Telugu Global
CRIME

అప్పు తీర్చినా వేధించిన లోన్ యాప్.. సింగరేణి కార్మకుడు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కొలనూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ (27) సింగరేణి సంస్థలో పని చేస్తున్నాడు. అర్జెంట్ అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా రూ.3 లక్షల అప్పు తీసుకున్నాడు.

అప్పు తీర్చినా వేధించిన లోన్ యాప్.. సింగరేణి కార్మకుడు ఆత్మహత్య
X

అర్జెంట్ అవసరాల కోసం చాలా మంది లోన్‌యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. లోన్‌యాప్‌ నిర్వాహకుల తీరుతో ఎంతో మంది మానసిక వేధింపులకు గురవుతున్నారు. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రజలు లోన్‌ యాప్‌లను ఆశ్రయించ వద్దని పోలీసులు పలు మార్లు సూచనలు చేశారు. అయినా చాలా మంది వేరే చోట అప్పు పుట్టకో, తీర్చేస్తామనే ధీమాతోనో లోన్‌ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. ఇలా లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకొని తీర్చేసిన తర్వాత కూడా వేధింపులకు పాల్పడటంతో ఒక సింగరేణి కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కొలనూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ (27) సింగరేణి సంస్థలో పని చేస్తున్నాడు. అర్జెంట్ అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా రూ.3 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వాయిదాల పద్దతిలో పూర్తిగా చెల్లించాడు. కానీ, యాప్ నిర్వాహకులు మాత్రం ఇంకా రూ.3 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారు. ప్రతీ రోజు కాల్స్ చేసి లోన్ చెల్లించాలని.. లేకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్లో పెడతామని బెదిరిస్తున్నారు.

డబ్బు చెల్లించకపోతే ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలుసని.. బంధవులు, స్నేహితులందరికీ ఫోన్ చేసి పరువు తీస్తామంటూ వేధిస్తున్నారు. దీంతో మిగిలిన సొమ్ములు కట్టే మార్గం లేక వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వల్లే వంశీ ఆత్మహత్య చేసుకున్నాడని బంధవులు ఆరోపించారు. నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శవమై తేలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

ఇటీవల కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆకుల శ్రీధర్ కుమార్ (44) విశాఖపట్నం బీచ్‌లో శవమై తేలాడు. వసంత్‌నగర్ సమీపంలో ఉన్న మెడోల్యాండ్స్ అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడితో ఉంటున్న శ్రీధర్.. కుటుంబ గొడవల కారణంగా మనస్తాపం చెంది ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల దగ్గర వాకబు చేసినా శ్రీధర్ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లోన్ యాప్స్ ద్వారా కూడా శ్రీధర్ అప్పు తీసుకున్నాడని.. ఇటీవల తరచుగా అతడికి వేధింపు కాల్స్ వస్తున్నాయని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదృశ్యమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, గురువారం అతడి శవం విశాఖపట్నం బీచ్‌లో కనపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  15 Sep 2023 1:16 AM GMT
Next Story