Telugu Global
Cinema & Entertainment

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. చికిత్స పొందుతూ మృతి

Superstar Krishna Death: మంగళవారం ఉదయం 4.00 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు సినీ నటుడు నరేశ్ అనధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఆయన అంత్య క్రియలు ఎక్కడ చేయాలనే విషయాలను కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు.

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. చికిత్స పొందుతూ మృతి
X

సూపర్ స్టార్ కృష్ణ (79) ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుకు గురైన కృష్ణను గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కాగా, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో 1942 మే 31న కృష్ణ జన్మించారు. వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పుట్టిన ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.

ఆదివారం రాత్రి గుండెపోటుకు గురి కాగానే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సీపీఆర్ చేసి బతికించామని, ప్రస్తుతం వెంటిలేటర్‌పైన ఉంచామని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ఐసీయూలోనే కృష్ణకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కోలుకోలేక పోయినట్లు తెలుస్తున్నది. మంగళవారం ఉదయం 4.00 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు సినీ నటుడు నరేశ్ అనధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఆయన అంత్య క్రియలు ఎక్కడ చేయాలనే విషయాలను కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత మీడియాకు అధికారికంగా తెలిపే అవకాశం ఉన్నది.

మహేశ్ ఇంట ఒకే ఏడాది మూడు విషాదాలు..

సినీ నటుడు మహేశ్ బాబు ఇంటిలో ఏడాది వ్యవధిలో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో చనిపోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో జనవరి 8న ఆయన మృతి చెందారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న కృష్ణ భార్య, మహేశ్ తల్లి ఇందిర చనిపోయారు. ఇక ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా చనిపోయారు. కొన్ని నెలల వ్యవధిలోనే ముగ్గురిని కోల్పోయిన మహేశ్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.సూపర్ స్టార్ కృష్ణకు 1965లో ఇందిరను పెళ్లి చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఇక ఆ తర్వాత కాలంలో సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

తేనె మనసులు మొదటి చిత్రం..

ఏలూరులో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలని కృష్ణ భావించారు. అయితే సీటు రాకపోవడంతో సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యారు. నటులు జగ్గయ్య, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందిన వారు కావడంతో వారి ద్వారా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. అయితే అప్పటికి కృష్ణ వయసు తక్కువ కావడంతో కొన్ని రోజులు ఆగి చెన్నై (అప్పట్లో మద్రాసు) వస్తే అవకాశాలు ఇస్తామని చెప్పారు. దీంతో కృష్ణ.. ప్రజా నాట్య మండలిలో చేరి పలు నాటకాల్లో నటించారు. అలా కృష్ణ నటనలో ఓనమాలు నేర్చుకున్నారు.

1964లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన 'తేనె మనసులు' సినిమాతో కృష్ణ తెరంగేట్రం చేశారు. కృష్ణకు నటన రాదని, అతడు తెరపై చక్కగా కనిపించడం లేదని ఆదుర్తి సుబ్బారావుకు చాలా మంది చెప్పినా.. ఆయన నిర్ణయం మార్చుకోలేదు. తేనె మనసులు విడుదలై ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కన్నె మనసులు, గూఢచారి 116 సినిమాల్లో నటించారు. గూఢచారి 116 సినిమా ఘన విజయం సాధించి కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా ఆయనకు పేరు వచ్చింది. 6 చిత్రాల్లో ఆయన జేమ్స్‌బాండ్ లాగా నటించారు. కృష్ణకు గూఢచారి 116 తర్వాత ఏకంగా 20 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తొలి చిత్రం 'సాక్షి'. దీనికి బాపు దర్శకుడు. ఈ సినిమా పూర్తిగా అవుట్‌డోర్‌లో షూటింగ్ జరుపుకున్నది.అత్యధికంగా 340 సినిమాల్లో కృష్ణ నటించారు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడు కూాడా ఆయనే. 70-71 దశకాల్లో ఆయన ఏడాదిలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. 1968లో 10, 1969లో 15, 1970లో 16, 1971లో 11 సినిమాలు విడుదల అయ్యాయి. 1972లో 18 సినిమాలు ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1973లో 15 సినిమాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదల అయ్యాయి.

ఇక సినిమాల్లో కొత్త టెక్నాలజీని కృష్ణ తెలుగు సినిమాకు అందించారు. తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామ రాజు, తొలి 70 ఎంఎం సినమా సింహాసనం. ఇక కృష్ణ దర్శకుడిగా 16 సినిమాలు తీశారు. పద్మాలయ నిర్మాణ సంస్థే కాకుండా స్టూడియోను కూడా నిర్వహించారు.1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1989లో ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీకి స్నేహితుడైన కృష్ణ.. రాజీవ్ హత్య తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 2010 నుంచి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారాలు కృష్ణకు లభించాయి.

First Published:  15 Nov 2022 1:52 AM GMT
Next Story