Telugu Global
CRIME

పెళ్లికి ఒప్పుకోవాల‌ని కోరితే.. ప్రాణం తీశారు.. - ప‌ట్ట‌ప‌గ‌లు యువ‌కుడి దారుణ హ‌త్య‌

న‌వీన్ ఆదివారం నాడు త‌న స్నేహితుడు ఈట అనిల్‌తో క‌లిసి నిడ‌మ‌నూరు మండ‌లం గుంటిప‌ల్లికి చెందిన పాల్వాయి తిరుమ‌ల్ వ‌ద్ద‌కు వెళ్లి.. అమ్మాయి కుటుంబంతో మాట్లాడి త‌మ పెళ్లికి ఒప్పించాల‌ని కోరాడు.

పెళ్లికి ఒప్పుకోవాల‌ని కోరితే.. ప్రాణం తీశారు.. - ప‌ట్ట‌ప‌గ‌లు యువ‌కుడి దారుణ హ‌త్య‌
X

ఓ యువ‌తిని ప్రేమించిన యువ‌కుడు.. త‌మ పెళ్లికి అంగీక‌రించాల‌ని ఆమె కుటుంబ స‌భ్యుల‌ను కోరగా.. ప‌ట్ట‌ప‌గ‌లే వెంటాడి క‌త్తుల‌తో న‌రికి చంపిన‌ దారుణ ఘ‌ట‌న ఆదివారం చోటుచేసుకుంది. న‌ల్ల‌గొండ జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

త్రిపురారం మండ‌లం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి న‌వీన్ (21), అదే గ్రామానికి చెందిన ఓ యువ‌తి (20) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. న‌వీన్ ద‌ళితుడు. మిర్యాల‌గూడ‌లో కారు మెకానిక్‌గా ప‌నిచేస్తున్నాడు. వీరి కులాలు వేరు కావ‌డంతో రెండువైపుల కుటుంబాలూ వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. ఇటీవ‌ల ఆ యువ‌తికి కుటుంబ స‌భ్యులు పెళ్లి సంబంధం చూశార‌ని తెలిసిన న‌వీన్ విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రిలో చేర్చ‌డంతో చికిత్స అనంత‌రం కోలుకున్నాడు. ఇదే క్ర‌మంలో యువ‌తి బంధువులు న‌వ‌దీప్‌, మ‌ణిదీప్‌, శివ‌ప్ర‌సాద్‌లు న‌వీన్‌కి ఫోన్ చేసి ఆమెను మ‌రిచిపోవాల‌ని.. లేదంటే చంపేస్తామ‌ని బెదిరించారు.

న‌వీన్ ఆదివారం నాడు త‌న స్నేహితుడు ఈట అనిల్‌తో క‌లిసి నిడ‌మ‌నూరు మండ‌లం గుంటిప‌ల్లికి చెందిన పాల్వాయి తిరుమ‌ల్ వ‌ద్ద‌కు వెళ్లి.. అమ్మాయి కుటుంబంతో మాట్లాడి త‌మ పెళ్లికి ఒప్పించాల‌ని కోరాడు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల్ యువ‌తి బంధువుల‌కు ఫోన్ చేసి.. మాట్లాడుకుందాం ర‌మ్మ‌ని కోరాడు. స‌రే వ‌స్తున్నామ‌ని చెప్పిన కుటుంబ‌స‌భ్యులు.. కాసేప‌టికి మూడు బైక్‌ల‌పై 9 మంది క‌త్తుల‌తో అక్క‌డికి వ‌చ్చారు. వ‌స్తూనే న‌వీన్‌పై దాడికి దిగారు. క‌త్తుల‌తో బెదిరించ‌డంతో అనిల్‌, తిరుమ‌ల్ అక్క‌డినుంచి ప‌రార‌య్యారు.

ఈ దాడిలో వారినుంచి త‌ప్పించుకునేందుకు న‌వీన్ కొద్దిదూరం వెళ్లి ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో నిందితులు అత‌న్ని క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి హ‌త‌మార్చారు. స‌మాచారం అందుకున్న డీఎస్పీ వెంక‌ట‌గిరి సిబ్బందితో అక్క‌డికి చేరుకున్నారు. అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు చెప్పారు.

First Published:  10 April 2023 4:11 AM GMT
Next Story