Telugu Global
Cinema & Entertainment

హిందీ మార్కెట్ లో తెలుగు సినిమాలదే హవా!

పబ్లిసిటీలోనూ హిందీ మార్కెట్ ని ఆక్రమించడంలోనూ తెలుగు సినిమాలు ముందుంటున్న ప్రత్యేక పరిస్థితిని దేశవ్యాప్తంగా పరిశీలకులు గమనిస్తున్నారు. తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఇందుకు మరో ఉదాహరణ.

హిందీ మార్కెట్ లో తెలుగు సినిమాలదే హవా!
X

పబ్లిసిటీలోనూ హిందీ మార్కెట్ ని ఆక్రమించడంలోనూ తెలుగు సినిమాలు ముందుంటున్న ప్రత్యేక పరిస్థితిని దేశవ్యాప్తంగా పరిశీలకులు గమనిస్తున్నారు. తాజాగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఇందుకు మరో ఉదాహరణ. దీనికి సల్మాన్ ఖాన్ తో కలిసి చిరంజీవి నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలు హిందీ మార్కెట్ లో ఇవాళ పెద్ద సక్సెస్ కి కారణమైంది. తెలుగు సినిమాలకి సోషల్ మీడియా సమర్థవంతమైన మార్కెటింగ్ సాధనాల్లో ఒకటిగా మారింది.సోషల్ మీడియా వేదికల్లో తెలుగు సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీల నుంచి, ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ వైరల్ సాంగ్స్ కి ఫిదా అయిపోతున్నారు.

లిప్ సింక్ అయినా కాకపోయినా, హుక్ స్టెప్స్ అయినా కాకపోయినా 'ఊ అంటావా', 'సామి సామీ', 'నాటు నాటు', 'బుట్టా బొమ్మ', 'ఇంకేం ఇంకేం' మొదలైన సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారడమే ఇందుకు తార్కాణం.పాటలే కాదు, లుక్స్, డైలాగులు కూడా మార్కెటింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడు

తున్నాయి. 'పుష్ప: ది రైజ్' డైలాగ్స్ తో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. "పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? పుష్పా అంటే ఫైర్!' అన్న అర్జున్ డైలాగు ఓవర్ నైట్ సంచలనమైంది.

తమిళ సినిమాలతో ఇలాంటి మార్కెటింగ్ వ్యూహాలు అంతగా వుండడం లేదు. విజయ్ నటించిన 'బీస్ట్', దాని మొదటి సింగిల్ 'అరబిక్ కుత్తు' ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించినందున, ఈ మేరకు తమిళ సినిమాలకిది గేమ్ ఛేంజర్ కావచ్చు. తమిళ సినిమాలతో పోలిస్తే చాలా తెలుగు సినిమాల ప్రమోషన్లు చాలా విస్తృతంగా

వుంటున్నాయని, తెలుగు స్టార్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తమ అభిమానులకు చేరువవుతున్నారని, అంతేగాక దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రమోటింగ్ కార్యక్రమాలు చేసి అక్కడి ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంటున్నారని వ్యాఖ్యానించుకుంటున్నారు. గతవారం 'ఆదిపురుష్' టీజర్ ని ప్రభాస్ సహా సెలబ్రిటీలు అయోధ్య వెళ్ళి అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తమిళ స్టార్లు తమిళనాడులో, హైదరాబాదులో మాత్రమే ప్రమోషన్లు చేస్తున్నారు.

ఇలావుంటే హిందీ రీమేకుల విషయంలో తమిళ సినిమాలు ముందుంటున్నాయి. ఇటీవలి కాలంలో తమిళ సినిమాలు మాత్రమే కంటెంట్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 'విక్రమ్ వేద', 'సూరరై పొట్రు', 'జై భీమ్', 'మానాడు' మొదలైనవి హిందీలో రీమీక్ కి అర్హత సంపాదించుకున్నాయి.

ఈ సినిమాలు తమిళంలో మాత్రమే విడుదలైనప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ప్రజాదరణ దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. అనేక తమిళ, మలయాళ సినిమాలు వాటి తాజా కాన్సెప్ట్ లు, కథలు కారణంగా ఇప్పుడు హిందీలో రీమేక్ కి వెళ్తున్నాయి. తెలుగు సినిమాలతో ఈ రీమేక్ సాంప్రదాయం లేదు. 'పుష్ప' ని చూస్తే, అది హిందీ వెర్షన్ గా విడుదలైంది. మంచి హిట్టయ్యింది. అయితే క‌థ‌ని చూస్తే కొత్తగా ఏమీ వుండదు. ఓ గ్యాంగ్‌స్టర్ కథ మాత్రమే.

అదే తమిళం లేదా మలయాళం సినిమాలు చూస్తే, వాటిలో భిన్నమైన కొత్త కథలుంటాయి. అందుకే ఇవి హిందీ రీమేక్‌లకి వెళ్తున్నాయి. తెలుగు, తమిళం,

మలయాళం సినిమాలని పోల్చినప్పుడు, మలయాళ సినిమాలు ఇంటలిజెంట్ గా వుంటాయి, తెలుగు సినిమాలు మాస్‌ గా వుంటాయి. తమిళ సినిమాలు ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తాయి.

అయితే తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేస్తే ఆడడం లేదు. విజయ్ నటించిన 'మాస్టర్', హిందీలో డబ్ చేసి విడుదల చేస్తే ఫ్లాప్ అయింది. హిందీ డబ్బింగ్ గా గతేడాది విడుదలైన విశాల్ నటించిన 'చక్ర' కూడా విజయం సాధించలేదు.

కానీ తమిళ సినిమాలు రీమేక్ చేసినప్పుడు నార్త్ సర్క్యూట్స్‌లో బాగా రన్ అవడం విశేషం. ఇందుకు విరుద్ధంగా తెలుగు సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేస్తే బాగా ఆడుతున్నాయి. సుమారు పదేళ్లుగా ప్రముఖ హిందీ చానెళ్లలో మధ్యాహ్నం పూట స్లాట్ లలో తెలుగు డబ్బింగులే మంచి టీయార్పీ నిస్తున్నాయి. ఎన్టీఆర్, రవితేజ, బ్రహ్మానందం, గోపీచంద్, నితిన్ మొదలైన నటులు హిందీ ప్రేక్షకులకి ఈ డబ్బింగులతోనే పరిచయమయ్యారు, దగ్గరయ్యారు.

ఇలా ఇతర సౌత్ భాషల కంటే హిందీలో తెలుగు డబ్బింగ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. ఇక తెలుగు పానిండియా సినిమాల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి బాలీవుడ్ మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. తెలుగు సినిమాలు డబ్బింగులతో, పానిండియా లతో హిందీలో బలమైన మార్కెట్ ని సాధించుకుంటే, తమిళ సినిమాలు మాత్రం హిందీ రీమేకుల దగ్గరే ఆగుతున్నాయి.

First Published:  10 Oct 2022 9:57 AM GMT
Next Story