Telugu Global
Cinema & Entertainment

వైఎస్ఆర్-చంద్రబాబుల ఫ్రెండ్‌షిప్‌పై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ తీసినా, వైఎస్ఆర్ బయోపిక్ తీసినా.. చంద్రబాబు-వైఎస్ఆర్‌ల మధ్య శతృత్వాన్నే చూపించారు. కానీ ఏనాడూ వీరి స్నేహాన్ని పూర్తిగా చూపించిన సినిమా రాలేదు.

వైఎస్ఆర్-చంద్రబాబుల ఫ్రెండ్‌షిప్‌పై వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
X

ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే.. ఇద్దరూ సమ వయస్కులు.. ఇద్దరూ ఒకే రాజకీయ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించారు. ఒకరికి ఒకరుగా బతికిన రోజుల నుంచి బద్ద శత్రువులుగా మారిన రోజుల వరకు జరిగింది అంతా ఇటీవల చరిత్రే. వాళ్లే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.

వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరిలో చంద్రబాబు ముందుగా సీఎం అవగా.. తన స్నేహితుడినే ఓడించి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విసుర్లు వేసుకోవడం.. బాహాటంగానే విమర్శించుకోవడం అందరం చూశాము. కానీ వీరు స్నేహంగా గడిపిన రోజులు మాత్రం ఎవరికీ అంతగా గుర్తు లేవు. ఎన్టీఆర్ బయోపిక్ తీసినా, వైఎస్ఆర్ బయోపిక్ తీసినా.. చంద్రబాబు-వైఎస్ఆర్‌ల మధ్య శతృత్వాన్నే చూపించారు. కానీ ఏనాడూ వీరి స్నేహాన్ని పూర్తిగా చూపించిన సినిమా రాలేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌తోనే ఒక వెబ్ సిరీస్ రాబోతున్నది.

పొలిటికల్ స్టోరీస్‌ను అద్భుతంగా తీయగలడనే పేరున్న డైరెక్టర్ దేవ్ కట్టా ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం, రాజకీయ ప్రయాణంపై ఒక కథ రాసుకున్నాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించి.. త్వరలోనే షూటింగ్‌కు వెళ్లనున్నారు.

వీలైనంత త్వరగా ఈ వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరి జీవితంలో చూడని సరికొత్త విషయాలను చెప్పబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటించే వాళ్లు ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.

First Published:  6 Sep 2023 11:12 AM GMT
Next Story