Telugu Global
Cinema & Entertainment

Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ప్రేమే మార్చింది : రజినీకాంత్

Superstar Rajinikanth: ఈ మూడు మంచి అలవాట్లు కాదని, వీటికి బానిసలైన వాళ్ళు కొంతకాలం తర్వాత ఆరోగ్యకర జీవితం గడపలేరన్నది తన అభిప్రాయమన్నారు. త‌న‌ భార్య లత తనను ప్రేమతో ఎంతో మార్చిందన్నారు.

Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ప్రేమే మార్చింది : రజినీకాంత్
X

రజినీకాంత్ అంటే గుర్తుకు వచ్చేది ఆయనకున్న అసంఖ్యాకమైన అభిమానులే కాదు. వ్యక్తిత్వం కూడా. సినిమాల షూటింగ్ ఉంటే చెన్నైలో ఉండే ఆయన, ఏమాత్రం అవకాశం దొరికినా హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక జీవనం గడుపుతుంటారు. కోట్లు సంపాదించినా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాను సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం సేవకే వినియోగిస్తుంటారు. అందుకే రజినీకాంత్ ని చూసి స్ఫూర్తి పొందేవారు లక్షల్లో ఉన్నారు.

అయితే ఒకప్పుడు మద్యానికి బానిసైన తనను తన భార్య మార్చిందని రజినీకాంత్ చెప్పారు. తమిళనాడులో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను బస్ కండక్టర్ గా పనిచేసే సమయంలో మద్యం తాగే అలవాటు ఉండేదని, ఇక సిగరెట్లు రోజుకు ఎన్ని కాల్చుతానో లెక్కే లేదన్నారు. తన ఆహారంలో రోజూ మాంసాహారం ఉండాల్సిందేనన్నారు.

అయితే, ఈ మూడు మంచి అలవాట్లు కాదని, వీటికి బానిసలైన వాళ్ళు కొంతకాలం తర్వాత ఆరోగ్యకర జీవితం గడపలేరన్నది తన అభిప్రాయమన్నారు. త‌న‌ భార్య లత తనను ప్రేమతో ఎంతో మార్చిందన్నారు. ఆమె వల్లే తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్య లతకు రజినీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే లతను తనకు పరిచయం చేసిన మహేంద్రన్ కు రుణపడి ఉంటానని రజినీకాంత్ వ్యాఖ్యానించారు.

Next Story