Telugu Global
Cinema & Entertainment

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ : మాజీ సీఎం చంద్రబాబు

'మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు' అని చంద్రబాబును ప్రశ్నించగా.. వైఎస్ఆర్ అని ఆయన సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ఎపిసోడ్ చూడాల్సిందే.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ : మాజీ సీఎం చంద్రబాబు
X

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారు. అసెంబ్లీలో అయినా, పార్టీ మీటింగ్స్‌లో అయినా.. ఆయన నవ్విన సందర్బాలు చాలా తక్కువు. చంద్రబాబు నవ్వు గురించి అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే సెటైర్లు వేశారు. ఆయన నవ్వలేరని.. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ బాబుకు చురకలంటించారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలే అలా ఉంటుంది. ఆయన నవ్వడం చాలా తక్కువే అని సన్నిహితులు కూడా చెప్తుంటారు. అయితే, చాన్నాళ్లకు చంద్రబాబు నవ్వుతూ ఓ టీవీలో కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా ఏళ్ల క్రితమే మానేశారు. అయితే ఇది ఇంటర్వ్యూ కాదు.. తన బావమరిది, ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నిర్వహిస్తోన్న 'అన్‌స్టాపబుల్' అనే కార్యక్రమం.

ఆహా ఓటీటీలో ప్రసారం అయిన అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్యలోని మరో కోణాన్ని ఈ కార్యక్రమం ఆవిష్కరించింది. మొదటి సీజన్ విజయవంతం కావడంతో ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభించబోతున్నారు. సీజన్2లో తొలి ఎపిసోడ్‌ను బావ చంద్రబాబు, అల్లుడు లోకేశ్‌తో స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్‌లో విడుదల చేయగా గంటలోనే వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో బాబు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. చాలా ఏళ్ల నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 'మీ జీవితంలో చేసిన రొమాంటిక్ పనేంటి' అని బాలయ్య ప్రశ్నించగా.. 'మీరు సినిమాల్లో చేశారు. నేను స్టూడెంట్‌గా చేశా' అని సరదాగా సమాధానం ఇచ్చారు.

కాలేజీలో చాలా దూకుడుగా ఉండేవాడినని.. బైక్ సైలెన్సర్ తీసేసి నడిపేవాడినని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 'మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు' అని చంద్రబాబును ప్రశ్నించగా.. వైఎస్ఆర్ అని ఆయన సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఇదే కార్యక్రమంలో ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దించిన సంఘటనకు సంబంధించిన చర్చ కూడా జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు చాలా సీరియస్‌గానే బాలయ్యకు సమాధానం ఇచ్చారు. నారా లోకేశ్ వచ్చి బాలయ్య, బాబులను ప్రశ్నలతో ముంచెత్తారు. ప్రోమో చూస్తే చాలా సరదాగా కనపడుతోంది. రెండో సీజన్ కూడా హిట్ చేయడానికి బాలకృష్ణ మంచి స్ట్రాటజీతోనే వచ్చినట్లు కనపడుతున్నది. ఈ కార్యక్రమం ఈ నెల 14 న ఆహాలో ప్రీమియర్ కాబోతున్నది.

First Published:  11 Oct 2022 1:29 PM GMT
Next Story