Telugu Global
Cinema & Entertainment

ఈరోజు ఏడు సినిమాల సందడి!

పెద్ద సినిమాలు విడుదల కాని వారం చూసుకుని, చిన్న హీరోల సినిమాలతో బాటు కొత్త వాళ్ళ సినిమాలు గుంపుగా విడుదలవడం మామూలైపోయింది ఈ మధ్య. ఈ శుక్రవారం ఏడు సినిమాలతో బాటు, శనివారం ఇంకొకటి విడుదలవుతున్నాయి.

ఈరోజు ఏడు సినిమాల సందడి!
X

పెద్ద సినిమాలు విడుదల కాని వారం చూసుకుని, చిన్న హీరోల సినిమాలతో బాటు కొత్త వాళ్ళ సినిమాలు గుంపుగా విడుదలవడం మామూలైపోయింది ఈ మధ్య. ఈ శుక్రవారం ఏడు సినిమాలతో బాటు, శనివారం ఇంకొకటి విడుదలవుతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ సినిమాలు, డబ్బింగులు, రీమేకులూ వున్నాయి. పేరున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమా కూడా వుంది. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమా కూడా వుంది. సుధీర్ వర్మ సినిమా కూడా వుంది. అలాగే ప్రముఖ హీరోలు సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం సినిమాలూ వున్నాయి. అలాగే కన్నడ కిచ్చ సుదీప్, తమిళ శింబు సినిమాలూ రెండున్నాయి. మొత్తం 8 సినిమాల్లో 5 కొత్త దర్శకులవే.

వీటిలో సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం నటించిన రెండు సినిమాల మీదే అందరి దృష్టీ వుంది. తర్వాత కిచ్చ సుదీప్, శింబు సినిమాలు. మిగిలిన కొత్త వాళ్ళ సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడడం కష్టమే. ప్రతీవారం వచ్చి పోతున్న కొత్త వాళ్ళ చిన్నా చితకా సినిమాలు ఎలా వుంటున్నాయో తెలిసిందే. ఇవి బి, సి సెంటర్లలో విడుదలకి నోచుకోవడం లేదు ప్రేక్షకులు పట్టించుకోక. నగరాల్లో మల్టీప్లెక్సుల్లో ఒక షో చొప్పున వేసినా రెండో రోజు వుంటాయో లేదో తెలీదు. అటు తిరిగి ఇటు తిరిగి కొన్ని అతి కష్టంగా ఓటీటీల్లో తేలతాయి. ఈ వారం ఈ సినిమాల వివరాలేమిటో కింద చూద్దాం...

1.'నేను మీకు బాగా కావలసిన వాడిని' : కిరణ్ అబ్బవరం నటించిన 5వ సినిమా. 2019 లో ప్రవేశించి, ఈ మూడేళ్ళలో 5 సినిమాలు నటించాడు. తనకి ఇంకా ఫ్యాన్స్ ఎవరూ ఏర్పడకపోయినా, నటించిన 5 లో 3 ఫ్లాప్ అయినా, నిర్మాతలు క్యూలో వుంటున్నారు. ఇంకో మూడు సినిమాలు షూటింగులు జరుపుకుంటున్నాయి. ప్రస్తుత సినిమా కుటుంబ కథా చిత్రం. ఇందులో తనకి రెండు షేడ్స్ వుంటాయని అంటున్నాడు కిరణ్ అబ్బవరం. దీనికి శ్రీధర్ గాదె దర్శకుడు. ప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత. ఇందులో సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనన్, బాబా భాస్కర్, సోను ఠాగూర్ ఇతర తారాగణం. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి కూడా ఒక పాత్రలో కన్పిస్తారు. ఇది 16న విడుదలవుతోంది.

2. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' : సుధీర్ బాబు హీరోగా నటించిన రోమాంటిక్ కామెడీ. సుధీర్ బాబు గత మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్' ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుత సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి మంచి దర్శకుడు దొరికాడు. ఈ దర్శకుడితో ఇది రెండో సినిమా సుధీర్ కి. ఈ రోమాంటిక్ కామెడీలో హీరోయిన్ గా 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి నటించింది. ఇతర తారాగణం అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించారు. ఇది 16 న విడుదలవుతోంది.

3. 'శాకినీ ఢాకినీ' : నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా కలిసి నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ఇది. కొరియన్ మూవీ 'మిడ్‌నైట్‌ రన్నర్స్‌'కి రీమేక్‌. దీనికి సుధీర్‌ వర్మ దర్శకత్వం. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథ ఇది. దీనికి నిర్మాతలు డి. సురేష్ బాబు, సునీత తాటి. ఇది కూడా 16న విడుదలవుతోంది.

4. 'కె 3 - కోటికొక్కడు' " కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన డబ్బింగ్ మూవీ ఇది. మాస్ యాక్షన్ ఎంటర్టయినర్‌. శివ కార్తీక్ దర్శకత్వంలో ఇది కన్నడలో నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ కి జంటగా నటించింది. ఇంకా శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు నటించారు. 16 న విడుదల.

5. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' : తమిళంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, శింబు హీరోగా దర్శకత్వం వహించిన సినిమా 'వెందు తనిందదు కాడు' తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' గా వస్తోంది. ఇది మాఫియా కథ. ఒక చిన్న పల్లెలో జీవించే ముత్తు, కొన్ని కారణాల వల్ల ముంబై వెళతాడు. అక్కడ మాఫియా చీకటి ప్రపంచంలో ఇరుక్కుంటాడు. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. దీన్ని ప్రముఖ నిర్మాత స్రవంతి కిషోర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇది 17 న విడుదలవుతోంది.

6. 'అంఅః - ఏ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్' : కొత్త వాళ్ళు నటించిన హత్య చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. శ్యామ్ మండల దర్శకుడు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లు. సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, ఉన్నికృష్ణన్ ఇతర తారాగణం. జోరిగే శ్రీనివాస రావు నిర్మాత. 16 న విడుదలవుతోంది.

7. 'సకల గుణాభి రామ' : బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ హీరోగా వస్తున్న ఫ్యామిలీ డ్రామా. శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం. ఆసిమా కథానాయిక. శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ, చమ్మక్ చంద్ర ఇతర తారాగణం. నిర్మాత సంజీవ్. 16 న విడుదలవుతోంది.

8. 'నేను కేరాఫ్ నువ్వు' : 1980 లో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేమ కథ. తుమ్మల సాగారెడ్డి దర్శకుడు. రత్న కిశోర్, సాన్యా సిన్హా కొత్త హీరోహీరోయిన్లు. ధనరాజ్, సత్య, తుమ్మల సాగారెడ్డి, మహేబూబ్ బాషా ఇతర తారాగణం. అతావుల్లా, శేషిరెడ్డి, పోలీస్ వెంకట రెడ్డి, శరద్ మిశ్రా నిర్మాతలు.

ఈ ఎనిమిది సినిమాలూ గతవారం విడుదలై హిట్టయిన 'ఒకేఒక జీవితం, 'బ్రహ్మా స్త్రం' ల ముందుకొస్తున్నాయి. వీటిలో కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబుల సినిమాలు ఎలా తట్టుకుని నిలబడతాయో రేపు తెలిసిపోతుంది.

First Published:  16 Sep 2022 4:30 AM GMT
Next Story