Telugu Global
CRIME

బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్య

చిక్కడపల్లి ప్రాంతంలోని అశోక్‌నగర్‌లో మరో ఎస్ఐ ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రతీ రోజు చిక్కడపల్లి నుంచి బంజారా హిల్స్ స్టేషన్‌కు విధులకు వెళ్లి వస్తుంటాడు.

బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్య
X

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ 2020లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఎస్ఐ ఉద్యోగ పరీక్షలో జాబ్ సంపాదించాడు. అదే ఏడాది ట్రైనీ ఎస్ఐగా విధుల్లో చేరిన రమణ.. కొన్ని రోజులుగా ప్రొబేషనరీ పిరియడ్‌గా ఉన్నాడు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

నగరంలోని చిక్కడపల్లి ప్రాంతంలోని అశోక్‌నగర్‌లో మరో ఎస్ఐ ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రతీ రోజు చిక్కడపల్లి నుంచి బంజారా హిల్స్ స్టేషన్‌కు విధులకు వెళ్లి వస్తుంటాడు. కాగా, బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన రమణ.. కాసేపటికే తనకు పని ఉందని చెప్పి రాత్రి 10.00 గంటలకు బయటకు వెళ్లాడు. కానీ రాత్రంతా అతడు ఇంటికి తిరిగి రాలేదు.

మరోవైపు మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న బీ క్యాబిన్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృత దేహం ఉన్నట్లు కీమాన్ వెంకటేశ్వరరావు గుర్తించారు. వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు వివరాలు తెలియజేశాడు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తన సిబ్బందితో కలసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. జేబులో దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి ఎస్ఐ రమణగా గుర్తించారు.

రమణ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులకు, బంజారా హిల్స్ స్టేషన్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, రమణ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. రమణ కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడని.. కానీ తన సమస్య ఏమిటో ఎవరికీ చెప్పలేదని రూమ్మేట్స్ అంటున్నారు. కుటుంబ సమస్యలా లేదంటే ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.

First Published:  27 Oct 2022 10:59 AM GMT
Next Story