Telugu Global
Cinema & Entertainment

ఈ టిక్కెట్ ధరలతో థియేటర్లు నడపలేం!

ఆరేళ్ళ తర్వాత తమిళనాడులో మళ్ళీ సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల అంశం తెరపై కొచ్చింది. ఈ మేరకు తమిళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న విజ్ఞప్తి చేసింది.

ఈ టిక్కెట్ ధరలతో థియేటర్లు నడపలేం!
X

ఈ టిక్కెట్ ధరలతో థియేటర్లు నడపలేం!

ఆరేళ్ళ తర్వాత తమిళనాడులో మళ్ళీ సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల అంశం తెరపై కొచ్చింది. ఈ మేరకు తమిళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న విజ్ఞప్తి చేసింది. అయితే 2017 తర్వాత టిక్కెట్ ధరల్ని మరోసారి పెంచడం మంచిదని, సినిమా పరిశ్రమ ఆర్థికంగా ఆరోగ్యంగా వుండేందుకు తోడ్పడుతుందనీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే, థియేటర్లలో సినిమా చూడడం ప్రేక్షకులకి ఖరీదైన వ్యవహారమవుతుందని భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

టిక్కెట్లపై తక్కువ ధరలు ఎగ్జిబిటర్లని దెబ్బతీస్తున్నందున టిక్కెట్ ధరల్ని పెంచాలని తమిళనాడు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాసిన లేఖని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ లేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. నిర్మాతలు సినిమా బడ్జెట్ ని బట్టి ధర నిర్ణయించి సినిమాల్ని విక్రయిస్తారు. ఎగ్జిబిటర్లు తమ లొకేషన్, డిమాండ్ తోబాటు, స్టార్ కాస్టింగ్, దర్శకుల పేరు వంటి అంశాల ఆధారంగా వేర్వేరు మొత్తాలకి ప్రదర్శన హక్కులు పొందుతారు. నిర్మాత ధర కంటే ఎగ్జిబిటర్లు ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఎగ్జిబిటర్లు థియేటర్లతో ఒప్పందాలు చేసుకుంటారు. సదరు అగ్రిమెంట్ నిబంధనల ఆధారంగా లాభాల్ని పంచుకుంటారు. తమిళనాడులో టిక్కెట్ ధరలు చాలా తక్కువగా వుండడంతో ఎగ్జిబిటర్లకి నష్టాలే సంక్రమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు కోరుతున్న టిక్కెట్ ధరలు ఈ విధంగా వున్నాయి : మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరలు: ఏసీ - 250 రూపాయలు, నాన్ ఏసీ - 150 రూపాయలు. మున్సిపాల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలు మొదలైన సెంటర్లలో ఏసీ- 200 రూపాయలు, నాన్- ఏసీ 120 రూపాయలు. ఇక లగ్జరీ థియేర్లలో రిక్లైనర్ సీట్ల ధర 350 రూపాయలు, EPIQ స్క్రీన్‌ల ధర 400 రూపాయలు, IMAX స్క్రీన్‌ల ధర 450 రూపాయలు.

ఈ ప్రతిపాదనకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసోసియేషన్ సెక్రటరీ ఆర్ పనీర్ సెల్వం సంతకంతో ఈ పత్రం వుంది. అయితే టిక్కెట్ ధరలు పెంచడం థియేటర్లకి వెళ్ళే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. గత దశాబ్ద కాలంగా థియేటర్లలో జనాలు తగ్గుముఖం పట్టారనీ, అందువల్ల టిక్కెట్ ధరల్ని పెంచడం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడ గమనార్హమేమిటంటే, గత దశాబ్ద కాలంగా థియేటర్లలో జనాలు తగ్గుముఖం పట్టినా వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే ట్రెండ్ ఈ కాలంలోనే ప్రారంభమయింది. టిక్కెట్ల ధరలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాల్ని పోటీలు పడి నిర్మిస్తున్నారు.

గతంలో రెండు సార్లు...

నివేదికల ప్రకారం, గతంలో 2007 లో ఒకసారి, 2017 లో ఇంకోసారీ టిక్కెట్ల ధరలు పెంచింది తమిళనాడు ప్రభుత్వం. 2017లో 25 శాతం పెంచింది. హోమ్ (సినిమా) శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మూడు కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఎయిర్ కండిషనింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, రెస్టారెంట్ సౌకర్యాలు వంటి ఇతర సదుపాయాలు కలిగిన మల్టీప్లెక్సుల్లో, టిక్కెట్ ధరల బేస్ ఛార్జీని 150 రూపాయలకి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు స్క్రీన్‌ల కంటే తక్కువ వున్న మల్టీప్లెక్సుల్లో 108 నుంచి 118 రూపాయల మధ్య నిర్ణయించింది. ఈ బేస్ రేట్లకి 28 శాతం జీఎస్టీని కలపాలి.

అయితే జీఎస్టీ తోబాటు 10 శాతం స్థానిక సంస్థల వినోదపు పన్నుని కూడా విధించడంతో అప్పట్లో కొత్త తమిళ సినిమాల్ని విడుదల చేయకూడదని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించిన కొద్ది రోజులకే టిక్కెట్ రేట్లని సవరించింది ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులతో బాటు, తమిళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని అనుసరించి టిక్కెట్ ఛార్జీల సవరణ నిర్ణయం అప్పట్లో జరిగింది.

వీడియో పైరసీ, థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, సినిమా నిర్మాణానికి ఖర్చులు పెరగడంతో బాటు, వినోదపు పన్ను పెంపుదల నష్టాలకి కారణంగా సినీ పరిశ్రమకి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 28 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దృష్ట్యా, ప్రస్తుతం వున్న అడ్మిషన్‌ రేట్లతో సినిమాలు తీయడానికి, సినిమా థియేటర్లని నిర్వహించదానికీ సాధ్యం కాదని, దీన్ని దృష్టిలో వుంచుకుని చాలా థియేటర్లని మూసివేస్తున్నామనీ 2017 లో అసోసియేషన్లు పేర్కొన్నాయి. ప్రభుత్వం దిగి వచ్చి సవరణలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ వైపు చూసి...

ఆరేళ్ళ తర్వాత తిరిగి ఇప్పుడు టిక్కెట్ ధరల పెంపు సమస్య ముందుకొచ్చింది.

అయితే ఈ డిమాండ్ 2022 నుంచే వుంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో సినిమా టిక్కెట్ ధరల్ని నియంత్రించాలని తమిళనాడులో డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో సినిమాల టిక్కెట్ల విక్రయాలని ప్రభుత్వ వెబ్‌సైట్లకే పరిమితం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఆన్‌లైన్ బుకింగ్‌ కి టిక్కెట్ ధరలో 2 శాతం మాత్రమే లావాదేవీ రుసుముగా వసూలు చేయడం జరుగుతుందనీ; ఇది ప్రేక్షకులకీ, ప్రభుత్వానికీ ప్రయోజనం చేకూరుస్తుందనీ, అందుకని ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

తమిళనాడులో ఇదే విధమైన నియంత్రణ డిమాండ్ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లాగా థియేటర్ టిక్కెట్ల విక్రయాలు, బుకింగ్‌లని నియంత్రించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఇదేకాదు, తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరహాలో సినిమా టిక్కెట్ ధరల్ని నియంత్రించే విధానాన్ని కూడా అమలు చేయాలని సూచించారు. తమిళనాడులోని థియేటర్లని పూర్తిగా కంప్యూటరీకరిస్తే ప్రభుత్వానికి పన్ను రాబడి కూడా పెరుగుతుందని ఆగ్రా నిర్మాత ధనంజయన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రణాళిక అమలు కావాలంటే రాష్ట్రంలోని అన్ని థియేటర్లని కంప్యూటరైజ్ చేయాలని అన్నారాయన. 2022 నాటి ఈ డిమాండ్ కి కొనసాగింపు నేటి తాజా విజ్ఞప్తి.

First Published:  6 July 2023 11:50 AM GMT
Next Story