Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్ డైరెక్షన్.. హీరోల యాక్షన్..!

తాము ఎంతగానో ఆరాధించే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం దొరికితే ఇక ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ.. ఈ ఏడాది విడుదలైన విక్రమ్ మూవీ.

ఫ్యాన్స్ డైరెక్షన్.. హీరోల యాక్షన్..!
X

తమ అభిమాన హీరోలు తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఇక ఫ్యాన్సే దర్శకులుగా మారితే.. అది కూడా తాము ఎంతగానో ఆరాధించే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం దొరికితే ఇక ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ.. ఈ ఏడాది విడుదలైన విక్రమ్ మూవీ. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటించాడు. కమల్ హాసన్‌కు వీరాభిమాని అయిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ కమల్ హాసన్ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్‌కు విజయాల దాహం తీర్చింది.

ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అభిమానులే దర్శకులుగా మారి తమ ఫేవరెట్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ చిరంజీవికి ఎంత వీరాభిమానో అందరికీ తెలుసు. బాబీ దర్శకుడు కాకముందు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌లో మెంబర్ కూడా. అలాంటి అభిమాని అయిన బాబీకి తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం వాల్తేరు వీరయ్య మూవీతో లభించింది. దీంతో చిరంజీవిని ఎలా చూపిస్తే బాగుంటుందో.. అలాంటి అన్ని హంగులతో వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కిస్తున్నాడు.

ఇక మరో యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. గబ్బర్ సింగ్ సినిమా విడుదల సమయంలో స్టూడెంట్‌గా ఉన్న సుజిత్ థియేటర్లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో దర్శనమిస్తుంటాయి. అలాంటి ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్‌కు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దొరికింది. దీంతో పవన్ కళ్యాణ్‌ను ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో పవన్‌ని చూపించేందుకు సుజిత్ సిద్ధమవుతున్నాడు.

మరొక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాలకృష్ణ అంటే ఎంతో అభిమానం. తన మొదటి సినిమా పటాస్ విడుదలైనప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా చేసేందుకు అనిల్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలుసార్లు అనిల్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పలేదు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా అనిల్ మంచి కథతో బాలకృష్ణతో ఓకే చెప్పించుకుని ఆ కథని ప్రస్తుతం సెట్స్ పైకి తీసుకెళ్లాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే పవర్ ఫుల్ యాక్షన్ మూవీని అనిల్ రావిపూడి తీస్తున్నాడు. అభిమానులే దర్శకులుగా మారి తీస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ప్రభంజనం సృష్టిస్తాయో వేచి చూడాలి.

First Published:  30 Dec 2022 11:15 AM GMT
Next Story