Telugu Global
Cinema & Entertainment

పాటల బొమ్మా? ఫ్లాపుల భామా?

ఉరుములేని మెరుపులా అకస్మాత్తుగా తెలుగు సినిమాల్లో ఊడిపడ్డ శ్రీలీల ఆ మెరుపులు కూడా అప్పుడొకటీ అప్పుడొకటీ మెరిపిస్తూ పోతోంది. ఒక హిట్టిస్తే రెండు ఫ్లాపులు, ఒక హిట్టిస్తే రెండు ఫ్లాపులు టైపులో ఫ్లాపులతో హ్యాట్రిక్కులు కూడా సాధిస్తోంది.

పాటల బొమ్మా? ఫ్లాపుల భామా?
X

ఉరుములేని మెరుపులా అకస్మాత్తుగా తెలుగు సినిమాల్లో ఊడిపడ్డ శ్రీలీల ఆ మెరుపులు కూడా అప్పుడొకటీ అప్పుడొకటీ మెరిపిస్తూ పోతోంది. ఒక హిట్టిస్తే రెండు ఫ్లాపులు, ఒక హిట్టిస్తే రెండు ఫ్లాపులు టైపులో ఫ్లాపులతో హ్యాట్రిక్కులు కూడా సాధిస్తోంది. కేవలం రెండేళ్ళ క్రితం 2021 లో కన్నడ నుంచివచ్చి ‘పెళ్ళిసందడి’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో కాలుపెట్టిన తను, ఆ సినిమాలో డాన్సులకి పాపులరై తెలుగులో ఆఫర్ల జడివాన కురిపించుకుంది. ఈ రెండేళ్ళల్లో యింకో 5 సినిమాలు నటించేసింది. అవి కూడా స్టార్ సినిమాలు. రవితేజతో ‘ధమాకా’ ఇంస్టెంట్ హిట్టయ్యాక విపరీతమైన క్రేజ్ ని సృష్టించుకుంది. కానీ వెంటనే 2023 లో ఇప్పటికీ నటించిన నాల్గింటిలో మూడు అట్టర్ ఫ్లాపులు ఇచ్చి ప్రమాదంలో పడింది. రామ్ పోతినేనితో నటించిన ‘స్కంద’, వైష్ణవ్ తేజ్ తో నటించిన ‘ఆదికేశవ’, నితిన్ తో నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ అట్టర్’ ఫ్లాపులు కాగా, బాలకృష్ణతో కలిసి నటించిన ‘భగవంత్ కేసరి’ ఒక్కటే హిట్టయింది.

తను తెలుగులో అడుగు పెట్టగానే జరిగిన పరిణామం ఏమిటంటే అప్పుడున్న పాపులర్ హీరోయిన్లు పూజా హెగ్డే, రశ్మికా మందన్నలు ఔటై పోవడం. వీళ్ళ అవకాశాలు తనకొచ్చాయి. తను టాలీవుడ్ ని ఏలుకుంటున్న ఏకైక టాప్ స్టార్ గా జోరు పెంచింది. ఎంత పెంచిందో అన్ని ఫ్లాపులిచ్చింది. నటించడానికి ఏమీ లేని పాత్రలు నటించేసి ప్రేక్షకుల దృష్టిలో చులకనై పోయింది. ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ లలో కీలక పాత్రలు పోషించిన తను మిగిలిన అన్నిట్లో కేవలం పాటలకి కనిపించిపోయే డాన్సింగ్ డాల్ గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ఐటెమ్ గర్ల్ గా మారింది. ఇక ప్రేక్షకులకి ఆమె వున్న సినిమాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దర్శకులూ ఆమె పాపులారిటీని క్యాష్ చేసుకోవాలన్నట్టు డాన్సులకి వాడుకుని వదిలేస్తున్నారు. ఆమెకూడా తన పాత్రలేమిటో, అవెంతవరకు నిలబెడతాయో తెలుసుకోకుండా ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటూ పోయింది. ఫలితంగా రెండు సినిమాల హిట్ హీరోయిన్ కాస్తా, 3 సినిమాల ఫట్ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రతీ రెండో నెల ఒక స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చేస్తున్న తను, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ఇన్నేసి సినిమాలు ఒప్పేసుకుంటున్నట్టు కన్పిస్తోంది. డాన్సింగ్ సెన్సేషన్‌గా తనకి ప్రశంసలు దక్కాయి. సాయి పల్లవి, కీర్తి సురేష్‌ల వంటి ఎలైట్ డ్యాన్సర్స్ క్లబ్‌లో చేరింది కూడా. కానీ సాయిపల్లవి, కీర్తీ సురేష్ లు ఎక్కువ పేరు తెచ్చే తక్కువ సినిమాలు చేస్తూ గుర్తుండి పోతున్నారు. పూజా హెగ్డే, రశ్మికా మందన్నలని పంపించేసి తను చేస్తోంది ఏమిటనేది ప్రశ్నించుకోవాలి.

కేవలం 22 ఏళ్ళ వయసులో లుక్స్, టాలెంట్‌ అస్త్రాలుగా చేసుకుని టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ వున్న స్టార్ గా మారి మరిన్ని స్టార్ సినిమాలతో దూసుకుపోతున్న తను, అవైనా నిలబెట్టుకుంటే తను వుంటుంది. లేకపోతే లేదు. తనకి పోటీగా మృణాల్ ఠాకూర్, మీనాక్షీ చౌదరీలు ఇప్పటికే దూసుకొచ్చేస్తున్నారు. తాను మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నటిస్తోంది. ఇవి తనకి సేఫ్ గా వుండొచ్చు. అగ్రస్థాయిలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సూపర్ స్టార్‌లతో పరిమిత సినిమాలు చేసినప్పుడే తను మరికొంత కాలం వుండగలదు. ఇంకోటేమిటంటే పెద్ద స్టార్లతో వచ్చిన పాత్రలే చేయకుండా, చిన్న హీరోలతో తన కోసం తనకి నచ్చిన విలక్షణ పాత్రలు సృష్టిస్తే నటిస్తానంటే, అలాటివి ప్రత్యేకంగా సృష్టించి ముందుకొచ్చే నిర్మాతలూ దర్శకులూ వుంటారు. మృణాల్ ఠాకూర్ దుల్కర్ సల్మాన్ తో హీరోయిన్ ప్రాధాన్యం గల ఎమోషనల్ హిట్ డ్రామా ‘సీతారామం’ నటించినట్టు.

మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో సంచలనంగా మారింది. దీని తర్వాత చాలా విరామం తీసుకుని తాజాగా విడుదలైన ‘హాయ్ నాన్నా’ తో ఇంకా దగ్గరైంది. ఓవర్సీస్ లో కూడా. నానితో నటించిన ‘హాయ్ నాన్నా’ ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి తన నటనే కారణం. పెద్ద స్టార్లతో ఎన్ని కమర్షియల్ మాస్ మసాలాలు చేస్తున్నా, సెలెక్టివ్ గా ఇలాటి సినిమాలు కూడా చేస్తూంటే శ్రీలలకి గట్టి పునాదులు పడతాయి.

అలా మెరుపులు మెరిపించి ఇలా స్పీడుగావరస ఫ్లాపులతో కూడా ట్రెండింగ్ లో వుంటున్న శ్రీలీల గురించి షోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. తాను డిమాండ్ వున్నప్పుడే సంపాదన పెంచుకోవడంపై మాత్రమే దృష్టి సారించిందనీ, పేరు ప్రతిష్టల గురించి పట్టించుకోవడం లేదనీ, తనకి నటన రాదు- డాన్సులు మాత్రమే చేయగలదనీ సోషల్ మీడియాలో ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు. డాన్సులు కొంత కాలమే ఆకట్టుకుంటాయి, ఆర్ధవంతమైన పాత్రలు నటిస్తే ఎక్కువకాలం గుర్తుంటాయి.

First Published:  12 Dec 2023 10:58 AM GMT
Next Story