Telugu Global
CRIME

అంజలి మృతి కేసు : రెండు సార్లు కాపాడే ఛాన్స్ ఉన్నా కనికరం చూపని నిందితులు

మొదట యాక్సిడెంట్ జరగ్గానే నిందితులు కారు దిగి అంజలిని కాపాడే అవకాశం వచ్చిందని.. కానీ నిందితులు ఆమెను కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదని పోలీసులు తెలిపారు.

అంజలి మృతి కేసు : రెండు సార్లు కాపాడే ఛాన్స్ ఉన్నా కనికరం చూపని నిందితులు
X

ఈ ఏడాది నూతన సంవత్సరం తొలి రోజు ఉదయాన్నే టీవీలు పెట్టిన ప్రజలందరికీ అంజలి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అంజలి అనే 20 ఏళ్ల యువతి తెల్లవారుజామున తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఓ కారు ఆ స్కూటీని ఢీకొని ఏకంగా 12 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో అంజలి స్నేహితురాలు స్వల్ప గాయాలతో బయటపడగా అంజలి మాత్రం మృతిచెందింది. కారు ఆమె మృత‌దేహాన్ని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ల‌డంతో ఆమె శరీరం మొత్తం రక్తపు ముద్దలా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఛార్జ్ షీట్ ని ఢిల్లీ పోలీసులు తాజాగా దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల పేర్లను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత అంజలిని రెండుసార్లు కాపాడే అవకాశం వచ్చినప్పటికీ నిందితులు ఆమె చస్తే చావని అని నిర్లక్ష్యంతో వ్యవహరించారని పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

మొదట యాక్సిడెంట్ జరగ్గానే నిందితులు కారు దిగి అంజలిని కాపాడే అవకాశం వచ్చిందని.. కానీ నిందితులు ఆమెను కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదని పోలీసులు తెలిపారు. కారు స్కూటీని ఢీకొన్నాక స్కూటీతో పాటు అంజలి కూడా కారు కింద ఇరుక్కుందని.. ముందుకు పోనిస్తే ఆమె శరీరం నుజ్జు అవుతుందని తెలిసి కూడా నిందితులు వాహనాన్ని ముందుకే పోనిచ్చారని పోలీసులు పేర్కొన్నారు.

కారు సుమారు అర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నిందితులు వాహనాన్ని ఆపారని.. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నిందితుడు, వెనక సీట్లో కూర్చున్న నిందితుడు బాధితురాలి శరీరం ఇంకా కారు కింద ఉందా? లేదా? అని చూసుకున్నారని.. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా ఆమెను కాపాడకుండా కారును అలాగే ముందుకు పోనివ్వాలని డ్రైవింగ్ చేస్తున్న స్నేహితుడికి సూచనలు ఇచ్చారని పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కారు అంజలి మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఢిల్లీ నుంచి కంజావాలా వరకు 12 కిలోమీటర్లు వెళ్లడంతో అంజలి శరీరంపై ఉన్న దుస్తులు చిరిగిపోయాయి. వీపు బాగా మొత్తం ర‌క్త‌పు ముద్ద‌గా మారి వెన్నెముక బయటకు వచ్చేసింది. పుర్రె కూడా పగిలిపోయింది. అంజలిని కాపాడటానికి రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ నిందితులు కనికరం లేకుండా ప్రవర్తించారని పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉండటంవల్లే నిందితులు ఈ విధంగా ప్రవర్తించారని చెప్పడం సాకు మాత్రమే అని.. వారు స్పృహలోనే ఉండి ఈ పనికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు కాగా.. ప్రధాన నిందితులుగా అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్ లపై హత్య నేరాభియోగాలను పోలీసులు ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా ఢిల్లీ రోహిణి కోర్టు ఈనెల 18వ తేదీన ఈ కేసును విచారించనుంది.

First Published:  14 April 2023 12:19 PM GMT
Next Story