Telugu Global
Cinema & Entertainment

నవంబర్ హిట్స్ నేర్పుతున్న పాఠాలు

నవంబర్ లో స్మాల్, మీడియం రేంజి సినిమాలకి పూర్తి ఓపెన్ మార్కెట్ లభించింది.

నవంబర్ హిట్స్ నేర్పుతున్న పాఠాలు
X

నవంబర్ లో స్మాల్, మీడియం రేంజి సినిమాలకి పూర్తి ఓపెన్ మార్కెట్ లభించింది. నవంబర్ లో ఒకే ఒక్క పెద్ద సినిమా విడుదల కావడంతో ఈ అరుదైన అవకాశం లభించింది స్మాల్, మీడియం రేంజి మూవీస్ కి. ఆ పెద్ద సినిమా నవంబర్ చివరి వారంలో విడుదలైన ‘ఆది కేశవ’. విడుదలైన 20 స్మాల్, మీడియం రేంజి సినిమాల్లో 16 స్మాల్ కాగా, 4 మీడియం. కొత్త వాళ్ళతో 16 స్మాల్ సినిమాలన్నీ సహజంగానే ఫ్లాపయ్యాయి. ఇవి ఫ్లాప్ అని స్క్రిప్టుకి శ్రీకారం చుట్టినప్పుడే తెలిసిపోతుంది.

ప్రతీనెలా ఇవి చాలా కమిట్ మెంటుతో ఫ్లాపవ్వాలని ప్రయత్నిస్తూంటాయి. 4 మీడియం రేంజిలో ఒకటి హిట్టవుతూ అవుతూ ఆగిపోయింది. మిగిలిన 3 హిట్టయ్యాయి. ఇక ఒకే ఒక్క పెద్ద సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అది విష్ణు తేజ్ తో సితారా ఎంటర్ టైంమెంట్స్ నిర్మించిన ‘ఆది కేశవ’. ఇది దారితప్పి 2023 లో వచ్చింది. అలాగే ఫ్లాపయిన మీడియం మూవీ ‘మంగళవారం’. హిట్టయిన మీడియం సినిమాలు ‘కీడా కోలా’, ‘మా ఊరి పొలిమేర 2’, ‘కోట బొమ్మాళి పి ఎస్’- నవంబర్ లో హిట్టయినవి ఈ మూడు మీడియం రేంజి సినిమాలే. ఎందుకు హిట్టయ్యాయి?

కీడా కోలా’ తొలి తెలంగాణా గ్యాంగ్ స్టర్ సినిమా. కొంత కాలం క్రితం భారీ స్థాయిలో తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమా తెలపెట్టాడు ఓ తెలంగాణ సినిమా తీసిన తెలంగాణ దర్శకు డు. అది ముందుకెళ్ళలేదు. దాని స్థానంలో తొలి తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమాగా ‘కీడాకోలా’ విడుదలైంది. తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించాడు. గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వస్తూంటాయి. విచిత్ర పాత్రలతో గ్యాంగ్ సినిమాగా రావడం దీని ప్రత్యేకత. విచిత్ర పాత్రలు, వింత కథనాలు. దీనికి కామెడీ జోడిస్తే ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ అయిపోయింది. ఇలా వొక ఔటాఫ్ బాక్స్ సినిమాని ఆదరించారు ప్రేక్షకులు.

‘మా ఊరి పొలిమేర 2’ చేతబడి కథతో సినిమా. ‘మా ఊరి పొలిమేర 1’ ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. దీనికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ‘మసూద’, ‘విరూపాక్ష’ చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు దీన్నీ హిట్ చేశారు. రూరల్ థ్రిల్లర్స్ విషయానికొస్తే, చేతబడి సినిమాలు, గ్రామదేవతల సినిమాలు హిట్టవుతున్నాయి. దెయ్యాలతో హార్రర్ సినిమాలు పాతబడిపోయిన చోట ఇలాటివి సక్సెస్ అవుతున్నాయి. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడూ వర్కౌటయ్యే ఫార్ములా. కాకపోతే జానర్ మార్చాలి. ఇదే జరిగింది ‘మా ఊరి పొలిమేర’ రెండు భాగాలతో.

‘కోట బొమ్మాళి పిఎస్’ పోలీసు థ్రిల్లర్. పోలీసుల్ని పోలీసులు పట్టుకోవడమే కథ కావడంతో ఇదో కొత్తదనం. శ్రీకాంత్ నటించిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు తేజ మార్ని. ఈ మలయాళ రీమేక్ లో ఇంకా ఎన్నికల రాజకీయాల, కుల సంఘర్షణల కోణాలు జతపడడంతో సామాజికంగా ప్రేక్షకులకి దగ్గరగా వెళ్లింది. మూస ఫార్ములాకి భిన్నంగా ఇది రియలిస్టిక్ జానర్ కావడంతో మార్పుని కోరుకుంటున్న ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. ఇది కూడా ఔటాఫ్ బాక్స్ సినిమానే.

అంటే ఒకప్పుడు అసాధారణ కథలతో ఔటాఫ్ బాక్స్ సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలకి ఈ సినిమాల రిజల్టుతో ప్రేక్షకుల గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. ‘కీడా కోలా’, ‘కోటబొమ్మాళి పిఎస్ ‘ రెండూ ఔటాఫ్ బాక్స్ సినిమాలే. ఇలా ఈ రెండు ఔటాఫ్ బాక్సులు, ఒకటి దెయ్యాలకి బదులు చేతబడి ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించి హిట్టయ్యాయి.

ఇక ‘మంగళవారం’. ఇది కూడా ఔటాఫ్ బాక్సే. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే ఓవర్ బడ్జెట్ ని అందుకోలేక ఆగిపోయింది. 7-8 కోట్లలో తీయాలిన సినిమా 12 కోట్లకి పెంచారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు. ‘కాంతారా’ హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీశారు. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా వచ్చాయి. అయితే ప్రేక్షకులు మోయలేనంత ఓవర్ బడ్జెట్టయి పోయింది. ఔటాఫ్ బాక్సుకి ఇంత బడ్జెట్ అవసరం లేదని ఇది చెప్తుంది.

‘ఆదికేశవ’ టైటిల్ తో సహా 1990 లలో రావాల్సిన సినిమా. దర్శకుడితో సహా దారితప్పి 2023 లో వచ్చింది. వస్తే వచ్చింది, దీన్ని ఫన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా తీసినా బావుండేది. దర్శకుడు ఎన్. శ్రీకాంత్ రెడ్డి అంత శ్రమ తీసుకోదల్చుకోలేదు. కొత్త స్టార్ వైష్ణవ్ తేజ్, డాన్సింగ్ స్టార్ శ్రీలీలలు వుండగా పాత సీమ ఫ్యాక్షన్ కథకే కొత్త శోభ వచ్చేస్తుందనుకుని చుట్టి పారేశాడు. ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకుని ఇలాటి పాత మూస సినిమాలు తీస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఈ సినిమా తీర్పు చెప్పింది. ఈ పెద్ద సినిమా టీజర్ చూసే ప్రేక్షకులు పసిగట్టేసి కామెంట్లు పెట్టారు. ఈ భారీ ఫ్లాపు అగ్ర నిర్మాతల రాంగ్ ప్రొడక్షన్.

First Published:  28 Nov 2023 8:00 AM GMT
Next Story