Telugu Global
Cinema & Entertainment

ఇచ్చట తలలు నరికివేయ బడును!

నేడు సౌత్ నుంచి పానిండియా యాక్షన్ సినిమాలుగా వస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమాల్ని పరిశీలిస్తే వీటిలో తప్పనిసరిగా తలలు నరికివేసే సన్నివేశాలుంటాయి.

ఇచ్చట తలలు నరికివేయ బడును!
X

నేడు సౌత్ నుంచి పానిండియా యాక్షన్ సినిమాలుగా వస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమాల్ని పరిశీలిస్తే వీటిలో తప్పనిసరిగా తలలు నరికివేసే సన్నివేశాలుంటాయి. తీవ్ర రక్తపాతం, భయానక బీభత్సం, జుగుప్సా వుంటాయి. అయినా వీటికి ‘ఏ’ సెన్సార్ సర్టిఫికేట్ కాకుండా ఉదారంగా ‘యూ/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్టే లభిస్తుంది. అదే లైంగిక విజ్ఞానం గురించి సున్నితంగా చెప్పిన ‘ఓ మైగాడ్ 2’ కి పెద్దలకు మాత్రమే ‘ఏ’ సర్టిఫికేట్ లభిస్తుంది. ఇది శోచనీయ పరిస్థితి. అది పిల్లలతో కలిసి కుటుంబ ప్రేక్షకులూ సైతం చూసే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ లాంటి గ్యాంగ్ స్టర్ సినిమా అయినా సరే, అందులోని మితిమీరిన హింసకి యూ/ఏ సర్టిఫికెట్టే లభిస్తుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్స్ తో సంఘర్షించే ‘జైలర్’ లో స్వయంగా రజనీకాంత్ క్లోజప్ షాట్‌లో, ఒక గ్యాంగ్ స్టర్ ని రోడ్డు మీద తల నరికి చంపే సీను వుంది. ఆ తలలేని మొండెం భయానకంగా నేల కూలుతుంది!

నాని నటించిన ‘దసరా’ లో నాని సైకిల్ తొక్కుతున్నప్పుడు దుండగులు వెనుక కూర్చున్న వ్యక్తి తల నరికివేసే షాట్ వుంది. ఇది చూసుకోకుండా నాని సైకిలు తొక్కుకుంటూ అలా ముందుకే వెళ్ళి పోతూంటే, తల తెగిన మొండెం వెనుక అలాగే కూర్చుని పోతూంటుంది!

కన్నడలో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ లో అనేక శిరచ్ఛేదన దృశ్యాలతో బాటు, వ్యక్తుల్ని సజీవంగా పాతిపెట్టి కాల్చి చంపే దృశ్యాలున్నాయి. కమల హాసన్ ‘విక్రమ్‌’ లో ఒకావిడ తల అయితే గాలిలో అలా అలా ఎగిరి పోతుంది. ఇంకా దారుణంగా, ‘జైలర్’ లో విలన్ తన డెన్ లో మనుషుల్ని చంపే దృశ్యాలు గగుర్పాటు కలిగిస్తాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ వున్న డ్రమ్ములో తలకిందులుగా ముంచి మూత పెట్టేస్తే, ఆ మనిషి ఎముకలు సహా శరీరాన్ని కరిగించుకుని పైపులోంచి యాసిడ్ బయటికి పిచికారీ కొడుతుంది!

చివరికి రజనీకాంత్ విలన్ని ఇలాగే చంపుతాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ లో, చాలా మందిని చంపే సుదీర్ఘ రక్తపాత దృశ్యాలు, ఒకడి తల మీద కత్తిని దించి చంపే దృశ్యాలూ వున్నాయి.

ఈ సినిమాల్లో ఇంత హింస చూపడానికి గల కారణాన్ని కొందరు ఇలా వివరిస్తారు- కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడానికి ఇటువంటి హింసాత్మక సినిమాలని తీస్తున్నారని. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ (కన్నడ), ‘పుష్ప: ది రైజ్’ (తెలుగు), ‘విక్రమ్’(తమిళం), ‘భీష్మ పర్వం’ (మలయాళం) వంటి గ్యాంగ్ స్టర్ సినిమాల భారీ విజయాలు వాటిలోని హింసవల్లే సాధ్యమైందని అంటున్నారు. ఇలా చూపిస్తేనే బాక్సాఫీసు ఫలితాలు రికార్డు స్థాయిలో వుంటాయని దర్శకులు కూడా భావిస్తున్నారు.

దక్షిణాదిలో హింసాత్మక గ్యాంగ్‌స్టర్ సినిమాలకున్న ప్రస్తుత ప్రేక్షకాదరణే పానిండియన్ ప్రేక్షకాభిరుచి అనడానికి హిందీ రాష్ట్రాలే నిదర్శనం. ముందు వచ్చిన సినిమాలో చూపిన రక్తపాతాన్ని మించిన స్థాయిలో రక్తపాతాన్ని చూపిస్తేనే, తర్వాత వచ్చే తమ సినిమా నిలబడుతుందన్న లెక్కలు వేసుకుని సినిమాలు తీస్తున్నారు.

ఓర్మాక్స్ మీడియా రిపోర్టు ప్రకారం దేశంలో థియేటర్లకి వెళ్ళే ప్రేక్షకుల్లో 61% మంది పురుషులున్నారు. వీరిలో 56% పట్టణ ప్రాంతాల్లో, 67% గ్రామీణ ప్రాంతాల్లో వున్నారు. థియేటర్‌కి వెళ్ళే వారి సగటు వయస్సు 27.5 సంవత్సరాలు. దీనర్థం, సాధారణ థియేటర్ ప్రేక్షకుల్లో ఎక్కువ మంది యువకులు వున్నారు. వీరిని ఆకర్షించే సినిమాలకే డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువ. కనుక అలాటి వయోలెంట్ గ్యాంగ్ స్టర్ సినిమాలే తీస్తారు.

1970 లలో ఎమర్జెన్సీ నేపథ్యంలో సామాజిక-రాజకీయ గందరగోళానికి ప్రతిస్పందనగా యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరో తెర పైకొచ్చాడు. అప్పుడు సెన్సార్ కత్తెర బాగానే పడేది. విలన్లు విస్కీ బదులు కోకాకోలా తాగేవారు. ఇది చూసి ప్రేక్షకులు నవ్వుకునే వాళ్ళు. ఎక్కడా రక్తం చూపించకూడదు. కొట్టుకోవడం జోరు తగ్గించి కొట్టుకోవాలి. టైటిల్ ‘రామరాజ్యంలో రక్తపాతం’ అని వుంటే, ‘రామరాజ్యంలో రక్త పాశం’ గా మారిపోతుంది.

కానీ నేడు మనం చూస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ న్యాయం కోసం లేదా ధర్మం కోసం చాలా అరుదుగా పోరాడుతూ వుంటాడు. ఉదాహరణకి, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లలో హీరో నేరాలకి దిగడమనేది వ్యక్తిగత దురాశో, ఆశయమో అయుంటుంది. దీనికి ట్రెండ్ ప్రకారం భారీ స్టయిలిష్ యాక్షన్ దృశ్యాలు తోడవుతాయి. అప్పుడు శత్రువుల పైకి హీరో ధారాళంగా మండే బుల్లెట్స్ ని స్టయిలిష్‌గా పంప్ చేసి పొట్టన పెట్టుకోవడం, లేదా తల్వార్లతో పొడిచివేయడం, తలలు నరికివేయడం అన్నీ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమై పోతాయి. గరిష్ట రక్త పాతంతో ఏ శరీర భాగాన్ని సమర్ధవంతంగా తొలగించవచ్చో చూపించేటప్పుడు మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని దర్శకుల నమ్మకం. కాబట్టి వ్యక్తిగత ప్రతీకారాలతో శరీర భాగాల్ని తొలగించే నైపుణ్యాలతో ప్రస్తుతానికి సినిమాలుంటాయి.

First Published:  26 Sep 2023 12:56 PM GMT
Next Story