Telugu Global
CRIME

అంతా డ్రామానేనా..? గ్యాంగ్ రేప్‌ అసలు జరగలేదా?

రేప్ జరిగినట్లు చెప్పిన రెండు రోజులు ఆ మహిళ.. ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌లో ఉన్నట్లు కూడా పోలీసులు తేల్చారు.

అంతా డ్రామానేనా..? గ్యాంగ్ రేప్‌ అసలు జరగలేదా?
X

దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక దగ్గర మహిళలపై అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయి. ఎక్కడ రేప్ అన్న పదం వినపడినా అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టాయి. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్‌లో దిశ ఘటనలు జరిగిన తర్వాత రేప్ కేసు నిందితులపై ప్రజలు కూడా పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అవకాశంగా తీసుకొని ఓ మహిళ ఉత్తుత్తి సామూహిక అత్యాచారం డ్రామాకు తెరతీసింది. రెండు రోజుల పాటు విచారణ చేసిన పోలీసులు అసలు గుట్టు బయటపెట్టారు.

ఢిల్లీ శివారులో రెండు రోజుల కిందట ఓ ఘటన జరిగింది. తనను ఐదుగురు కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారంచ చేశారని, జననాంగాల్లోకి రాడ్లు పెట్టి హింసించారని, తర్వాత బస్తాలో కుక్కి ఢిల్లీ-ఘజియాబాద్ దారిలోని ఆశ్రమ్ రోడ్డు వద్ద పారేసినట్లు మహిళ చెప్పింది. కొంత మంది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఆసుపత్రిలో చేర్చారని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సదరు మహిళను విచారించి కొందరిని అరెస్టు చేశారు. అయితే, మహిళ వ్యవహార శైలి గమనించిన పోలీసులు అనుమానం వచ్చింది. మరింత లోతుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రేప్ జరిగిందని ఆరోపిస్తున్న మహిళకు కొంత మందితో ఆస్తి వివాదాలు ఉన్నాయి. దీంతో వారిని ఎలాగైనా కేసులో ఇరికించాలని రేప్ జరిగినట్లు అబద్దం ఆడి వారి పేర్లు పోలీసులకు చెప్పింది. మహిళను పరీక్షించిన ఢిల్లీ జీటీబీ ఆసుపత్రి కూడా ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తేల్చింది. పైగా పోలీసులు ఆమెను రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి పరీక్ష చేయించడానికి ప్రయత్నించగా.. నిరాకరించింది. దీంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే సదరు మహిళ మొబైల్‌ను ట్రేస్ చేశారు.

ఒక ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారని మహిళ మొదట పేర్కొన్నది. అయితే ఆ సమయంలో ఆమెతో పాటు మరో సన్నేహితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ఎక్కడైతే తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్నదో.. అదే ప్లేస్‌లో ఆ స్నేహితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. అంతే కాకుండా పేటీఎం ద్వారా మహిళ అదే స్నేహితుడికి డబ్బులు కూడా పంపింది. దీంతో ఆ స్నేహితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు.

ఆ మహిళకు రేప్ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేయమన్నదని, అందుకే డబ్బులు పంపినట్లు యువకుడు తెలిపాడు. రేప్ జరిగినట్లు చెప్పిన రెండు రోజులు ఆ మహిళ.. ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌లో ఉన్నట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆ స్నేహితుల సహకారంతోనే ఈ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు వెల్లడించారు. ఇదంతా ఆస్తి తగాదాలు ఉన్న వారిని ఇరికించడానికే చేసినట్లు యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. లైంగిక దాడి పేరుతో పోలీసులను పక్కదోవ పట్టించి రెండు రోజులు ముప్పతిప్పలు పెట్టినందుకు రివర్స్‌లో ఆమెపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ విషయంపై రేప్ విక్టిమ్‌గా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

First Published:  21 Oct 2022 3:29 AM GMT
Next Story