Telugu Global
Cinema & Entertainment

'ఫ్యామిలీ స్టార్' పై ట్రోలింగ్.. అది నిజం కాదన్న విజయ్ దేవరకొండ

తాను పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు.

ఫ్యామిలీ స్టార్ పై ట్రోలింగ్.. అది నిజం కాదన్న విజయ్ దేవరకొండ
X

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఆ కథనాలు నిజం కాదని తాజాగా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.

గీత గోవిందం కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ భారీ అంచనాల మధ్య ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ సినిమాపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు నెగెటివ్ రివ్యూలు రాశాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాకు అయినా రివ్యూ మూవీ విడుదలైన రోజు కాకుండా 3 రోజుల తర్వాత ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ మూవీపై దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

హీరో విజయ్ కూడా పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఫ్యామిలీ స్టార్ పై నెగెటివ్ రివ్యూ ఇస్తున్న వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. తాను పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. తాను పోలీసులను కలిసినట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఆ ఫొటో ఇప్పటిది కాదని ఆయన చెప్పారు.

First Published:  11 April 2024 2:37 PM GMT
Next Story