Telugu Global
Cinema & Entertainment

ది వారియర్ మూవీ రివ్యూ

ది వారియర్ మూవీ రివ్యూ: ఒకప్పుడు హిట్ డైరక్టర్ లింగుసామి. ఇప్పుడు అతడు ఫామ్ లో ఉన్నాడా? ఇప్పటి తరం ఆడియన్స్ కు తగ్గట్టు సినిమా తీయగలడా? లింగుసామిలో మునపటి రేసీ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ ట్విస్టులు ఉన్నాయా?

ది వారియర్ మూవీ రివ్యూ
X

చిత్రం: ది వారియర్

నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, నదియా, పోసాని తదితరులు

ఎడిటింగ్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

బ్యానర్: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్

నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి

రచన: – దర్శ‌క‌త్వం: ఎన్‌.లింగుస్వామి

రేటింగ్: 2.5/5

ఒకప్పుడు హిట్ డైరక్టర్ లింగుసామి. ఇప్పుడు అతడు ఫామ్ లో ఉన్నాడా? ఇప్పటి తరం ఆడియన్స్ కు తగ్గట్టు సినిమా తీయగలడా? లింగుసామిలో మునపటి రేసీ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ ట్విస్టులు ఉన్నాయా? రిలీజ్ కు ముందు వారియర్ సినిమాకు సంబంధించి చాలామంది ఇవే అనుమానాలు పెట్టుకున్నారు. ఈరోజు సినిమా రిలీజైన తర్వాత ఆ అనుమానాలే నిజమయ్యాయి. ఈ సినిమా ఓ పదేళ్ల కిందట వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేదనేది అందరి కామన్ అభిప్రాయం. అలా అని మరీ తీసిపారేసే సినిమా కూడా కాదిది.

హైదరాబాద్ లో డాక్టర్ చదువు పూర్తి చేసుకొని కర్నూల్ లో హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు సత్య (రామ్ పోతినేని). రేడియో జాకీ గా పనిచేసే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి)తో ప్రేమలో పడతాడు. మహాలక్ష్మి కూడా సత్యని ప్రేమిస్తుంది. ఇక డాక్టర్ గా ప్రాణాలు పోస్తూ ప్రాణం విలువ తెలిసిన సత్య, తన ఎదురుగా గురు (ఆది పినిశెట్టి) మనుషులు ప్రాణాలు తీయడం చూసి తట్టుకోలేక వారిపై ఎదురు తిరుగుతాడు. తనపై ఒకడు ఎదురు తిరిగాడని తెలుసుకున్న గురు, సత్య ని చచ్చేలా కొట్టి వదిలేస్తాడు. రెండేళ్ల తర్వాత సత్య ఐపీఎస్ ఆఫీసర్ గా మళ్లీ కర్నూలు లో అడుగుపెట్టి గురు కి అతని మనుషులకు ఎదురెళ్లి వారితో ఢీ కొడతాడు.

క్లయిమాక్స్ ఏంటో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేని కథ ఇది. ఈ మొత్తం కథలో కొత్త పాయింట్ ఏదైనా ఉందంటే, అది డాక్టర్, పోలీస్ గా మారడం అనే ఎలిమెంట్. బహుశా, రామ్ ను ఈ ఎలిమెంటే బాగా ఆకర్షించి ఉంటుంది. అందుకే ఇన్నాళ్లూ యూనిఫామ్ కు దూరంగా ఉన్న రామ్, ఈసారి ఖాకీలో కనిపించాడు. కానీ ఖాకీతో హిట్ కొట్టాలంటే కేవలం ఈ ట్విస్ట్ ఉంటే సరిపోదు, మిగతా సెటప్ కూడా సరిపోవాలి. అది ఈ సినిమాకు సరిపోలేదు.

స్టోరీలైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు లింగుసామి పదేళ్ల కిందటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. రామ్ కు ఈ తరహా పాత్రలు కొత్త కావొచ్చు కానీ, ఆడియన్స్ కు ఇలాంటి పోలీసు స్టోరీలు బాగా తెలుసు. సినిమాలో వచ్చే దాదాపు ప్రతి ట్విస్ట్ ను ప్రేక్షకుడు ముందే ఊహించుకుంటున్నాడు. అదే ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. దీనికితోడు కృతిషెట్టితో పెట్టిన లవ్ ట్రాక్ సరిగ్గా పండలేదు. దీనికితోడు కొన్ని సందర్భాల్లో వచ్చే ఫేక్ ఎమోషన్స్ (ఇవి కూడా పదేళ్ల కిందటి ఎక్స్ ప్రెషన్లే), ఫస్టాఫ్ లో స్లోగా సాగే కథనం సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి.

డాక్టర్, పోలీస్ అయ్యాడు అనే పాయింట్ ను మాత్రం దర్శకుడు ప్రభావవంతంగా చూపించగలిగాడు. అయితే ఈ పాయింట్ చుట్టూ ఓల్డ్ స్కూల్ నెరేషన్ రాసుకోవడంతో సమస్య వచ్చింది. బహుశా ఈ విషయంలో సరైన రచయితల్ని తీసుకొని ఉంటే బాగుండేది. స్క్రిప్ట్ పై చాలా పర్టిక్యులర్ గా ఉండే రామ్ కూడా ఈసారి లింగుసామిపై నమ్మకంతో లైట్ తీసుకున్నట్టున్నాడు.

ఉన్నంతలో ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది రామ్ మాత్రమే. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రామ్ ఆకట్టుకున్నాడు. డాక్టర్ గా, లవర్ గా, పోలీసాఫీసర్ గా.. డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. కృతి శెట్టి పాత్ర తేలిపోయింది. ఆమెను పాటల కోసం మాత్రమే తీసుకున్నారనే విషయం ఇంటర్వెల్ సరికి అందరికీ తెలిసిపోతుంది. గురు పాత్రలో ఆది పినిశెట్టి విలనిజం బాగుంది కానీ ఇదివరకు చేసిన క్రూరమైన పాత్రలతో పోల్చుకుంటే, ఇంకా వెయిట్ సరిపోలేదనిపిస్తుంది. బ్రహ్మాజీ, అక్షర గౌడ, నదియా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోసాని, జయప్రకాష్, అజయ్ పాత్రలు క్లిక్ అవ్వలేదు.

టెక్నికల్ గా చూసుకుంటే.. ముందుగా దేవిశ్రీప్రసాద్ గురించే చెప్పుకోవాలి. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తే దానికి ప్రధాన కారణాల్లో దేవిశ్రీప్రసాద్ ఒకడు. 2 సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. సినిమాలో యాక్షన్ సీన్లు ఎలివేట్ అవ్వకపోవడానికి దేవిశ్రీ బీజీఎం కూడా ఓ కారణం. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ మాత్రం అదిరింది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సాయిమాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, రామ్ పెర్ఫార్మెన్స్ కోసం 'ది వారియర్' ని ఓ సారి చూడొచ్చు. ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ మాత్రం సూపర్ హిట్ అనిపించదు.

First Published:  14 July 2022 9:55 AM GMT
Next Story