Telugu Global
CRIME

ఢిల్లీ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు.. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఇటీవలే ఖాళీ చేసిన ఆఫ్తాబ్ ఫ్యామిలీ

Shraddha Walker Murder Case in Delhi: ఆఫ్తాబ్‌కు మరి ఎంత మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పోలీసులు బంబల్‌ను ఆశ్రయించారు. ఆఫ్తాబ్ ప్రొఫైల్ డీటైల్స్ అన్నీ పంపించాలని నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు.. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఇటీవలే ఖాళీ చేసిన ఆఫ్తాబ్ ఫ్యామిలీ
X

ముంబైకి చెందిన శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్య చేసి.. అనంతరం ఆమె బాడీని 35 ముక్కలుగా కోసిన సంగతి తెలిసిందే. మే రెండో వారంలో ఆమెను హత్య చేసి.. అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి.. 18 రోజుల పాటు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో పారేశాడు. తాజాగా శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటకు వచ్చింది.

సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు రాత్రంతా లాకప్‌లో ఉంచారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా నిత్యం పోలీసు పహారాతో పాటు, సీసీ కెమేరా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ హత్య చేసిన అనంతరం ఆఫ్తాబ్ ముంబై శివారు పాల్ఘర్‌లోని తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తున్నది. 15 రోజుల క్రితం తన ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ వచ్చి ఇంటి షిఫ్టింగ్‌కి సహాయం చేసినట్లు సొసైటీ చైర్మన్ రామ్‌దాస్ కేవత్ తెలిపారు.

గత 20 ఏళ్లుగా ఆఫ్తాబ్ ఫ్యామిలీ ఈ సొసైటీలోనే ఉంటుందని ఆయన చెప్పారు. ఆఫ్తాబ్ ఈ సొసైటీలోనే పెరిగాడని, చిన్నప్పటి నుంచి అతడిని చూస్తున్నామని కేవత్ అన్నారు. ఇల్లు షిఫ్ట్ చేసే సమయంలో ఆఫ్తాబ్ సాధారణంగానే కనిపించాడని, ఎలాంటి కంగారు.. లేదా కొత్తగా అనిపించలేదని కేవత్ చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంటి నుంచి ముంబైకి ఎందుకు వెళ్తున్నారని తాను ప్రశ్నించానని.. అయితే తనతో పాటు చిన్న కొడుకు కూడా ప్రతీ రోజు ఉద్యోగం కోసం ముంబై వెళ్లాల్సి వస్తుందని, అందుకే మారుతున్నట్లు చెప్పారన్నారు. చిన్న కొడుకుకి ఇటీవలే ముంబైలో జాబ్ రావడంతో ఆయన చెప్పిన కారణం సబబే అనిపించిందని కేవత్ అన్నారు. కానీ హత్య విషయం తెలిసిన అనంతరం నాతో పాటు సొసైటీ మొత్తం షాక్‌కు గురైందని తెలిపారు.

హత్య చేయబడ్డ శ్రద్ధ కూడా అప్పుడప్పుడు సొసైటీలోని ఆఫ్తాబ్ ఇంటికి వచ్చేదని.. ఆ అమ్మాయి తమకు పరిచయమేనని సొసైటీ సెక్రటరీ అబ్దుల్లా ఖాన్ అన్నారు. అయితే, ఢిల్లీ షిఫ్ట్ అయ్యాక మాత్రం శ్రద్ధను చూడలేదని.. ఆఫ్తాబ్ మాత్రం ఒకటి రెండు సార్లు వచ్చాడని ఆయన తెలిపారు. మరోవైపు ఆఫ్తాబ్‌ను పోలీసులు బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ పారేశాడో చూపించడానికి తీసుకొని వెళ్లారు. ఇప్పటి వరకు కేవలం 10 భాగాలు మాత్రమే లభించాయి.

శ్రద్ధను హత్య చేసిన తర్వాత మరో గర్ల్ ఫ్రెండ్‌ను అపార్ట్‌మెంట్‌కు తీసుకొని వచ్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఫ్రిజ్ తెరుస్తుందేమో అనే అనుమానంతో శరీర భాగాలను కప్‌బోర్డులో పెట్టేవాడని పోలీసులు చెబుతున్నారు. శ్రద్ధా-ఆఫ్తాబ్‌లు బంబల్ అనే డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. దాదాపు 3 ఏళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే శ్రద్ధా ఇంటిలో ఈ రిలేషన్‌షిప్‌పై అభ్యంతరాలు రావడంతో ఇద్దరూ ఢిల్లీ షిఫ్ట్ అయ్యారు. శ్రద్ధాను చంపడానికి 15-20 రోజుల ముందే బంబల్‌లో మరో యువతిని ఆఫ్తాబ్ కలిశాడు.

ఆఫ్తాబ్‌కు మరి ఎంత మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పోలీసులు బంబల్‌ను ఆశ్రయించారు. ఆఫ్తాబ్ ప్రొఫైల్ డీటైల్స్ అన్నీ పంపించాలని నోటీసులు జారీ చేశారు.

First Published:  15 Nov 2022 12:03 PM GMT
Next Story