Telugu Global
Cinema & Entertainment

రూ. 2656 కోట్లతో షారుఖ్ గోల్డెన్ రన్!

2023లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ 3 సినిమాలతో చరిత్రలో కనీవినీ ఎరుగని బాక్సాఫీసు రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది 3 సినిమాలతో బాలీవుడ్ కి మొత్తం 2,656 కోట్ల రూపాయలు ముట్టజెప్పాడు.

రూ. 2656 కోట్లతో షారుఖ్ గోల్డెన్ రన్!
X

2023లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ 3 సినిమాలతో చరిత్రలో కనీవినీ ఎరుగని బాక్సాఫీసు రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది 3 సినిమాలతో బాలీవుడ్ కి మొత్తం 2,656 కోట్ల రూపాయలు ముట్టజెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వసూలు చేసిన ఈ మొత్తానికి డిజిటల్/ఓటీటీ హక్కుల మొత్తాలు కూడా కలిపితే 3 వేల కోట్లు దాటుతుంది. 2023 లో నటించిన కేవలం మూడు సినిమాలతో ఈ రికార్డు సాధించాడు. ఈ మొత్తం 2023 లో విడుదలైన తెలుగు, తమిళ సినిమాలన్నిటి బాక్సాఫీసు మొత్తాల కంటే ఎక్కువ. వరుస ఫ్లాపులతో నాలుగేళ్ళు విరామం తీసుకుని, 2023 లో రీ ఎంట్రీ ఇచ్చి, 3 సూపర్ హిట్ సినిమాలతో ఇలా గోల్డెన్ రన్ ఇస్తాడని ఎవరూ వూహించలేదు.

ఈ గోల్డెన్ రన్ 2023 జనవరిలో ‘పఠాన్’ తో ప్రారంభమైంది. జనవరి 25 న విడుదలైన ‘పఠాన్’ దేశీయంగా రూ. 543.22 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1069.85 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత సెప్టెంబర్ 7 న విడుదలైన ‘జవాన్’ దేశీయంగా రూ. 640.42 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1163.62 కోట్లు వసూలు చేసింది . దీనితర్వాత డిసెంబర్ 21న విడుదలైన ‘డంకీ’ డిసెంబర్ ఆఖరు వరకు దేశంలో రూ. 211.00 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 422.90 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా దేశంలో రూ. 1394.64 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 2656.37 కోట్లు (గ్రాస్) వసూలు చేశాయి ఈ మూడు సినిమాలు.

వివిధ డేటా, ఫిగర్-ట్రాకింగ్ సైట్‌ల ప్రకారం, 2023 సంవత్సరంలో విడుదలైన అన్ని తమిళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 2160 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. తెలుగు సినిమాలు రూ. 2300 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. కానీ షారుఖ్ నటించిన మూడు సినిమాలే రూ. 2656 కోట్లు వసూలు చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ సినిమాలు అన్నీ కలిపి విదేశాల్లో దాదాపు రూ. 2124 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఇందులో షారుఖ్ ‘పఠాన్‌’ రూ. 412 కోట్లు , ‘జవాన్‌’ రూ. 406 కోట్లు , ‘డంకీ’ రూ. 176.78 కోట్లు – మొత్తం రూ. 994.78 కోట్లు ఈ మూడు సినిమాలే వసూలు చేశాయి.

ఈ గోల్డెన్ రన్ ని రాబోయే కొత్త సినిమాలతో కూడా కొనసాగిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. 2024 లో కుమార్తె సుహానా నటిస్తున్న ఒక సినిమాలో అతిధి పాత్ర పోషిస్తున్నాడు. 2024 లోనే దర్శకుడు విశాల్ భరద్వాజ్ తో సినిమా కోసం చర్చల్లో వున్నాడు. 2024 నవంబర్ లో దర్శకుడు కరణ్ జోహార్ తో ఇంకా పేరు పెట్టని ఒక మూవీ వుంటుంది. దీని తర్వాత 2025 లో దర్శకుడు అట్లీతో ‘జవాన్ 2’, 2025 కమల్ హాసన్ తమిళంలో నటించిన ‘హేరామ్’ రీమేక్, 2026 లో ‘జవాన్’ దర్శకుడు అట్లీతో ‘లయన్’, సల్మాన్ ఖాన్ తో ‘టైగర్ వర్సెస్ పఠాన్’ వుంటాయి.

షారుఖ్ తన కెరీర్ లో నటించిన మొత్తం 66 సినిమాల్లో పదమూడే సూపర్ హిట్టయ్యాయి. 20 హిట్టయ్యాయి. 9 యావరేజ్ అయితే, 24 అట్టర్ ఫ్లాపయ్యాయి. 2016 నుంచి 2018 వరకు ‘ఫ్యాన్’, ‘డియర్ జిందగీ’, ‘రయీస్’, ‘జీరో’ అనే నాల్గూ అలవాటుగా సాఫ్ట్ రోల్స్ నటిస్తే అట్టర్ ఫ్లాపయ్యాక అజ్ఞాతంలో కెళ్ళిపోయాడు. 2023 లో ఇమేజి మేకోవర్ తో యాక్షన్ హీరోగా తిరిగి వచ్చి, ‘పఠాన్’ తో గోల్డెన్ రన్ ప్రారంభించాడు.

ఇలా వుండగా, 2024 సంవత్సరం తెలుగు, తమిళ రంగాలు సంక్రాంతి సినిమాలతో వైభవంగా ప్రారంభమవుతోంటే బాలీవుడ్ డల్ గా ప్రారంభమవుతోంది. 2024 జనవరి మొదటి శుక్రవారం హిందీ సినిమాల విడుదలలు లేవు. డిసెంబర్ చివర్లోనే ‘డంకీ’, ‘సాలార్’ పెద్ద సినిమాలు రెండు విడుదలవడంతో జనవరి తొలి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల చేయలేదు. జనవరి 12 న కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి నటించిన ‘మెర్రీ క్రిస్మస్ ‘ఎలాటి హడావిడి లేకుండా విడుదలవుతోంది. 19 న ‘మై అటల్ హూ’, ‘దశమి’ అనే రెండు చిన్న సినిమాల తర్వాత, చివరి వారం జనవరి 25 న హృతిక్ రోషన్, దీపికా పడుకొనే నటించిన ‘ఫైటర్’ విడుదలవుతోంది. మొత్తం కలిపి జనవరి నెలలో నాల్గే హిందీ సినిమాలతో డల్ గా ప్రారంభమవుతోంది బాలీవుడ్ కొత్త సంవత్సరం. ఇలా జనవరిలో కొత్త హిందీ సినిమాల కొనుగోళ్ళ భారం తప్పి ఓటీటీలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి.

First Published:  9 Jan 2024 6:42 AM GMT
Next Story