Telugu Global
Cinema & Entertainment

థాంక్యూ మూవీ రివ్యూ

నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ మూవీ ఈరోజు రిలీజైంది. మరి మూవీ ఎలా ఉంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

Thank You Telugu Movie Review
X

చిత్రం: థాంక్యూ

తారాగణం: నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు

కథ-మాటలు: బి.వి.ఎస్. రవి

కెమెరా: పీసీ శ్రీరామ్

ఎడిటింగ్: నవీన్ నూలి

సంగీతం: తమన్

నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: విక్రమ్ కుమార్

రేటింగ్: 2.5/5

కొత్త కథ కాదనే విషయం ట్రయిలర్ చూసినప్పుడే అర్థమైపోయింది. క్లయిమాక్స్ ఎలా ఉంటుందనే విషయం సినిమా స్టార్ట్ అయిన అర్థగంటకే అర్థమైపోయింది. మరి ఇలాంటి సినిమాను ఆసాంతం ఆస్వాదించేలా నిలబెట్టాలంటే ఏం చేయాలి? మంచి సీన్లు పడాలి.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి.. మళ్లీ మళ్లీ పాడుకునేలాంటి పాటలుండాలి.. విజువల్ ట్రీట్ అందించాలి.. ఓవరాల్ గా మెస్మరైజ్ చేసి పంపించాలి. ఈ ఎలిమెంట్స్ లో కొన్నింటిలో మాత్రమే పాసయింది థాంక్యూ సినిమా.

నాగచైతన్య హీరోగా నటించిన ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో పాటలు క్లిక్ అవ్వలేదు. రిలీజ్ కు ముందు బజ్ రాలేదు. ఫస్టాఫ్ లో మంచి సీన్లు పడలేదు. ఫలితంగా సినిమా రిజల్ట్ యావరేజ్ అనిపించుకుంది. అంతమాత్రాన ఈ ప్రాడెక్టును తీసి పడేయలేం. ఎందుకంటే, ఇందులో నాగచైతన్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంది. పీసీ శ్రీరామ్ విజువల్ ట్రీట్ ఉంది. తమన్ అందించిన మంచి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఉంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం.

అభిరామ్ (నాగచైతన్య) చిన్నప్పట్నుంచి చాలా చురుకైన వ్యక్తి. టీనేజ్ లో ప్రేమలో పడతాడు. కాలేజ్ డేస్ లో గొడవలు పడతాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో స్ట్రగుల్ అనుభిస్తాడు. మొత్తానికి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. అయితే ఇదంతా తన ఒక్కడివల్ల మాత్రమే సాధ్యమైందనే ఇగోతో ఉంటాడు. ఈ క్రమంలో ప్రేమించిన ప్రియ (రాశిఖన్నా) దూరమైపోతుంది. అప్పటివరకు పరుగులుపెట్టిన అభిరామ్ జీవితానికి సడెన్ బ్రేక్ పడుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటాడు. ఆత్మావలోకనం చేసుకుంటాడు. తన ఉన్నతికి సహకరించిన వ్యక్తుల్ని గుర్తుచేసుకుంటాడు. వాళ్లను మరోసారి కలిసి థాంక్స్ చెప్పాలనుకుంటాడు. ఫైనల్ గా అందరికీ థాంక్స్ చెబుతాడు. ఇదే కథ.

కథ ప్రారంభం అవ్వడమే విదేశాల్లో మొదలవుతుంది. ఉద్యోగం కోసం అమెరికా వచ్చిన నాగచైతన్య, రాశిఖన్నా సహకారంతో పెద్ద కంపెనీ సాధించి సక్సెస్ అవుతాడు. ఆ క్రమంలో అందర్నీ వదిలేస్తాడు. ఇగోతో వ్యవహరిస్తుంటాడు. తనను అమెరికాకు తీసుకొచ్చిన రావు (ప్రకాష్ రాజ్)ను పట్టించుకోడు. తనతో సహజీవనం చేస్తున్న ప్రియ (రాశిఖన్నా)ను పట్టించుకోడు. దీంతో రాశిఖన్నా, అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. ఇక్కడ ఆత్మావలోకనం ప్రారంభించిన నాగచైతన్య, ముందుగా తన టీనేజ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ మాళవికతో ప్రేమ, అది ఎలా-ఎందుకు బ్రేకప్ అయిందనే విషయాన్ని చెబుతాడు. అక్కడే మాళవికను మళ్లీ కలిసి థాంక్స్ చెబుతాడు. ఇక కీలకమైన వైజాగ్ ఎపిసోడ్ లోకి వెళ్లేముందు మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాను ముగిస్తాడు.

ఇంటర్వెల్ తర్వాత నాగచైతన్య యంగేజ్ లుక్, కాలేజ్ డేస్, కాలేజ్ లో గొడవలు, హాకీ.. ఇలా అన్నింటినీ బ్యాక్ టు బ్యాక్ చూపిస్తాడు. ఆ వెంటనే ఈజీగా క్లయిమాక్స్ లోకి వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఇలా 2 గంటల 9 నిమిషాల్లోనే సినిమాను ముగించి బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను ఇంటికి పంపిస్తాడు దర్శకుడు విక్రమ్ కుమార్.

సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే.. ఇప్పటి తరానికి, కరోనా తర్వాత మారిన పరిస్థితులకు, ప్రస్తుతం ఉన్న థియేట్రికల్ వ్యవస్థకు ఈ కథ నడవదు. సాధారణ రోజుల్లో వచ్చి ఉంటే ఈ సినిమా పెద్ద హిట్టయ్యేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కాబట్టి ఈ కంటెంట్ ను ఆడియన్స్ పెద్దగా రిసీవ్ చేసుకోకపోవచ్చు. అలా అని ఇది బ్యాడ్ కంటెంట్ మాత్రం కాదు. ఈ కాలం ఈ కథలు నడవవు. అదంతే.

ఉన్నంతలో ఈ సినిమాలో మేజర్ హైలెట్ ఏదైనా ఉందంటే అది నాగచైతన్య మాత్రమే. 3 డిఫరెంట్ షేడ్స్ లో నాగచైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడి యాక్టింగ్ లో ఎంతో పరిణతి కనిపించింది. అది విక్రమ్ కుమార్ మహత్యమో లేక నాగచైతన్య హోమ్ వర్కో తెలియదు కానీ, నటుడిగా చైతూ ఓ మెట్టు పైకెక్కాడు. నాగచైతన్య తర్వాత మాళవిక నాయర్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. సంపత్ రాజ్, తులసి పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. నిజానికి వాళ్ల పాత్రలకు అంత ప్రాధాన్యం కూడా లేదు. నాగచైతన్య చెల్లెలిగా అవికా గోర్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా చిత్రీకరించాడు పీసీ. విదేశాల్లో తీసిన సన్నివేశాలైతే పెయింటింగ్ ను తలపిస్తాయి. చివరికి యాక్షన్ సీన్స్ లో కూడా కెమెరా యాంగిల్స్ పైకి మనసు వెళ్లిపోతుంది. అంత బాగుంది పీసీ సినిమాటోగ్రఫీ. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. తమన్ పాటలతో అలరించలేకపోయాడు. కనీసం 2 పాటలైనా ట్రెండ్ అయ్యేవి ఇస్తే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

దర్శకుడిగా విక్రమ్ కుమార్ చేయాల్సిన సినిమా కాదిది. అతడి మార్క్ స్క్రీన్ ప్లే ఇందులో కనిపించదు. బీవీఎస్ రవి అందించిన ఈ కథను, మరో సెన్సిబుల్ డైరక్టర్ తో చేస్తే బాగుండేది. పైగా బీవీఎస్ రవి డైలాగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. అయితే విక్రమ్ కుమార్ మాత్రం తన శక్తి మేరకు ఈ కథకు న్యాయం చేశాడు. కానీ అతడి సినిమాల్లో కనిపించే ఆత్మ ఇందులో కనిపించలేదు.

ఓవరాల్ గా థాంక్యూ సినిమాను ఓసారి చూడొచ్చు. ఓ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇది. మాస్ ఎలిమెంట్స్, కామెడీ లాంటివి లేకుండా బోర్ కొట్టకుండా క్లీన్ గా ఉంది. అయితే ఈ కాలం ఈ కంటెంట్ ను జనం ఏ స్థాయిలో ఆదరిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది.

First Published:  22 July 2022 10:21 AM GMT
Next Story