Telugu Global
Cinema & Entertainment

మరో హిందూత్వ గెలుపు - పాక్ సినిమాపై వేటు!

పాకిస్థానీ బ్లాక్‌బస్టర్ ‘ది లెజండ్ ఆఫ్ మౌలా జాట్’ కి కేంద్రీయ సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. దీంతో డిసెంబర్ 30 న విడుదల కావాల్సి వున్న ఈ పాకిస్థానీ బ్లాక్ బస్టర్ (బడ్జెట్ రూ. 45 కోట్లు, ప్రపంచవ్యాప్త బాక్సాఫీసు రూ. 238 కోట్లు) నిరవధికంగా వాయిదా పడింది.

మరో హిందూత్వ గెలుపు - పాక్ సినిమాపై వేటు!
X

మరో హిందూత్వ గెలుపు - పాక్ సినిమాపై వేటు!

మరో పాకిస్థానీ సినిమా మీద వేటు పడింది. యురీ ఉగ్రవాద దాడితో ఇండో- పాక్ సినిమా పరిశ్రమ వర్గాలు పరస్పరం సినిమాల్ని నిషేధించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇటీవల పాకిస్థానీ వెబ్ సిరీస్ 'సేవక్ -ది కన్ఫెషన్' ని నిషేధించింది. తిరిగి ఇప్పుడు 'ది లెజండ్ ఆఫ్ మౌలా జాట్' కి ఇచ్చిన ని వాపసు తీసుకుంది. పాకిస్థానీ బ్లాక్‌బస్టర్ 'ది లెజండ్ ఆఫ్ మౌలా జాట్' కి కేంద్రీయ సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. దీంతో డిసెంబర్ 30 న విడుదల కావాల్సి వున్న ఈ పాకిస్థానీ బ్లాక్ బస్టర్ (బడ్జెట్ రూ. 45 కోట్లు, ప్రపంచవ్యాప్త బాక్సాఫీసు రూ. 238 కోట్లు) నిరవధికంగా వాయిదా పడింది.

విడుదలని అడ్డుకుంటామని హిందూత్వ సంఘాలు బెదిరించడంతో కేంద్రీయ సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. 'పఠాన్' పాట విషయంలో కూడా సెన్సార్ బోర్డు బెదిరింపులకి లొంగి పాటకి అభ్యంతరాలు తెలిపింది.

మల్టీప్లెక్స్ గ్రూపులు పీవీఆర్, ఐనాక్స్ లు పంజాబ్‌తో పాటు, ఢిల్లీలోని ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రద్దు వార్త వెలువడింది.

అయితే 11 ఏళ్ళ తర్వాత దేశంలో విడుదలవుతున్న తొలి పాకిస్థానీ మూవీగా నిలిచిన ఈ సినిమా విడుదల ఆపడం గురించి కేంద్రీయ సెన్సార్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

బిలాల్ లాషరీ దర్శకత్వం వహించిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' అక్టోబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రశంసలు పొందింది. 1979 నాటి హిట్ 'మౌలా జాట్' కి ఇది రీమేక్. ఇందులో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించి ఇంటి ముఖం పట్టిన పాకిస్థానీ హీరో హీరోయిన్లు ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ లు నటించారు. అయితే ఒకవేళ ప్రస్తుత సినిమా ఇండియాలో విడుదలైనా వీళ్ళు ప్రమోషన్ కి ఇండియాకి వచ్చే అవకాశం వుండేది కాదు.

వీరిద్దరూ చేసిన ఘోర తప్పిదం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, 2016 లో కాశ్మీర్లో యురీ ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించక పోవడం. ఫవాద్ ఖాన్ 2014-16 మధ్య 'ఖూబ్ సూరత్', 'కపూర్ అండ్ సన్స్', 'యే దిల్ హై ముష్కిల్' సినిమాల్లో నటించాడు. మాహిరా ఖాన్ 2017 లో షారూఖ్ ఖాన్ తో 'రయీస్' లో నటించింది. యురీ ఘటన అప్పట్నుంచీ పాకిస్థానీ కళాకారుల మీద అనధికారిక నిషేధం కొనసాగుతోంది.

'మౌలా జాట్' ని ఫవాద్, మాహిరాల కారణంగానే అడ్డుకోవడం లేదు హిందూత్వ సంఘాలు- ఇందులో విలన్ గా నటించిన ప్రముఖ నటుడు హంజా అలీ అబ్బాసీ 26/11 ముంబాయి టెర్రర్ సూత్రధారి హఫీజ్ సయీద్‌ ని మెచ్చుకోవడం కూడా కారణమైంది.

ఈ రీమేక్‌లో ఫవాద్ ఖాన్ మౌలా జాట్ గా నటించాడు. హంజా అలీ అబ్బాసీ విలన్ నూరీ నట్ పాత్ర పోషించాడు. మహీరా ఖాన్ మౌలా జాట్ ప్రేయసి ముఖూ జాట్నీ పాత్ర నటించింది. పాకిస్థాన్లోని పంజాబ్ గ్రామం మౌలాలో ఓ నిజ గాథ వాడుకలో వుంది. పూర్వం మౌలా గ్రామాన్ని పీడిస్తున్న నూరీనట్ ని గ్రామ రక్షకుడుగా వచ్చిన మౌలా జాట్, వధించి వీడన నుంచి గ్రామస్థులకి విముక్తి కల్గించాడు. దీంతో యోధుడు మౌలా జాట్ లెజండ్ అయ్యాడు. ఈ సినిమాని పంజాబీ భాషలో తీశారు. దీనికి మతాలతో, రాజకీయాలతో సంబంధం లేదు.

నటుల కారణంగానే వేటు పడింది. ఈ సినిమా హక్కులు పొందిన జీ స్టూడియోస్ మంచి వసూళ్ళు సాధిస్తుందని అంచనాలు వేసుకుంది. అదికాస్తా తలకిందులైంది. మహారాష్ట్రలో రాజ్ థాక్రేకి చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) దేశంలో సినిమాని ఎక్కడ ప్రదర్శించినా అడ్డుకుంటామని ప్రకటన చేసింది.

ఈ రోజు ఫవాద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. 'ది లెజండ్ ఆఫ్ మౌలా జాట్‌' ని భారతదేశంలో విడుదల చేస్తే రెండు దేశాలకు మంచి సంకేతంగా వుండేదని అభిప్రాయపడ్డాడు. ఇది పరస్పరం కరచాలనాలు చేసుకునే సందర్భమని, ఒకరికొకరు స్వీట్లు పంపుకునే ఈద్- దీపావళి వంటి పండుగ సందర్భమని; సినిమాలు, సంగీతం అనేవి అవశ్యమైన సాంస్కృతిక మార్పిడి సాంప్రదాయమనీ స్పష్టం చేశాడు.

వాతావరణం వేడెక్కి వుందని, సినిమా విడుదల అవొచ్చు, కాకపోవచ్చనీ, వేచి చూద్దామనీ చెప్పాడు. సినిమాల్ని నటుల్ని చూసే టార్గెట్ చేస్తున్నారు తప్ప, సినిమాలకి కారణమైన దర్శకుల్ని, నిర్మాతల్ని చూసి కాదు. సినిమాల్ని డిఫెండ్ చేసుకుంటూ సదరు దర్శకులూ నిర్మాతలూ కూడా ముందుకు రావడం లేదు. సొసైటీలో, సోషల్ మీడియాలో మాత్రం నటులే ఎడాపెడా వాయింపులకి గురవుతూంటారు.

అయితే ఒక వైపు ఈ సినిమా మీద దుమారం రేగుతోంటే, ఇంకోవైపు షారూఖ్ ఖాన్ 'పఠాన్' కి విదేశాల్లో ఇప్పట్నుంచే బుకింగ్స్ ప్రారంభమై హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుబోతున్నాయి. జర్మనీ, కెనెడాల్లో ఫిబ్రవరకూ టికెట్లు దొరకని పరిస్థితి. 'మౌలా జాట్' ని అలా వుంచితే, జనవరి 26 న దేశంలో విడుదలయ్యే 'పఠాన్' కి గట్టి దెబ్బే కొట్టాలని బాయ్ కాట్ బృందాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఖర్మ అనుకుని నిర్మాత ఆదిత్యా చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పల్లెత్తు మాట అనకుండా, మౌనంగా తమ రిలీజ్ పనులు తాము చేసుకుంటున్నారు.



First Published:  2 Jan 2023 10:19 AM GMT
Next Story