Telugu Global
CRIME

బ్యాంకుల డేటా చోరీ కేసు.. ఒక్కో కస్టమర్ డీటైల్ కోసం ఎంత చెల్లించారో తెలుసా?

కాల్ సెంటర్స్ నడుపుతున్న ఈ 16 మందికి దానికి సంబంధించిన విషయాలు పెద్దగా తెలియవు. అయినా సరే ఫ్రెండ్స్, ఇతరుల సహాయంతో నాలెడ్జ్ పెంచుకొని సొంతగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బ్యాంకుల డేటా చోరీ కేసు.. ఒక్కో కస్టమర్ డీటైల్ కోసం ఎంత చెల్లించారో తెలుసా?
X

పలు బ్యాంకుల కస్టమర్స్ డీటైల్స్ చోరీ చేస్తూ, అమ్ముకుంటున్న రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ డేటా చోరీకి సంబంధించిన కేసు దర్యాప్తులో అనేక విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి డేటాను చోరీ చేసిన వ్యక్తులు.. ఆ వివరాలను బయటి వారికి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయా బ్యాంకుల కోసం పని చేస్తున్న కొంత మంది.. డేటాను చోరీ చేసి.. ఒక్కో కస్టమర్ వివరాలను రూ.10 నుంచి రూ.20కి ఇతరులకు అమ్మేస్తున్నారు. కొంత మంది కస్టమర్ల డీటైల్స్‌ను రూ.40కి అమ్మేసినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తున్నది.

నోయిడాకు చెందిన ఒక ఐటీ కంపెనీలో పని చేసే వీరేంద్ర సింగ్ అనేక మంది కస్టమర్ల డీటైల్స్ చోరీ చేశాడు. అతడు పని చేసే ఐటీ కంపెనీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా కోసం పని చేస్తుంది. కొత్త క్రెడిట్ కార్డుల యాక్టివేషన్, కస్టమర్ల సమస్యలకు పరిష్కారాలు ఈ కంపెనీ ద్వారానే బ్యాంక్ ఆఫ్ బరోడా చేయిస్తుంది. వీరేంద్ర సింగ్ తనకు యాక్సెస్ ఉన్న కస్టమర్ల కాన్ఫిడెన్షియల్ డీటైల్స్‌ను చోరీ చేసేవాడు. ముఖ్యంగా కస్టమర్ అప్లికేషన్ నెంబర్, పేరు, మొబైల్ నెంబర్, క్రెడిక్ కార్డ్ టైప్ వంటి విషయాలను ఆఫీస్ సిస్టమ్స్ నుంచి సేకరించి.. వాటిని బయటి వారికి రూ.10 నుంచి రూ.20కి విక్రయించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్ల క్రెడిట్ కార్డ్ వివరాలను ప్రదీప్ వాలియా అనే వ్యక్తి చోరీ చేశాడు. వాటిని పలు గ్యాంగులకు రూ.10 నుంచి రూ.20కి విక్రయించాడు. కాగా, వీరిద్దరితో పాటు డేటాను కొనుగోలు చేసిన పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ నడుపుతున్న కాఫిల్ అహ్మద్ ఈ డేటా కొనుగోలు చేసే వాడని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రెండు డేటా చోరీ కేసుల్లో 16 మందిని అరెస్టు చేశారు. కాగా, వీళ్లకు అకడమిక్ బ్యాగ్రౌండ్, టెక్నికల్ నాలెడ్జి అంతగా లేనట్లు తెలుస్తున్నది.

కాల్ సెంటర్స్ నడుపుతున్న ఈ 16 మందికి దానికి సంబంధించిన విషయాలు పెద్దగా తెలియవు. అయినా సరే ఫ్రెండ్స్, ఇతరుల సహాయంతో నాలెడ్జ్ పెంచుకొని సొంతగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ డేటా లీక్ కేసులు భారీగా వస్తుండటంతో సైబరాబాద్ పోలీసులు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కాన్ఫిడెన్షియల్ డేటాను జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యతను వివరించారు. అలాగే అలాంటి వివరాల యాక్సెక్ కలిగి ఉన్న ఉద్యోగుల జాబితాను వెంటనే అందించాలని.. వారిపై నిఘా ఉంచాలని కూడా అధికారులకు పోలీసులు సూచించారు.

First Published:  27 March 2023 2:59 AM GMT
Next Story