Telugu Global
CRIME

పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం.. బయటపెట్టిన హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్, కోల్‌కతా కేంద్రంగా.. ముంబై, లక్నో, గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడ్డారు.

పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం.. బయటపెట్టిన హైదరాబాద్ పోలీస్
X

దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. తాజాగా హైదరాబాద్‌, కోల్‌కతా కేంద్రంగా అనేక మందిని మోసం చేసి రూ.712 కోట్ల మేర మోసం చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ బయటపెట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దీనికి సంబంధించిన వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు.

హైదరాబాద్, కోల్‌కతా కేంద్రంగా.. ముంబై, లక్నో, గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడ్డారు. వీరికి దుబాయ్, చైనాకు చెందిన సైబర్ నేరస్థులతో కూడా సంబంధాలు ఉన్నట్లు సీవీ ఆనంద్ చెప్పారు. ఇప్పటి వరకు ఈ ముఠా అమాయకుల నుంచి రూ.712కోట్ల మేర కొల్లగొట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ క్రైమ్ ఎలా జరుగుతున్నది అంటే..

కొంత మొత్తం పెట్టుబడి పెడితే.. తక్కువ సమయంలోనే భారీగా రాబడి వస్తుందంటూ పలువురిని బుట్టలో వేసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకొని భారీగా పెట్టుబడులు రాబట్టారు. సామాన్య ప్రజలతో పాటు.. ఉద్యోగస్తులు, వ్యాపారులు కూడా వీరి వలలో చిక్కుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక ఇక్కడ కలెక్ట్ చేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి దుబాయ్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆ సొమ్ము చైనాకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ తరహాలో బయటపడిన సైబర్ మోసం ఇదే తొలిసారని.. అందుకే ఇలాంటి నేరాలపై జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని వెళ్లాల్సి ఉందని సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కొత్త తరహా మోసంపై కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ మోసాలపై ఎంత అప్రమత్తం చేసినా.. ప్రజలు మోసపోతూనే ఉన్నారని సీవీ ఆనంద్ అన్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇలాంటి మోసాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.

మరోవైపు ఈ సైబర్ క్రైమ్ ముఠా ఉపయోగించిన పలు వ్యాలెట్లు, యాప్స్‌‌ను తీవ్రవాదులు కూడా ఉపయోగిస్తుండటంపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఈ ముఠాకు తీవ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో దర్యాప్తు చేస్తున్నామని సీవీ ఆనంద్ వివరించారు.

First Published:  22 July 2023 6:45 AM GMT
Next Story