Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్.. భక్తి వేరు, బిజినెస్ వేరు

Adipurush Ticket rates - భక్తి వేరు, బిజినెస్ వేరు అని నిరూపిస్తోంది ఆదిపురుష్ సినిమా. ప్రచారంలో భక్తిభావాన్ని పొంగిపొర్లిస్తున్న ఈ సినిమా, టికెట్ రేట్లు పెంచి, బిజినెస్ ను కాపాడుకుంటోంది.

Adipurush New Poster: ఆదిపురుష్ కొత్త పోస్టర్
X

Adipurush New Poster: ఆదిపురుష్ కొత్త పోస్టర్

ఆదిపురుష్ సినిమా ప్రచారానికి భక్తిని ముడిపెట్టింది యూనిట్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను తిరుపతిలో చేసింది. 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని బాగా పాపులర్ చేసింది. అక్కడితో ఆగకుండా.. ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఓ సీటు ను ఖాళీగా విడిచిపెట్టబోతోంది.

మరి ఇంత భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్న ఆదిపురుష్ యూనిట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షక భక్తుల కోసం టికెట్ రేటు తగ్గించొచ్చు కదా. చాలామంది నుంచి వస్తున్న విజ్ఞప్తి ఇది. రేట్లు తగ్గించకపోయినా ఫర్వాలేదు, కనీసం ఉన్న రేట్లను పెంచకుండా ఉంచితే అదే చాలంటున్నారు.

రాముడి మార్గాన్ని, రామాయణాన్ని ఈ తరానికి అందించడమే తమ లక్ష్యం అని చెప్పుకుంటున్న యూనిట్.. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుల్ని దూరం చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. ఇప్పుడున్న ధరల్నే కొనసాగిస్తే, మరింతమందికి ఈ సినిమా చేరువవుతుందని సూచిస్తున్నారు.

అయితే మేకర్స్ మాత్రం భక్తికి, బిజినెస్ కు ముడిపెట్టడం లేదు. ఎందుకంటే, ఆదిపురుష్ ప్రాజెక్టు భారీ బడ్జెట్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే అటుఇటుగా 150 కోట్ల రూపాయలతో ముడిపడిన సినిమా ఇది. ఇంత మొత్తం వెనక్కు రావాలంటే టికెట్ రేట్లు పెంచాల్సిందే.

అందుకే నార్త్ బెల్ట్ లో ఇప్పటికే ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభంకాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో యూనిట్ చర్చలు జరుపుతోంది. రేట్ల పెంపుపై గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి.

నైజాంలో ఈ సినిమా 60 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అటు ఆంధ్రాలో 70 కోట్లకు బిజినెస్ క్లోజ్ చేశారు. ఈ మొత్తాలు వెనక్కు రావాలంటే టికెట్ రేట్లు పెంచాల్సిందే. అయితే ఏ మేరకు పెంచుతారనేది చూడాలి. ఎందుకంటే, ఇది యాక్షన్ మాస్ మసాలా సినిమా కాదు, భక్తిభావంతో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ. ఇలాంటి సినిమాకు భారీగా రేట్లు పెంచితే యూత్ దూరమౌతారనే వాదన కూడా ఉంది.

ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లను మేకర్స్ బెంచ్ మార్క్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఎలాగైతే టికెట్ రేట్లు సవరించారో, దాదాపు అవే రేట్లను ఆదిపురుష్ కు కూడా అప్లయ్ చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చే జోవోలపై ఇది ఆధారపడి ఉంటుంది.

First Published:  13 Jun 2023 12:57 AM GMT
Next Story