, హార్పిక్‌.

బ్రాండెడ్‌ పేరుతో నకిలీలు
X

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏదైనా షాపునకు వెళితే సాధారణంగా బ్రాండెడ్‌ కంపెనీల పేర్లతో ఉన్న వస్తువులనే జనం కొంటుంటారు. ఉదాహరణకు సర్ఫ్‌ ఎక్సెల్, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్, బ్రూక్‌ బాండ్‌ టీ పౌడర్, రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్, లైజాల్, హార్పిక్‌.. ఇలా టీవీలలో ప్రకటనల ద్వారా తెలిసినవాటినే ఎక్కువగా కొని వినియోగిస్తుంటారు.

సాధారణంగా జనమంతా వాటికే అలవాటు పడటం వల్ల మిగిలిన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపరు. దీనిని గుర్తించిన పలువురి ముఠా పలు బ్రాండెడ్‌ నిత్యావసరాలకు నకిలీలను రూపొందించి అదే బ్రాండ్ల పేరుతో డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్నారు. వాటిని దుకాణాల నుంచి బ్రాండెడ్‌ పేరుతో.. అదే డిజైన్‌లో ఉండటం వల్ల ఎలాంటి అనుమానం లేకుండా కొని వినియోగిస్తుంటారు.

హైదరాబాద్‌లోని ఈస్ట్‌ జోన్, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఇలాంటి ముఠా గుట్టు తాజాగా రట్టు చేశారు. దాదాపుగా పైన పేర్కొన్న కంపెనీల పేర్లతో నకిలీలను తయారు చేసి.. అదే డిజైన్‌తో వారు డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేస్తున్నారని గుర్తించారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ గిరిధర్‌ శనివారం ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఏడుగురు నిందితులు ఈ ముఠాలో ఉన్నారని, కాటేదాన్, నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన చెప్పారు.

తయారీ కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను గుర్తించి సీజ్‌ చేశామని డీసీపీ గిరిధర్‌ తెలిపారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. బిహార్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన ఈ నిందితుల ముఠా.. నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే వీటిని డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు.

అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం...

నకిలీ నిత్యావసర వస్తువులను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. కొందరు వ్యాపారులు, దుకాణ దారులు నకిలీ వస్తువులని తెలిసినా వాటిని విక్రయిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు నకిలీ వస్తువులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

First Published:  24 Feb 2024 1:52 PM GMT
Next Story