Telugu Global
Cinema & Entertainment

క్రౌడ్ ఫండింగ్ తో సక్సెస్ కొట్టిన ‘గామి’!

క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకుని నిర్మించిన సినిమాలు సక్సెస్ అవుతాయా? పెట్టుబడి దారులకు పెట్టిన పెట్టుబడితో బాటు లాభాలు వెనక్కు వస్తాయా? అసలు సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూరడం సాధ్యమవుతుందా? వీటన్నిటికీ అవుననే సమాధానం చెప్తుంది ‘గామి’. విశ్వక్ సేన్ ధైర్యం చేసి నటించిన ప్రయోగాత్మక సినిమా ‘గామి’ సక్సెస్ స్టోరీ ఇతరులకి బోలెడు స్ఫూర్తి. నిర్మాతలు దొరక్క వెనక్కి తగ్గే కొత్త దర్శకులకి క్రౌడ్ ఫండింగ్ ఒక వరం.

క్రౌడ్ ఫండింగ్ తో సక్సెస్ కొట్టిన ‘గామి’!
X

క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకుని నిర్మించిన సినిమాలు సక్సెస్ అవుతాయా? పెట్టుబడి దారులకు పెట్టిన పెట్టుబడితో బాటు లాభాలు వెనక్కు వస్తాయా? అసలు సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూరడం సాధ్యమవుతుందా? వీటన్నిటికీ అవుననే సమాధానం చెప్తుంది ‘గామి’. విశ్వక్ సేన్ ధైర్యం చేసి నటించిన ప్రయోగాత్మక సినిమా ‘గామి’ సక్సెస్ స్టోరీ ఇతరులకి బోలెడు స్ఫూర్తి. నిర్మాతలు దొరక్క వెనక్కి తగ్గే కొత్త దర్శకులకి క్రౌడ్ ఫండింగ్ ఒక వరం. అయితే ఇందులో ఒక మెలిక- నూటికి ఒకరో ఇద్దరో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో సక్సెస్ అవగల్గుతున్నారు.

తెలుగులో- ఆ మాటకొస్తే ఇండియాలో- క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకున్న దర్శకులు అతి తక్కువ. ఈ అతి తక్కువ మంది దర్శకులు నిర్మించిన క్రౌడ్ ఫండింగ్ సినిమాలు సక్సెస్ అవడమన్నది కూడా దాదాపు శూన్యం. ఎక్కువగా ఇండీసినిమా (ఇండిపెండెంట్ సినిమా లేదా స్వతంత్ర సినిమా) దర్శకులు తీసే లో- బడ్జెట్ సినిమాల కోసం క్రౌడ్ ఫండింగ్ కి వెళ్తారు. విష్ బెర్రీ, ఫ్యూయెల్ ఏ డ్రీమ్ వంటి క్రౌడ్ ఫండింగ్ ఆన్ లైన్ సైట్లలో నమోదై ప్రచారం మొదలెడతారు. కోరుకున్న బడ్జెట్ ని సమీకరించుకోవడానికి 90 రోజుల సమయమే వుంటుంది. ఈ సమయంలో ఆ బడ్జెట్ గనుక సమకూరక పోతే ప్రతిపాదన రద్దు చేసి, నిధులు పెట్టుబడి దారులకి వెనక్కి ఇచ్చేస్తాయి సదరు సైట్లు. దర్శకులకి ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుంది. దీన్ని దాటుకుని బడ్జెట్ ని చేజిక్కించుకున్న వారు తెలుగులో అరుదు.

సినిమాలకి క్రౌడ్-ఫండింగ్ లేదా క్రౌడ్-సోర్సింగ్ అనేది ఇండియాలో కొత్త ఆలోచన. కేవలం స్నేహితుల నుంచి లేదా బంధువుల నుంచి నిధులు తీసుకునే బదులు, సినిమా తీయాలనే అభిరుచి గల ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం మొదలుపెట్టారు కొత్త దర్శకులు. ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది స్నేహితులు, కుటుంబం, అభిమానులు, కస్టమర్లు సమిష్టి కృషి ద్వారా నిధుల్ని సేకరించే పద్ధతి.

సినిమాలనే కాదు, పుస్తకాల పబ్లిషింగ్ కి, మ్యూజిక్ ఆల్బమ్ లేదా యాప్స్ మొదలైనవాటి సృష్టికి, మ్యూజిక్ ఈవెంట్లు,ఆర్ట్ షోలు, కచేరీలూ మొదలైన వాటికి, వరదలు, భూకంపాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల బాధితులకీ నిధులు సమకూర్చకూడనికి సహాయపడుతున్నాయి క్రౌడ్ ఫండింగ్ ఆన్ లైన్ సంస్థలు.

సినిమాల విషయానికి వస్తే, ఆన్ లైన్ లేని కాలంలోనే 1976 లో, ప్రసిద్ధ కళాత్మక సినిమాల దర్శకుడు శ్యామ్ బెనెగల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానే బడ్జెట్ సమీకరించి ‘మంథన్’ తీశారు. గుజరాత్ లో విప్లవాత్మకంగా పాడి రైతులకి న్యాయం చేకూరుస్తూ అమూల్ డైరీ ప్రొడక్ట్స్ ని స్థాపించిన డాక్టర్ వర్ఘీస్ కురియన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. దీనికి 5 లక్షల మంది గుజరాతీ రైతులు కలిసి రూ. 2 చొప్పున వేసుకుని, 10 లక్షల రూపాయలు సినిమా నిర్మాణానికి సమకూర్చారు.

ఆన్ లైన్ క్రౌడ్ ఫండింగ్ తో 2010లో సంజయ్ సూరి ‘ఐయామ్’ అనే ప్రయోగాత్మక సినిమా కోసం సోషల్ నెట్వర్కుల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా 35 నగరాల్లో 400 మంది వ్యక్తుల నుంచి అవసరమైన డబ్బుని సేకరించారు 2012 లో ‘గ్రేటర్ ఎలిఫెంట్’ అనే ఇండిపెండెంట్ సినిమా కోసం దర్శకుడు విష్‌బెర్రీ సైట్ ని ని ఆశ్రయించి నిధులు పొందాడు. 2013 లో ‘లూసియా’ అన్న కన్నడ సినిమా కూడా ఇలా తీసిందే. 600 మంది నుంచి రూ. 75 లక్షల బడ్జెట్ సమకూరింది. 2016 లో ‘వేడ్’ అనే మరో మూవీ ఇలాగే తీశారు.

తెలుగులోకొస్తే, 2016 లో మొట్టమొదటి సారిగా కత్తి మహేష్ కుమార్ తీసిన ‘పెసరట్టు’ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలైంది. 2018 లో ఎన్. ఫణీంద్ర అనే దర్శకుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ‘మను’ తీశాడు. అయితే ‘పెసరట్టు’, ‘మను’ రెండూ ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ఇటీవల ‘కేరాఫ్ కంచర పాలెం’ దర్శకుడు తనమూడోసినిమా ‘మర్మానువు’ కోసం క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు . క్రౌడ్ ఫండింగ్ అనేది స్వతంత్ర పద్ధతిలో సినిమా చేయడానికి తనకు సహాయపడుతుందని అతను ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు.

కానీ తెలుగులో క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసి సక్సెస్ సాధించింది ‘గామి’ తోనే. దీనికి కె. విద్యాధర్ దర్శకుడు. ఇతను సక్సెస్ సాధించడమేగాక, పెట్టుబడి దారులకి పెట్టుబడిని, దానిపై లాభాల్ని వెనక్కు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మూవీ తొలి వారాంతంలోనే రూ. 22 కోట్లు గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో పడింది. పెట్టుబడిదారులందరికీ పంపిన మెయిల్‌లో, ఇతను ఇలా పేర్కొన్నాడు, ‘మేము ఈ మైలురాయిని చేరుకున్నందున, మీరు సినిమాపై పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చే ప్రక్రియని ప్రారంభించాలనుకుంటున్నాము. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకి చేరుకుంది. బయ్యర్లందరికీ మంచి లాభాలు వచ్చాయి’ అని. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇచ్చిన డబ్బులకి వడ్డీలు లాభాలు కూడా కలిపి వాపసు ఇవ్వనున్నట్టు తెలియజేశాడు.

సాధారణంగా సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ చేయడానికి ఎవరూ ముందుకురారు. అది భరోసా ఇవ్వని పెట్టుబడి. ఇండిపెండెంట్ సినిమాలకి ఇందుకే క్రౌడ్ ఫండింగ్ కష్టమవుతుంది. ఒకవేళ క్రౌడ్ ఫండింగ్ పొందగలిగినా, ఇండిపెండెంట్ సినిమాలు కమర్షియల్ గా లేక విడుదలకాక, విడుదలైనా ఆడక ఫండింగ్ చేసిన వాళ్ళకి రిక్త హస్తాలే మిగులుతాయి. ‘గామి’ విషయం వేరు. ఇందులో విశ్వక్ సేన్ లాంటి కమర్షియల్ స్టార్ వున్నాడు. ఇందుకే రూ. 6 కోట్ల వరకూ క్రౌడ్ ఫండింగ్ లో బడ్జెట్ ని గుమ్మరించగలిగారు ఇన్వెస్టర్లు. ఇదే స్టార్ లేని సినిమాకి క్రౌడ్ ఫండింగ్ అంటే ఎవరికైనా యాతనే. ఇందుకే చాలా తక్కువ సినిమాలు ఈ మోడల్ లో వస్తాయి. స్టార్ సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ తో ఒక లాభముంటుంది. వడ్డీల భారముండదు!

First Published:  21 March 2024 9:26 AM GMT
Next Story