Telugu Global
CRIME

ఆమె ఆ మాట అనగానే.. మెడికో గొంతుకోసేసిన టెకీ

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వి విజయవాడలో బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.

ఆమె ఆ మాట అనగానే.. మెడికో గొంతుకోసేసిన టెకీ
X

పెళ్లికి నిరాకరించిన మెడికో అమ్మాయిని సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడు దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన జరిగింది. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో యువతిని గొంతు కోసి ఆ తర్వాత ఆమెను రక్షించే అవకాశం కూడా లేకుండా చాలాసేపు అడ్డుపడ్డాడు.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వి విజయవాడలో బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొద్దికాలం ఇద్దరూ గన్నవరంలో ఉండేవారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. అయినా సరే తపస్విని వేధించడం మానుకోలేదు జ్ఞానేశ్వర్.

అతడిపై బాధితురాలు ఇది వరకే పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. అయినా మాట వినకపోవడంతో తపస్వి అతడి బారి నుంచి తప్పించుకునేందుకు తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలి రూంలో తలదాచుకుంటోంది. తపస్వి ఉంటున్న రూం అడ్రస్‌ను తెలుసుకున్న జ్ఞానేశ్వర్‌ అక్కడికి వెళ్లాడు. జ్ఞానేశ్వర్‌తో వివాదాన్ని స్నేహితురాలి సమక్షంలో సెటిల్ చేసుకునేందుకు వారే అతడిని పిలిపించారన్న ప్రచారమూ నడుస్తోంది.

మాటల సమయంలో తపస్వి తాను మరో యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఒక్కసారిగా జ్ఞానేశ్వర్ రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసేశాడు. షాక్‌ అయిన యువతి స్నేహితురాలు కేకలు వేస్తూ పైఅంతస్తు నుంచి కిందకు వచ్చి ఇంటి యజమానికి వివరించింది. వారిద్దరు కాపాడేందుకు వెళ్లగా అప్పటికే తలుపు వేసేశాడు జ్ఞానేశ్వర్‌. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టే వరకు తపస్వి వద్దకు వెళ్లలేకపోయారు. తలుపులు పగులగొట్టిన తర్వాత తపస్విని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది. ఉన్మాది జ్ఞానేశ్వర్‌ను స్థానికులు తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మెడికో విద్యార్థిని తపస్వి తల్లిదండ్రులు ముంబాయిలో ఉంటున్నారు.

First Published:  6 Dec 2022 2:01 AM GMT
Next Story