Telugu Global
Cinema & Entertainment

2023లో హీరోల లైనప్స్ ఇవే..

వరుస లైనప్స్‌తో హీరోలు బిజీగా ఉన్నారు. 2023లో ఎవరు, ఎవరితో సినిమా చేయాలన్నది ముందే డిసైడ్ అయింది. కొందరు హీరోలైతే ఇదివరకెప్పుడూ లేనంత బిజీగా ఉండబోతున్నారు.

2023లో హీరోల లైనప్స్ ఇవే..
X

సినిమా హీరోలకు 2022 బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. పోయినేడాది చాలామంది హీరోలు మంచి హిట్‌లు అందుకున్నారు. అదే ఊపుని 2023లో కంటిన్యూ చేయబోతున్నారు. ఈ ఏడాది మన హీరోలు ఏయే సినిమాలతో రాబోతున్నారో ఓసారి చూద్దాం.

మన టాప్ హీరోలందరికీ రాబోయే రెండు మూడేళ్ల షెడ్యూల్స్ ముందే రెడీ అయిపోయాయి. వరుస లైనప్స్‌తో హీరోలు బిజీగా ఉన్నారు. 2023లో ఎవరు, ఎవరితో సినిమా చేయాలన్నది ముందే డిసైడ్ అయింది. కొందరు హీరోలైతే ఇదివరకెప్పుడూ లేనంత బిజీగా ఉండబోతున్నారు. ఈ కొత్త ఏడాదిలో ముందుగా బోణీ కొట్టేది మెగాస్టార్ చిరంజీవి. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' వస్తోంది. దీంతోపాటు ఇదే ఏడాది 'భోళా శంకర్‌' కూడా రిలీజ్ అవుతోంది. మారుతి, వెంకీ కుడుముల కథలకు చిరు ఓకే చెప్పారని టాక్. ఆ సినిమాల అప్‌డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి మరి. అలాగే 2021లో 'అఖండ' తర్వాత బాలయ్య 2022లో గ్యాప్ తీసుకున్నాడు. అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉన్న బాలయ్య ఈ ఏడాది 'వీరసింహారెడ్డి'గా రాబోతున్నాడు. దీంతోపాటు అనిల్ రావిపూడి సినిమా కూడా ఇదే ఏడాది రిలీజయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ఏడాది బాలయ్య బిగ్‌బాస్ షోని కూడా హోస్ట్ చేస్తారని వార్తలొస్తున్నాయి.

గతేడాది 'ఎఫ్‌3'తో అలరించిన వెంకటేష్.. 'ఓరి దేవుడా'లో గెస్ట్ రోల్‌లో కనిపించారు. అయితే 2023లో వెంకీ 75వ మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతుంది. అలాగే త్రినాథరావు నక్కిన, తరుణ్‌ భాస్కర్‌ కూడా వెంకీ కోసం కథలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించిన అప్‌డేట్ కూడా ఈ ఏడాది రాబోతోంది. ఇకపోతే 2023లో నాగార్జున వందో సినిమా పట్టాలెక్కబోతోంది. మోహన్‌ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందులో అఖిల్‌ కూడా కనిపించబోతున్నాడని టాక్.

'ఆర్‌‌ఆర్‌‌ఆర్'తో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు 2023లో ఫుల్‌ బిజీ. ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఈ ఏడాది వచ్చే సూచనలు లేవు. కానీ, రామ్‌ చరణ్‌, శంకర్‌ సినిమా మాత్రం ఈ ఏడాది కచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కొచ్చు. అలాగే ఈ ఏడాది మహేశ్‌బాబు చేతిలో రెండు సినిమాలున్నాయి. త్రివిక్రమ్‌, రాజమౌళిలతో ఆయన సినిమాలు చేయాలి. అయితే.. ఈ ఏడాది మొత్తం త్రివిక్రమ్‌ చిత్రానికే కేటాయించే అవకాశం ఉంది. 2024లో రాజమౌళి సినిమా మొదలవుతుంది.

ఇకపోతే ఈ ఏడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. రెండేళ్ల నుంచీ బిజీగా ఉన్న ప్రభాస్ 2023లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'సలార్‌', 'ఆదిపురుష్‌' సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వనున్నాయి. ఆ తర్వాత 'రాజాడీలక్స్‌', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' సినిమాల షూటింగ్‌లు మొదలవుతాయి.

ఒకపక్క పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా.. షూటింగ్‌ను మాత్రం అనుకున్న టైంకు కంప్లీట్ చేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఈ ఏడాది 'హరి హర వీరమల్లు'తో పవన్ మన ముందుకి రాబోతున్నాడు. తర్వాత హరీశ్‌ శంకర్‌ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుంది. సుజిత్‌, సముధ్రఖని కథలకూ ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.

2022లో అల్లు అర్జున్‌ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇండియాలోనే మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న 'పుష్ప 2' షూటింగ్ ఇప్పటికే మొదలైంది. మరి ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

First Published:  3 Jan 2023 11:25 AM GMT
Next Story