Telugu Global
MOVIE REVIEWS

విక్రాంత్ రోణ మూవీ రివ్యూ

సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోణ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది?

విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
X

చిత్రం: విక్రాంత్ రోణ

నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్ తదితరులు..

రచయిత-దర్శకుడు: అనూప్ భండారి

బ్యానర్లు: జీ స్టుడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్

నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్

సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్

ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి

రేటింగ్: 2.25/5

యష్ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మరి యష్ కంటే ముందు నుంచి కన్నడనాట కొనసాగుతున్న తన పరిస్థితేంటి? సుదీప్ ఇలానే ఆలోచించి విక్రాంత్ రోణ సినిమా తీసినట్టున్నాడు. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ సీనియర్ హీరో మంచి సెటప్ సెట్ చేసుకున్నాడు కానీ, మంచి కథను మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు. రొటీన్ కథకు పాన్ ఇండియా కలరింగ్ ఇచ్చి బోర్లాపడ్డాడు ఈ హీరో.

ఈరోజు రిలీజైన విక్రాంత్ రోణ సినిమాలో పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చేంత స్టఫ్ ఏమీ లేదు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ రెండు ఎలిమెంట్స్ లో తప్పితే సినిమాలో ఎక్కడా పాన్ ఇండియా అప్పీల్ కనిపించదు. అసలు ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే లోనే చాలా లోపాలున్నాయి. ముందుగా కథ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.

విశాఖ అడవుల్లో కామరాట్టు అనే చిన్న ఊరు. ప్రాచీనమైన ఆ ఊరిలో చిన్న పిల్లలు హత్యకు గురవుతుంటారు. దీనికి ఊరిలో ఉన్న ఓ పెద్ద ఇల్లు కారణమంటూ ఆ ఇంటిని మూసేస్తారు. ఆ ఇంటి బావిలోనే ఎస్సై మృతదేహం దొరుకుతుంది. ఈ మొత్తం కేసుల్ని ఛేదించేందుకు ఊరిలో అడుగుపెడతాడు విక్రాంత్ రోణ (సుదీప్). మరోవైపు ఊరి పెద్ద జనార్థన గంభీర (మధుసూధన్ రావు) ఇంట్లో మరో స్టోరీ నడుస్తుంది. అతడి కొడుకు సంజు, గుడిలో నగలు దొంగిలించి చిన్నప్పుడే ఊరు వదిలి పారిపోతాడు. విక్రాంత్ రోణ ఊరిలో అడుగుపెట్టే సమయానికి కొన్ని రోజుల ముందు సంజు (నిరూప్ భండారీ)కూడా అదే ఊరిలోకి అడుగుపెడతాడు. తన ప్రాణ స్నేహితుడి కూతురు అపర్ణ (నీతా అశోక్) పెళ్లిని తన ఇంట్లో జరిపించడానికి సిద్ధమౌతుంటాడు జనార్థన్ గంభీర. సంజు, అపర్ణ ప్రేమించుకుంటారు. విక్రాంత్ రోణ ఇన్వెస్టిగేషన్ కు సంజుకు సంబంధం ఏంటి? ఈ హత్యలతో, ఆ ఊరితో విక్రాంత్ రోణకు ఉన్న సంబంధం ఏంటి? వరుస హత్యల కేసుల్ని విక్రాంత్ రోణ లా ఛేధించాడు అనేది బ్యాలెన్స్ కథ.

చూడ్డానికి ఇదొక మిస్టరీ థ్రిల్లర్ కథ అని ఎవరైనా అనుకుంటారు. కానీ సినిమా చూస్తే ఇదొక ఫక్తు రివెంజ్ డ్రామా అనే విషయం అర్థమౌతుంది. తన కూతుర్ని చంపిన వ్యక్తులు ఎవరో కనిబెట్టి వాళ్లను హతమార్చే తండ్రి కథ ఇది. ఈ పాయింట్ ను చెప్పడం కోసం కథలో ఎన్నో ట్విస్టులు, ఆ కథ కోసం భారీ హంగులు పెట్టాడు దర్శకుడు. సినిమాలో విజువల్స్ కళ్లుచెదిరేలా ఉన్నాయి. కెమెరా యాంగిల్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ ఇట్టే ఆకర్షిస్తాయి. దీనికితోడు జాక్వెలిన్ తో పెట్టిన ఐటెసాంగ్ కూడా గిట్టుబాటు అవుతుంది. అయితే ఇలాంటి ఎన్ని హంగులు పెట్టినా, అసలు మేటర్ లేనప్పుడు సినిమా నిలబడదు. విక్రాంత్ రోణ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో కథ వీక్, స్క్రీన్ ప్లే ఇంకా వీక్. ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. సెకండాఫ్ ను చకచకా ముగించినట్టు అనిపిస్తుంది. దీంతో సెకండాఫ్ లో కన్ఫ్యూజన్ రాజ్యమేలుతుంది. శుభం కార్డు పడిన తర్వాత బయటకొచ్చి మరో 10 నిమిషాలు ఆలోచిస్తే తప్ప సినిమా బోధపడదు.

సినిమాలో ట్విస్టులు బాగా వేశాడు దర్శకుడు. అయితే ఆ ట్విస్టుల్ని రివీల్ చేసే క్రమంలో తను కన్ఫ్యూజ్ అయి, ప్రేక్షకుల్ని అయోమయానికి గురిచేశాడు. దీనికితోడు రైటింగ్ లో కూడా లోపాలున్నాయి. సినిమాలో కొన్ని పాత్రలు అనవసరం. కామెడీ కోసం పెట్టిన ఆ పాత్రల్ని తీసేస్తే బాగుండేది. అలానే కొన్ని సాంగ్స్ కూడా అనవసరం. అలా రన్ టైమ్ ను కాస్త తగ్గించి ఉంటే సినిమా ఉన్నంతలో ఆకట్టుకునేది. ఆ ప్రయత్నం జరగలేదు.

ఉన్నంతలో ఈ సినిమాను సుదీప్ ఆదుకున్నాడనే చెప్పాలి. తన యాక్టింగ్, ఫైట్స్ తో సుదీప్ తన పాత్ర మేరకు పూర్తి న్యాయం చేశాడు. అయితే అతడు కోరుకున్న పాన్ ఇండియా హీరో ఇమేజ్ ను మాత్రం ఈ సినిమా అందించదు. మరో సినిమాతో అతడు ప్రయత్నించాల్సి ఉంటుంది. సుదీప్ తప్ప ఇతర నటీనటులెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. హీరోయిన్ గా నటించిన నీతా అశోక్, కీలక పాత్ర పోషించిన నిరూప్ భండారీ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తముఖాలు కావడంతో.. వాళ్లు చేసిన పాత్రలు కనెక్ట్ అవ్వలేదు. దీనికితోడు డబ్బింగ్ లో లోపాలు, తెలుగు సీజీ లేకపోవడం కూడా చిన్నపాటి వెలితికి కారణం.

సాంకేతికంగా మాత్రం సినిమా ఉత్తమంగా ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆర్ట్ వర్క్, కెమెరావర్క్, సౌండ్ డిజైనింగ్ అన్నీ బాగున్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో హీరోయిన్ అనుకుంటే పొరబడినట్టే. ఆమె కేవంల ఐటెంభామ మాత్రమే. ఓ స్పెషల్ సాంగ్ చేసి వెళ్లిపోతుంది. జాక్వెలిన్ కు సినిమాలో సీన్ లేకపోయినా, స్పెషల్ సాంగ్ మాత్రం బాగుంది.

ఓవరాల్ గా పాన్ ఇండియా కలరింగ్ తో వచ్చిన విక్రాంత్ రోణ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. భారీ సెట్టింగ్స్, కళ్లుచెదిరే విజువల్స్ కోరుకునే వాళ్లు ఓసారి చూడొచ్చు.

Next Story