Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌ని వదలని బాయ్ కాట్ ట్రెండ్..!

థ్యాంక్ గాడ్ సినిమా విడుదలకు ఇంకా 40 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ట్విట్టర్‌లో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాల‌ని ఓ హ్యాష్ ట్యాగ్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

బాలీవుడ్‌ని వదలని బాయ్ కాట్ ట్రెండ్..!
X

ప్రస్తుతం బాలీవుడ్‌ని బాయ్ కాట్ ట్రెండ్ పట్టి పీడిస్తోంది. అగ్రహీరోలపై నార్త్ ప్రేక్షకులు కత్తి గట్టారు. వారు నటిస్తున్న సినిమాల విడుదల సమయంలో సినిమా చూడకుండా బాయ్ కాట్ చేద్దామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు, అగ్ర హీరోలు నటించిన సినిమాలకు ఈ బాయ్ కాట్ ట్రెండ్ తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టింది. ట్విట్టర్ వేదికగా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంపై విమర్శలు చెలరేగాయి.

సొంతంగా ఒక స్థాయికి చేరుకున్న సుశాంత్‌ను బాలీవుడ్‌లో పాతుకుపోయిన కొన్ని సినీ కుటుంబాలు ప్రోత్సహించడం అటుంచి తొక్కేసే ప్రయత్నం చేశాయని ప్రేక్షకుల ప్రధాన ఆరోపణ. బాలీవుడ్‌లో తాను ఒంటరిననే ఫీలింగ్‌తోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి అగ్ర హీరోలు, కొన్ని కుటుంబాలకు చెందిన వారసుల సినిమాలు విడుదలైన సమయంలో నెటిజన్లు ఈ సినిమాలను బాయ్ కాట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా విడుదలైన సమయంలో ట్విట్టర్‌లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందే దీనిపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగింది. తమ సినిమాను బహిష్కరించవద్దని ఈ మూవీలో హీరోగా నటించిన అమీర్ ఖాన్ ప్రేక్షకులను ప్రాధేయపడినప్పటికీ ఈ ప్రచారం ఆగలేదు. లైగర్ విడుదల సమయంలో ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ బాయ్ కాట్ ట్రెండ్ పై విమర్శలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

తాజాగా రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కాగా ఈ మూవీని కూడా బాయ్ కాట్ చేయాలని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్లో థ్యాంక్ గాడ్ అనే ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ అక్టోబర్ 25వ తేదీన విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. థ్యాంక్ గాడ్ సినిమా విడుదలకు ఇంకా 40 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ట్విట్టర్‌లో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాల‌ని ఓ హ్యాష్ ట్యాగ్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారింది.

First Published:  16 Sep 2022 7:40 AM GMT
Next Story