Telugu Global
Cinema & Entertainment

మేము 'కేరళ స్టోరీ' సినిమాను బ్యాన్ చేయలేదు.. ఫ్లాప్ అయ్యిందని థియేటర్లే తీసేశాయి : సుప్రీంలో తమిళనాడు ప్రభుత్వం

'ది కేరళ స్టోరీ' సినిమాను తాము నిషేధించలేదని సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. సినిమా ఫ్లాప్ అవడంతో థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ప్రదర్శనలను ఎత్తేశాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నది.

మేము కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయలేదు.. ఫ్లాప్ అయ్యిందని థియేటర్లే తీసేశాయి : సుప్రీంలో తమిళనాడు ప్రభుత్వం
X

'ది కేరళ స్టోరీ' సినిమా ప్రకంపనలు ఇంకా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పూర్తిగా అబద్దాలు, అవాస్తవాలతో సినిమా తీసి కేరళ రాష్ట్రాన్ని అవమాన పరిచారని ఇప్పటికే పలువురు ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బీజేపీ ఒక దశలో కర్ణాటక ఎన్నికల్లో ఆయుధంగా కూడా వాడుకోవడానికి ప్రయత్నించింది. కాగా, ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిషేధించాయి. దీంతో చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. తమ చిత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం అకారణంగా నిషేధించిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

సినిమా నిషేధంపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.'ది కేరళ స్టోరీ' సినిమాను తాము నిషేధించలేదని సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. సినిమా ఫ్లాప్ అవడంతో థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ప్రదర్శనలను ఎత్తేశాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోవడం, పేలవ స్పందన వల్ల రెవెన్యూ రావడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్లు లేకపోవడంతో థియేటర్లు మాత్రం ఎలా ఆడిస్తాయని తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది.

సినిమాను ప్రదర్శించ వద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకుంటే తాము మాత్రం ఏం చేయగలమని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సరైన కలక్షన్లు లేకపోవడంతోనే మే 7 నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేయాలని థియేటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది.

మే 5న తమిళనాడు లోని 19 మల్టీఫ్లెక్స్‌లలో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేశారు. తాము థియేటర్లలో ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారిపై నియంత్రణ కూడా చేయలేదు. అయితే మే 7న కలెక్షన్లు లేకపోవడంతో సినిమా ప్రదర్శనను థియేటర్లే నిలిపివేశాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్ కోసం సుప్రీంకోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. సినిమాను నిషేధించినట్లు చిన్న ప్రకటన కూడా లేదని తమిళనాడు ప్రభుత్వం తరపున అదనపు డీజీ సుప్రీంకోర్టుకు తెలిపారు.

First Published:  16 May 2023 1:02 PM GMT
Next Story