Telugu Global
Cinema & Entertainment

అయోమయంలో తెలుగు పానిండియా

నేడు తెలుగు సినిమాలు పానిండియా సినిమాలుగా తెలుగు రాష్ట్రాల వెలుపల బ్రహ్మాండమైన అదరణ పొందుతున్నాయి.

అయోమయంలో తెలుగు పానిండియా
X

నేడు తెలుగు సినిమాలు పానిండియా సినిమాలుగా తెలుగు రాష్ట్రాల వెలుపల బ్రహ్మాండమైన అదరణ పొందుతున్నాయి. అయితే తెలుగు సినిమాల్ని హిందీ రాష్ట్రాలకి చాలా పూర్వమే పరిచయం చేసి ప్రేక్షకుల్లో పాపులర్ చేసిన డబ్బింగ్ నిర్మాత మహేంద్ర సింగ్ గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ కి చెందిన మహేంద్ర సింగ్ 2002 లో ఎన్టీఆర్ నటించిన’ అల్లరి రాముడు’ ని హిందీ లోకి డబ్ చేసి విడుదల చేసి తన వృత్తిని ప్రారంభించాడు. అప్పట్నుంచీ 10 తెలుగు స్టార్ సినిమాల్ని హిందీ ప్రాంతాలకి పరిచయం చేసి ఒక పునాది వేశాడు. దీంతో మరికొందరు ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలు, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్ కమెడియన్లూ ఎందరో శాటిలైట్ టీవీల ద్వారా హిందీ ప్రేక్షకుల ఇంటింటి హీరోలై పోయారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యాహ్నమైతే చాలు, తెలుగు డబ్బింగ్ సినిమాల ప్రసారాలతో హిందీ ఛానెళ్లు మోత మోగించేవి. బాలీవుడ్ లో డబ్బింగ్ కళాకారులకి గిరాకీ కూడా పెరిగింది.

తెలుగు సినిమాలకు దక్షిణ భారతదేశం వెలుపల మార్కెట్ తక్కువ వున్న సమయంలో, సింగ్ ఒక్కో సినిమా డబ్బింగ్ హక్కుల్ని కొన్ని లక్షలకి కొనుగోలు చేసి, హిందీలో డబ్బింగ్ చేయడానికి, సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ పొందడానికీ, సినిమాని మార్కెటింగ్ చేయడానికీ సమాన మొత్తాన్ని ఖర్చు చేసేవాడు. ముంబాయిలో థియేట్రికల్ విడుదల లేదా శాటిలైట్ ఛానెల్ విడుదల. ఆ తర్వాత స్టార్ల పారితోషికాలు, వాళ్ళ సినిమాల బడ్జెట్లూ భారీగా పెరిగి పోవడంతో 2 కోట్లకు పైగా వెచ్చించి డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ రంగం నుంచి తప్పుకున్నాడు.

ఇక 2015 లో ‘బహుబలి’ తో తెలుగు సినిమాల మార్కెట్టే పానిండియా మార్కెట్ గా ఎదిగిపోయింది. అయితే ‘బాహుబలి’ తో ఎకాఎకీన హిందీ ప్రేక్షకులకి సరికొత్త హీరోగా ప్రభాస్ పరిచయమై పాపులర్ కాలేదు. అంతకి ముందే డబ్బింగ్ సినిమాల పుణ్యమాని పరిచయమై వున్నాడు. ఆ పరిచయం ‘బాహుబలి’ ని బ్రహ్మాండం చేసింది.

‘బాహుబలి’ రెండుభాగాల పానిండియా ఘన విజయం తర్వాత ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ విజయాలు తెలుగు సినిమాల ప్రతిష్టని పెంచాయి. ఎంతగానంటే,

ఇండియన్ సినిమాలకి పాన్ గ్లోబల్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది తెలుగు సినిమాలే అని నేపాలీ సూపర్ స్టార్ భువన్ కెసి వ్యాఖ్యానించేంతగా. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ రెండూ పరాజయాల పాలయ్యాయి.

తెలుగు పానిండియా విజయాలకంటే అపజయాలే ఎక్కువున్నాయి. ‘రాధేశ్యామ్’ ఫ్లాప్ తర్వాత చిన్న హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ ఆశ్చర్యకరంగా పానిండియా ఘనవిజయం సాధించడంతో, తక్కువ బడ్జెట్ లో కూడా పానిండియాలు తీయవచ్చని నిర్మాతలకి అర్ధమైంది. కానీ ఈ అంచనా బెడిసికొట్టింది. ఇటీవల నాని నటించిన ‘దసరా’, అఖిల్ నటించిన ‘ఏజెంట్’, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ అట్టర్ ఫ్లాపయ్యాయి. తెలుగులో సూపర్ హిట్టయిన ‘విరూపాక్ష’ ఇతర భాషల్లో ఆశించిన వసూళ్లలో 5 శాతం కూడా రాబట్ట లేదు.

అసలు తెలుగు ప్రేక్షకుల నాడి ఏమిటో పట్టుకోలేక ఫ్లాపవుతున్న నిర్మాతలు, అఖిల భారత స్థాయిలో నాడులు, మెదళ్ళు పట్టుకోగలరా? ‘కార్తికేయ2’, ‘కాంతారా’ ల వంటి కంటెంటే కదా వుందని ‘విరూపాక్ష’ గురించి భావించారు. కానీ ‘కార్తికేయ2’, ‘కాంతారా’ దేవుళ్ళని చూపించిన ఒకరకమైన భక్తి సినిమాలు. ఉత్తరాదిన ఇప్పుడు రాజకీయాల పుణ్యమాని మతం, భక్తి బాగా అమ్ముడుపోతున్నాయి. కానీ ‘విరూపాక్ష’ మతం సినిమానో, లేదా దైవ భక్తితో కూడిన స్పిరిచ్యువల్ థ్రిల్లరో కాదు. అది దెయ్యాలకి సంబంధించిన హార్రర్ థ్రిల్లర్. ఇది తెలిసిన స్టార్ తో తెలుగులో తప్ప తమిళంలో కూడా హిట్ కాలేదు.

ఇక ‘ఏజెంట్’, ‘సాహో’ ఒకటే. ఈ రకమైన మాఫియా, స్పై సినిమాలు పానిండియాలో ‘పఠాన్’ లాంటివి బాలీవుడ్ స్టార్స్ తో తీస్తేనే ఆడతాయి. ‘పుష్ప’ లాంటి నేటివిటీ గల మాస్ కథలతో, పాత్రలతో వుంటేనే యాక్షన్ సినిమాలు పానిండియాలో కాదు, పాకిస్తాన్లో కూడా ఆడతాయి. పాకిస్తాన్లో అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ పాత్రతో కామెడీ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు (వీడియో చూడండి).

ఇక నాని ‘దసరా’ తెలంగాణా జీవితం పానిండియా కేమవసరం? పక్కనే సింగరేణి కాలరీస్ వుంచుకుని అది చూపించకుండా మద్యపానం చూపిస్తే ఏం లాభం. హిందీలో 1979 లో అమితాబ్-శశి కపూర్-శత్రుఘ్న సిన్హాలతో యష్ చోప్రా తీసిన బొగ్గుగని కార్మికుల కథ ‘కాలా పత్తర్’ లాంటిది తీసి వుంటే, ‘దసరా’ వైరల్ ఇండియా అయ్యేది.

ఇలా పానిండియాగా తెలుగు సినిమా ఎంత ఎదిగిందో అంత తగ్గిపోతోంది. అంటే పానిండియా కి వందల కోట్ల బడ్జెట్లు, యూనివర్సల్ అప్పీలున్న కంటెంటూ వుంటే తప్ప ముట్టుకోకూడదన్న మాట. అలాటివి ‘పుష్ప2’, ‘ఆది పురుష్’, ‘సాలార్’, ‘ఎన్టీఆర్30’, ‘ఆర్సీ 15’, ‘ప్రాజెక్ట్ కె’ వంటివి రాబోతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులు ఆటోమేటిగ్గా పానిండియా మూడ్ నీ, మార్కెట్ నీ, సందడినీ క్రియేట్ చేస్తాయి. లేదంటే విజయ్ ని గుర్తు పెట్టుకోవడం బెటర్. 100 కోట్లకి పైగా పారితోషికం తీసుకునే తమిళ స్టార్ విజయ్ తను నటిస్తున్న ‘లియో’ పానిండియా మాస్ సినిమాని తర్వాత తమిళంకి పరిమితం చేసుకుని పద్ధతిగా తీస్తే చాలని చెప్పేశాడు నిర్మాతకి, దర్శకుడికి. స్థానిక కంటెంట్ ని పానిండియా మీద రుద్ద కూడదన్న అతడి ముందు చూపు ఇతరులకీ వుంటే ఆశాభంగాలుండవు.



First Published:  10 May 2023 10:22 AM GMT
Next Story