Telugu Global
CRIME

ఇల్లొదిలి యూపీ వెళ్లిన తెలంగాణ మహిళ.. దారుణంగా హతమార్చిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

యూపీలోని అమ్రోహా జిల్లా గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్‌మేట్ అనే సెక్యూరిటీ కంపెనీ ఉన్నది. మూడు రోజుల క్రితం ఈ కంపెనీ ఆవరణలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది.

ఇల్లొదిలి యూపీ వెళ్లిన తెలంగాణ మహిళ.. దారుణంగా హతమార్చిన ఫేస్‌బుక్ ఫ్రెండ్
X

సామాజిక మాధ్యమాల్లో ఏర్పడే పరిచయాలు, ప్రేమలు ఎంత విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయో ఎన్నో సంఘటనలు చూశాం. అయినా సరే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలను గుడ్డిగా నమ్మేసి.. చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వివాహిత ఫేస్‌బుక్ ఫ్రెండ్ చేతిలో దారుణ హత్యకు గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలోని అమ్రోహా జిల్లా గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్‌మేట్ అనే సెక్యూరిటీ కంపెనీ ఉన్నది. మూడు రోజుల క్రితం ఈ కంపెనీ ఆవరణలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని ఆ మహిళను ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముందు కంపెనీలోని ఉద్యోగులందరినీ విచారించారు. ఆ సమయంలో కంపెనీ తాళం చెవుల్లో ఒకటి షెహజాద్ అనే యువకుడి దగ్గర ఉంటుందని తేలింది. దీంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ మహిళ పేరు ఉస్మా బేగం (32)గా తేల్చారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉస్మాబేగంకు షెహజాద్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ఉస్మా.. షెహజాద్‌తో ప్రేమలో పడి ఈ నెల 6న గజరౌలా వెళ్లింది. అక్కడ షెహజాద్‌ను కలిసి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని షెహజాద్ ఆగ్రహంతో చున్నీతో కట్టేసి, ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని కంపెనీ ఆవరణలోనే పడేసి వెళ్లిపోయాడు.

మరోవైపు తన భార్య ఉస్మా అదృశ్యమైందని చెబుతూ భర్త ముఖీద్ ఈ నెల 6న భాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తొలుత ఉస్మా కనపడకపోవడానికి భర్త ముఖీద్ కారణమని పోలీసులు భావించారు. అప్పటికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉండటంతో రెండు నెలల పాటు ఉస్మా భర్తను వదిలి నిజామాబాద్‌లో ఉన్నది. ఇటీవలే ఇద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చి భర్తతో పంపారు. ఈ నెల 4న భాన్సువాడ వచ్చిన ఉస్మా.. రెండు రోజుల తర్వాత మాయం అయ్యింది. దీంతో భర్తే ఏదో చేసుంటాడని పోలీసులు భావించారు. అతడిని అన్ని కోణాల్లో విచారించారు. ఇంతలోనే యూపీ పోలీసుల నుంచి ఉస్మా చనిపోయినట్లు, షెహజాద్ అనే యువకుడు హత్య చేసినట్లు సమాచారం అందించారు. దీంతో ఉస్మా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చక్కని సంసారాన్ని ఫేస్‌బుక్ స్నేహం కారణంగా పాడు చేసుకుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

First Published:  13 Nov 2022 4:48 AM GMT
Next Story