Telugu Global
Cinema & Entertainment

సినిమా రివ్యూలపై కేరళలో మార్గదర్శకాలు ఇవీ!

కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కెఫ్పా), ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) కలిసి మలయాళ సినిమాలపై సినిమా రివ్యూల పేరిట ఇటీవల జరుగుతున్న రివ్యూ బాంబింగ్ ని ఎదుర్కోవడానికి కొత్త మార్గదర్శకాలని, చర్యల్ని రూపొందించాయి.

సినిమా రివ్యూలపై కేరళలో మార్గదర్శకాలు ఇవీ!
X

కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (కెఫ్పా), ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) కలిసి మలయాళ సినిమాలపై సినిమా రివ్యూల పేరిట ఇటీవల జరుగుతున్న రివ్యూ బాంబింగ్ ని ఎదుర్కోవడానికి కొత్త మార్గదర్శకాలని, చర్యల్ని రూపొందించాయి. నిర్మాతలపై కేరళ హైకోర్టు ఇటీవల ఘాటుగా చేసిన ప్రకటనలకి ప్రతిస్పందనగా ఈ కొత్త చర్యలు వచ్చాయి. ‘ఆరోమాలింటే ఆద్య ప్రణయం’ సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూలు పోస్టు చేసిన వ్యక్తులపై దర్శకుడు ముబీన్ రవూఫ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ జరుపుతున్న సందర్భంగా, నిర్మాతలు ఎక్కడ వున్నారని న్యాయస్థానం ఆశ్చర్యపోయింది.

దీని ఫలితంగానే నవంబర్ 2 వ తేదీ కొచ్చిలో ఫిలిం పీఆర్‌ఓలతో, ఆన్ లైన్ వేదికలతో పై రెండు సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో చర్చల ఫలితంగా రివ్యూ బాంబింగ్ కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించాయి. కొత్త మలయాళ సినిమాలకు సంబంధించిన నెగెటివ్ రివ్యూలకి వ్యతిరేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలని వెల్లడించాయి.

కొత్త మార్గదర్శకాల్లో భాగంగా, సినిమాల్ని ప్రోత్సహించే ఆన్ లైన్ వేదికల్ని (వెబ్సైట్స్) ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అవి కెఫ్పా నుంచి అక్రిడిటేషన్ పొందాలి. ఆన్‌లైన్ ప్రమోషన్‌ల కోసం గరిష్టంగా అందుబాటులో వున్న వేదికల్ని మాత్రమే పరిగణించడం జరుగుతుంది. తద్వారా ఆన్ లైన్ వేదికల్ని పర్యవేక్షించడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ ని కలిగి వున్న ఎవరైనా ప్రెస్ మీట్‌లలోకి వెళ్ళకుండా వుండేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి.

సినిమా విడుదలైన తొలి రోజుల్లో షోలు ముగిసిన వెంటనే థియేటర్ల దగ్గర వీడియో రివ్యూల్ని అనుమతించడం జరగదు. దీని ఉల్లంఘనకి సంబంధించిన సమాచారం సినిమా పీఆర్వోల ద్వారా, ఆన్ లైన్ వేదికల ద్వారా నిర్మాతలకు పంపడం జరుగుతుంది. కంటెంట్ సృష్టికర్తలు నెగెటివ్ రివ్యూలని ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, ఇది సినిమాల కలెక్షన్‌పై ప్రభావం చూపుతొందనీ కెఫ్పా పేర్కొంది.

కెఫ్పా కూడా రివ్యూలకి వ్యతిరేకం కాదని, అయితే తొలి రోజుల్లో థియేటర్ల దగ్గర వీడియో రివ్యూలని మాత్రమే నిషేధించామని స్పష్టం చేసింది. థియేటర్ ప్రాంగణంలో వీడియో రివ్యూల చిత్రీకరణని నిలిపివేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌ ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో, తొలిరోజుల్లో షోల తర్వాత ఇలాంటి పద్ధతులు (వీడియో రివ్యూలు) జరగకుండా చూసుకోవాలని ఫిలిం ఛాంబర్ థియేటర్ యజమానుల్ని ఆదేశించింది.

సినిమాల ప్రచార కార్యక్రమాల కోసం నిర్మాతలు ఒప్పందాలు చేసుకునే ఆన్‌లైన్ వేదికల జాబితా చేయమని కెఫ్పా ఫెఫ్కాని కోరింది. సినిమా రివ్యూల్ని నిషేధించబోమని, అయితే కంటెంట్ సృష్టికర్తలు ప్రజాస్వామ్య వాతావరణంలో పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపింది.

సినిమా రివ్యూల్లో బాడీ షేమింగ్, కులపరమైన దాడులు, లింగ అసమానతపై వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు వంటి చర్యల్ని తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ఇలాంటి చర్యలకి వ్యతిరేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

రివ్యూ బాంబింగ్ కేసుని దర్యాప్తు చేస్తున్న కేరళ హైకోర్టు, హానికరమైన సినిమా రివ్యూలని అనామకంగా అప్‌లోడ్ చేయడం లేదా సర్క్యులేట్ చేయడం వంటివి జరగకుండా చూసేందుకు ఆన్‌లైన్ వేదికల్ని నిశితంగా పర్యవేక్షించాలని పిలుపునిచ్చింది.

ఈ మొత్తం నేపథ్యంలో దర్శకుడు బి ఉన్నికృష్ణన్ - విమర్శ అనేది ఒక ప్రజాస్వామ్య మార్పిడి అని, అది అంతర్దృష్టితో పదునుగా వుండాలనీ, బాడీ షేమింగ్ కి, మౌఖిక దాడులకూ దారితీసినప్పుడు అది స్వేచ్ఛని దుర్వినియోగం చేయడమవుతుందనీ చెప్పారు.

నిర్మాత అంజలీ మీనన్ తన సినిమా ‘వండర్ ఉమెన్’ కి సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివ్ రివ్యూల్ని పురస్కరించుకుని- విమర్శకులు సమీక్ష రాసే ముందు సినిమా ఎలా నిర్మాణం జరిగిందో తెలుసుకోవాలనీ, దురదృష్టవశాత్తూ చాలా మంది సమీక్షకులకి ఒక సినిమాని ఎలా సమీక్షించాలనే జ్ఞానం కూడా లేదనీ పేర్కొన్నారు.

‘రామచంద్ర బాస్ అండ్ కో నిర్మాణ బృందం - సోషల్ మీడియాలో నెగెటివ్ అభిప్రాయాల్ని వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ లలోని నకిలీ ఖాతాల్ని సినిమాని దిగజార్చడానికి ఉపయోగించారని, అందులో పాల్గొన్న వ్యక్తులు బుక్‌మైషో టికెట్ బుకింగ్ యాప్‌లో నకిలీ సమీక్షల్ని, తక్కువ రేటింగ్స్ ని పదేపదే పోస్ట్ చేశారనీ ఆరోపించింది.

‘బి 32 ముతాల్ 44 వారే’ దర్శకురాలు శృతీ శరణ్య - తన సినిమా చూడని వారు కూడా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల ద్వారా దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారనీ, తన తల్లిదండ్రుల్ని కూడా విడిచిపెట్టలేదనీ, ఇది యువత మనస్తత్వాన్ని తెలుపుతోందనీ పేర్కొన్నారు.

‘కింగ్ ఆఫ్ కోతా’ దర్శకుడు అభిలాష్ జోషి- పరిశ్రమలోనే తమ పట్ల వ్యతిరేకత వుందని, అగ్ర సమీక్షకులు అనిపించుకునే కొందరి పెయిడ్ రివ్యూల్ని ప్రేక్షకులు ఫేస్ వాల్యూతో తీసుకుంటారనీ, బుద్ధిపూర్వకంగా సినిమాల్ని దిగజార్చడం ఆపాలనీ కోరారు. సినిమాని జడ్జ్ చేసే హక్కు ప్రేక్షకులకి వుంటుందని, ఎవరైనా సినిమా చూడకుండా ప్రేక్షకుల్ని నిరోధించే ఉద్దేశంతో యూట్యూబ్ వీడియోలు చేయకూడదనీ విజ్ఞప్తి చేశారు.

ఒక సమీక్షకుడు సినిమాలో పాజిటివ్ అంశాల్ని కూడా ప్రస్తావించకుండా సినిమాని ఎలా సమీక్షించగలడని, అంతర్గత ఉద్దేశాలతో మొత్తం సినిమాని చించి పోగులు ఎలా పెడతాడనీ ప్రశ్నించారు. ఆన్‌లైన్ రివ్యూల వల్ల సినిమాలు ప్రభావితమవుతాయని, డబ్బులు ఇవ్వలేదని కొందరు సినిమాలపై దాడి చేస్తారని, ఇది పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారిందనీ చెప్పుకొచ్చారు.

సినిమా రివ్యూలు రెండు విధాలని, ఒకటి ప్రొఫెషనల్ రివ్యూలని, మరొకటి మోటివేటెడ్ రివ్యూలనీ, సమస్య కేవలం మేకర్స్ ని బ్లాక్‌మెయిల్ చేయడం కోసం, లేదా సినిమా విజయాన్ని అడ్డుకోవడం కోసం ఉద్దేశించిన మోటివేటెడ్ రివ్యూలతోనే వస్తోందనీ కేసుని విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. సినిమా కావచ్చు, ఇంకేదైనా ఉత్పత్తి కావచ్చు- దాని వృత్తిపరమైన సమీక్షకీ, వ్యక్తిగత అభిప్రాయానికీ మధ్య వ్యత్యాసం వుందనీ స్పష్టం చేశారు.

First Published:  9 Nov 2023 6:44 AM GMT
Next Story